మృణాళిక భంజ్‌దేవ్, అక్షిత భంజ్‌దేవ్.. ఒరిస్సాలోని మయూర్భంజ్ సంస్థాన వారసులు. ఇటీవల ఈ ఇద్దరూ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అతిథులుగా హైదరాబాద్ వచ్చారు. ఇద్దరిలోనూ ఆంత్రప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలు కోకొల్లలు. అందుకే, తమ రాజసౌధాన్ని బొటిక్ హోటల్‌గా మార్చేసి.. పర్యాటకులకు గత వైభవాన్ని పరిచయం చేస్తున్నారు. ఇద్దరూ విదేశాల్లో చదువుకున్నారు. ఎక్కడున్నా.. వారసత్వ సంప్రదాయాన్ని మర్చిపోలేదు. తాతముత్తాల నాటి బెల్గాడియా ప్యాలెస్ శిథిల స్థితికి చేరుకోవడం వారిని కలవరానికి గురిచేసింది. దీంతో, పాత వైభవం ఏ మాత్రం మసకబారకుండా.. అంతే అందంగా పునరుద్ధరించారు. పనిలోపనిగా, ఇక్కడికొచ్చే టూరిస్టులకు స్థానిక హస్త కళలను పరిచయం చేస్తున్నారు. రాజసౌధం పునరుద్ధరణలోఎక్కడా పర్యావరణానికి విఘాతం కలిగించే విధానాలను అనుసరించలేదు. రసాయనాలను ఉపయోగించలేదు. పాత ఫర్నిచర్‌కే మరమ్మతులు చేయించి సరికొత్తగా తీర్చిదిద్దారు. ‘మనం బతకాలి. నలుగురినీ బతికించాలి. ప్రకృతిని కూడా కాపాడుకోవాలి. ఇదే మా విధానం, నినాదం కూడా’ అంటున్నారు మృణాళిక, అక్షిత.