ఒక గొంతుకతో పరుల స్వరాలు పలికిస్తే.. మిమిక్రీ స్టార్. ఒక గళంతో.. సరిగమ స్వరాల రాగాలొలికిస్తే.. మ్యూజిక్ స్టార్. అదే గళం ఈ రెండిటిలో ‘పాట’వం ప్రదర్శిస్తే.. మ్యూజిక్రీ స్టార్. అనుకరించడమే అద్భుతమనిపిస్తే.. అనుస్వరించడం అంతకుమించి. ఇలాంటి అరుదైన సంగీత ప్రక్రియ ద్వారా గుర్తింపు పొందారు గాయని విజయలక్ష్మి. ప్రతి వేదికపై తన గాత్రంలో ఆ పాత గాయనీమణులను గుర్తుచేస్తున్న ఈ ప్రతిభామూర్తి ‘జిందగీ’తో తన సంగీత ప్రయాణాన్ని ఇలా పంచుకున్నారు…
మన్నాడే, ఓపీ నయ్యర్, బప్పీ లహరి, అను మాలిక్, సోనూ నిగమ్ లాంటి బాలీవుడ్ దిగ్గజాలు, పి.లీల, జిక్కి, ఎస్పీబీ, సుశీల, జానకి తదితర హేమాహేమీలతో వేదిక పంచుకున్నారు విజయలక్ష్మి. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌లోని ‘సినీ మ్యూజిషియన్స్ యూనియన్’కు రెండుసార్లు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. కొవిడ్ సమయంలో కళాకారులకు అండగా నిలబడి సమర్థవంతమైన లీడర్‌గా పేరుతెచ్చుకున్నారు. టీవీ, ఫిల్మ్ అవార్డ్స్ కమిటీల్లో సభ్యురాలిగా వ్యవహరించారు.
Singer Vijayalakshmi | ముంబయిలో ఓ సంగీతకచేరీ. వేదికపై విజయలక్ష్మి. ఆ కార్యక్రమానికి బాలీవుడ్ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ప్రత్యేక అతిథి. ప్రముఖ హిందుస్థానీ గాయకురాలు పర్వీన్ సుల్తానా కూడా హాజరయ్యారు. ‘కిస్మత్’ సినిమాలో ఓ పాటెత్తుకుంది విజయలక్ష్మి.
కజ్రా మొహబ్బత్ వాలా అఁఖియో మై యైసే డాలా ఆశాబోంస్లే పాడినట్టే అనిపించింది. అందులో వింతేం అనిపించదు. ఇంకో రెండు పంక్తుల తర్వాత.. ‘దునియా హై మేరే పీఛే.. లేకిన్ మై తేరే పీఛే’ లైన్లు వచ్చాయి.
ఉన్నట్టుండి విజయ గళాన్ని శంషాద్ బేగం ఆవహించింది. ఆశా, శంషాద్ బేగం ఆలపించిన ఈ ద్విగళ గీతాన్ని సినిమాలో అచ్చంగా వారు ఆలపించినట్టే విజయలక్ష్మి పంక్తి పంక్తికీ గొంతుమార్చి రక్తి కట్టించింది. ఆమెలోని ఈ వైచిత్రిని గుర్తించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వివిధ సంగీత కచేరీల్లో విజయలక్ష్మిని ‘మ్యూజిక్రీ’ కళాకారిణిగా పరిచయం చేసేవాడు.
భానుమతి, జిక్కి, ఎల్ఆర్ ఈశ్వరి, జానకి, నూర్జహాన్, ఉషా ఉతుప్, శంషాద్ బేగం, సల్మా ఆగా వంటి 25 మంది లబ్ధప్రతిష్ఠులైన గాయనీమణుల గొంతుకలను అలవోకగా అనుకరించగలదు విజయలక్ష్మి. ‘చిన్నప్పటి నుంచీ సంగీతం అంటే ప్రాణం. పాటలు బాగా వినేదాన్ని. ఒక్కో సింగర్ గాత్రంలో ఒక్కో ప్రత్యేకత ఉండేది. ఆ పాటలు తెలియకుండానే వారిలాగే పాడటం అలవాటైంది. తర్వాత సాధన చేశాను అది వేరే విషయం అనుకోండి. బేసికల్‌గా సహజంగా నచ్చిన గొంతుకలను అలాగే అనుకరించడం అలవాటుతో వచ్చిన అభ్యాసం’ అని చెబుతారు విజయలక్ష్మి.
Vijayalakshmi Sp
క్వీన్ ఆఫ్ ది స్టేజ్..
చిన్నప్పుడు చాలామంది పెద్దయ్యాక అదవుతాను, ఈ ఉద్యోగం చేస్తాను అని చెబుతుంటారు. కానీ, విజయలక్ష్మి ఇలాంటి పగటి కలలేం కనలేదు. ఆమెకు తెలిసింది సంగీతం ఒకటే. తన బాల్యమంతా సరిగమల స్వరాలతో జంటస్వరంగా సాగిపోయింది. అలాగని జీవితమంతా మోహనరాగంలా మనోహరంగా ఏం సాగిపోలేదు. ‘శివరంజని’ రాగంలా భారంగా గడిచిన రోజులూ ఉన్నాయి. కాకపోతే ‘మనసు మీదకు తీసుకునేంతటి కష్టాలేం నా కాలింగ్ బెల్ నొక్కలేద’ని ఆమె చెప్తారు.
నలభై ఏండ్ల కెరీర్లో బ్రేకుల్లేని మ్యూజిక్ జర్నీతో దాదాపు 15 దేశాలు చుట్టిరాగలిగానన్న ఆనందం, ఏడు వేల ప్రదర్శనలు ఇచ్చానన్న సంతోషం ముందు బాధలన్నీ దిగదుడుపే అంటారామె. నేపథ్య గాయనిగా కూడా దాదాపు 350 సినిమాలకు పాటలు పాడారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఒడియా భాషల్లోనూ పాడారు. డబ్బింగ్ కళాకారిణిగానూ కొందరు నటీమణులకు తన గొంతుకను అరువిచ్చారు.
‘దేవదాస్’, ‘విక్రమార్కుడు’, ‘వరుడు’, ‘యమగోల’, ‘పలాస’ తదితర చిత్రాలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా విజయలక్ష్మికి మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఓ టీవీ చానల్ ‘సరిగమ’ సంగీత కార్యక్రమంలో జాతీయస్థాయిలో రన్నర్‌గా నిలిచారు. మరో టీవీ చానల్‌కు చెందిన ‘మేరీ ఆవాజ్ సునో’ ప్రోగ్రాంలో విన్నర్‌గా నిలిచిన తొలి దక్షిణాది గాయనిగా గుర్తింపు పొందారు. ఎంతో మంది లెజెండరీ సింగర్స్, సంగీత దర్శకుల సమక్షంలో నిర్విరామంగా 24 గంటలసేపు పాటలుపాడి రికార్డు నెలకొల్పారు.
మ్యూజిక్ అకాడమీ నా కల…
హైదరాబాద్‌లో స్థిరపడ్డ విజయలక్ష్మి సొంతూరు మచిలీపట్నం. ఆమె తల్లిదండ్రులిద్దరూ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్నవాళ్లే. వాళ్లు ఇంట్లో సరదాగా డ్యూయెట్స్ పాడుతుంటే చిన్నప్పట్నుంచీ వింటూ పెరిగారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘సుమాంజలి’ ప్రోగ్రాంతో జర్నీ ప్రారంభించిన విజయలక్ష్మి.. యాంకర్‌గానే కాక కొన్ని సినిమాలు, సీరియళ్లలోనూ నటించారు. కొన్ని డబ్బింగ్స్ కూడా చెప్పారు. అమెరికా, యూకే, జర్మనీ, ఇతర దేశాల్లో కచేరీల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు.
వివిధ దేశాల్లోని తెలుగువారి పిల్లలకు ఆన్లైన్లో సంగీత పాఠాలు బోధిస్తున్నారు. భవిష్యత్తులో మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేయడం, తద్వారా ప్రొఫెషనల్ సింగర్స్‌కి కావాల్సిన తర్ఫీదు ఇవ్వాలని, తన వద్ద శిష్యరికం చేసినవారిని రియాలిటీ షోస్‌కి సిద్ధం చేయాలన్న తలంపుతో ఉన్నారు. ఈ మ్యూజిక్రీ కళాకారిణి ఆశయం నెరవేరాలని మనమూ ఆకాంక్షిద్దాం.
…? నరేశ్ ఆరుట్ల
ఎం.గోపీకృష్ణ