అవనిలో సగం.. ఆకాశంలో సగం.. మా జీవితాలపై, మా శరీరాలపై సంపూర్ణాధికారం ‘మాదే మాదే మాదే’ అంటూ ప్రపంచ మహిళలు గర్జిస్తున్న కాలమిది. అయినా పురుషాధిక్యత అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో కొనసాగుతూనే ఉంది. స్త్రీ జాతిని విషనాగులా వెంటాడుతూనే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా అతివ కూడా ప్రతిఘటిస్తూనే ఉంది. ఆ ఘర్షణలో ఉద్భవించిన ఓ వాస్తవ ఘటనకు ప్రతిరూపమే ఈ ‘మూల్యం’ నాటిక.
జయతి, రాజారావు దంపతులు. వీరిది మధ్య తరగతి కుటుంబం. రాజారావు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మర్యాదస్తుని ముసుగులో జీవిస్తున్న స్వార్థపరుడు, పైగా పురుషహంకారి. జయతి తండ్రి సోమసుందరం అనారోగ్యంతో కూతురు ఇంటికి వస్తాడు. ఆయన్ను ఎలాగైనా వదిలించుకోవాలని రాజారావు ప్రయత్నిస్తాడు. జయతికి తండ్రి అంటే చాలా అభిమానం. సోమసుందరం కొడుకు (జయతి అన్న) కుటుంబం అదే ఊరిలో ఉంటున్నా తండ్రిని సరిగ్గా పట్టించుకోడు. అందుకే సోమసుందరం బిడ్డ దగ్గరికి వస్తాడు. అతని రెండు కిడ్నీలు చెడిపోయాయని, ఎవరైనా కిడ్నీ దానం చేస్తే తప్ప బతకడని వైద్యులు చెబుతారు. తండ్రికి తన కిడ్నీ డొనేట్ చేయాలని నిర్ణయానికి వస్తుంది జయతి. అందుకు ఆమె భర్త కుదరదంటాడు. ‘నువ్వు కిడ్నీ దానం చేస్తే, నీకు ఈ ఇంటి తలుపులు మూసుకుపోతాయి’ అని బెదిరిస్తాడు. అయినా జయతి తన నిర్ణయానికే కట్టుబడి ఉంటుంది.
కిడ్నీ దానం చేయడం కోసం హాస్పిటల్కి వెళ్తారు తండ్రీకూతుళ్లు. జయతి కిడ్నీ ఇవ్వాలంటే ఆమె భర్త సంతకం కావాలని హాస్పిటల్ సిబ్బంది కోరుతారు. ఇక్కడే నాటిక మలుపు తిరుగుతుంది. ‘నేను మా నాన్నకు స్వయంగా దానం చేస్తుంటే మధ్యలో మావారి సంతకం ఎందుకండీ?’ అని ప్రశ్నిస్తుంది ఆమె. ‘మీకేదైనా కాంప్లికేషన్స్ జరిగితే మీవారి నుంచి మాకెలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదని, ముందు జాగ్రత్త చర్యగా ఈ ఫార్మాలిటీస్’ అని డాక్టర్ తేలిగ్గా అంటాడు. తను ఉన్న పరిస్థితుల్లో జయతికి ఆ మాట మింగుడుపడదు. డాక్టర్తో వాదనకు దిగుతుంది. ‘ఆడా, మగా సమానమని లెక్చర్లు దంచుతూనే, ఈ నాన్సెన్స్ ఫార్మాలిటీస్ ఏమిటీ?’ అని ప్రశ్నిస్తుంది. డాక్టర్ ‘కుదరదు’ అంటే, ఈ విషయంలో న్యాయం కోసం జయతి కోర్టుకు వెళ్తుంది. తన శరీరంపై తనకే సంపూర్ణ హక్కు ఉన్నదో, లేదో తేల్చమని కోర్టును అడుగుతుంది.
కోర్టులో న్యాయ విచారణ మొదలవుతుంది. ‘ఫార్మాలిటీస్ పేరుతో హాస్పిటల్ వాళ్లు విధిస్తున్న నిబంధనలు చట్టపరంగా రూపుదాల్చాయా?’ అని జడ్జి అడుగుతాడు. ‘లేదు యువరానర్! అన్ని హాస్పిటల్స్ పాటించే రూల్సే ఈ దవాఖానలోనూ ఉన్నాయి. ‘ప్రాక్టీస్ బికమ్ రూల్” అంటూ హాస్పిటల్ పక్షాన వకాల్తా పుచ్చుకున్న లాయర్ బ్రహ్మం వాదిస్తాడు. ‘తాత్సారం చేసిన కొద్దీ పేషెంట్ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంద’ని జయతి తరఫు లాయర్ వేణు హెచ్చరిస్తాడు. ‘కిడ్నీ దాత, కిడ్నీ స్వీకర్త ఇక్కడే ఉన్నారు. తీసుకునేవారికీ, ఇచ్చేవారికీ ఏ అభ్యంతరమూ లేదు. పైగా ఇద్దరూ మేజర్లే! మధ్యలో భర్త సంతకం ఎందుకండీ? మరి భర్త విషయంలో భార్యను కూడా మీరిలాగే సంప్రదిస్తున్నారా?’ అని జయతి ప్రశ్నిస్తుంది. ‘ఈ రెండు నాల్కల ధోరణి వింతగా లేదూ… మగవారికి వర్తించని రూలు ఆడవారికే ఎందుకు? అలాంటప్పుడు మగవారు స్త్రీలకంటే అధికులమని చెప్పటమే కదా?’ అని జయతి కోర్టును ప్రశ్నిస్తుంది.
మధ్యలో కోర్టులో ప్రవేశించిన రాజారావు ‘పెళ్లప్పుడు మీ నాన్న నిన్ను నాకు కన్యాదానం చేశాడు. కనుక నీ మీద సర్వాధికారాలు నాకే ఉంటాయి’ అంటాడు. ‘నేను నీకు యజమానిని, నువ్వు నాకు దాసితో సమానమ’ని సమర్థించుకుంటాడు. వాదనలన్నీ విన్నాక… ‘కిడ్నీ దానానికి జీవిత భాగస్వామి (భర్త) అనుమతి అవసరం లేదు’ అని కోర్టు తీర్పు చెబుతుంది. అయితే అప్పటికే తండ్రి సోమసుందరం కుప్పకూలి మరణించడంతో విషాదం అలముకుంటుంది. ‘నా శరీరంపై హక్కు నాదే’ అని నిరూపించుకోవడానికి ‘నేను చెల్లించిన మూల్యం నా కన్నతండ్రి ప్రాణాల’ంటూ జయతి కోర్టులో బావురుమంటుంది.
నాటిక ప్రారంభంలో తండ్రి-కూతుళ్ల సంభాషణల్లో, వివాహ వ్యవస్థ ప్రస్తావన వచ్చినప్పుడు కొంత మెలోడ్రామా తొంగి చూసినప్పటికీ, కోర్టులో వ్యక్తం అయ్యే వాద ప్రతివాదనలే ఈ నాటికకు బలమైన ఆకర్షణ. ఇందులో జయతి బలమైన పాత్ర. నటించే వారికి కూడా ఇలాంటి భావాలు ఉంటేనే నాటకం రక్తి కడుతుంది. గోవాడ క్రియేషన్ ఏడాది కాలంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో పలు వేదికలపై ఈ నాటికను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రదర్శించిన ప్రతిచోటా ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నది.
నాటకం పేరు: మూల్యం
రచయిత: సింహప్రసాద్
దర్శకత్వం: డా॥ వెంకట్ గోవాడ
సంస్థ: గోవాడ క్రియేషన్, హైదరాబాద్
నటీనటులు:
కథాంశం: పురుషుడికి తన శరీరంపై ఎలాగైతే సర్వాధికారాలు ఉంటాయో, స్త్రీకి కూడా ఆమె శరీరంపై అంతే అధికారం ఉండాలని కోరుకునే అతివ కథ ఇది. భర్త ఆక్షేపించినా.. తండ్రికి కిడ్నీ దానం చేయడం కోసం ఓ ఇల్లాలు చేసిన న్యాయపోరాటం ఈ నాటిక.
…? కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు