మబ్బులు ముంగిట్లో చిరుజల్లుల ముగ్గులు వేసే సమయం. వాన పరవళ్లు వాడంతా సందడి చేసే తరుణం. నింగీ నేలా నావేనంటూ వర్షపు ధారలు జోరెత్తినా మనం మాత్రం ఊరంతా వాటికి అప్పగించలేం. వాటితో కలిసి నిత్య జీవన గీతం పాడాల్సిందే. వానను చూసి ఎంత ఆనందపడ్డా ఆ సంబురంలో మురిసిపోగలమే తప్ప, తడిసి ముద్దయ్యే పరిస్థితి ఉండదు. అందుకే గొడుగు, రెయిన్‌కోటు, చెమ్మ చేరని చెప్పులూ మనకు చేదోడు వాదోడు. ఈ చినుకు రాలే కాలంలోనూ తళుకులీనాలన్న నేటితరం అభిలాషకు తగ్గట్టు ఇప్పుడు అవి కూడా ఫ్యాషనబుల్‌గా ముస్తాబై వస్తున్నాయి. మరి వానకాలపు ఫ్యాషన్ మీద ఓ లుక్కేద్దామా!
వానల్లో బయట అడుగు పెట్టాలంటే రెయిన్‌కోట్ రక్షణ కవచం తప్పనిసరి. ముఖ్యంగా బండి మీద ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఆఫీసు నుంచి బస్సెక్కాలన్నా వానకోటు చాలా అవసరం. లేకపోతే గాలితోపాటు వచ్చే జల్లులకు దుస్తులు తడిసి ముద్దయ్యే అవకాశం ఉంది. అయితే అలా నీళ్లు లోపలికి దూరకుండా చేసే సాదా కవర్ల తరహా రెయిన్కోట్లకు భిన్నంగా ఇప్పుడు పూలల్లో వెరైటీ లుక్‌తో ఉండేవి వస్తున్నాయి. మ్యాక్సీ డ్రెస్‌ల మోడల్వీ, లాంగ్ టాప్ తరహావీ, హుడీ మోడల్వీ వీటిలో ఉంటున్నాయి.
ముచ్చటైన పూలు, చక్కని డిజైన్లు ఈ కోట్ల ప్రత్యేకతలు. చూడగానే ఏదో ఫ్యాషనబుల్ డ్రెస్ వేసుకున్నట్టు కనిపిస్తాయే తప్ప, రెయిన్‌కోట్ తొడుక్కున్నట్టుగా అనిపించవు. అచ్చంగా ఈ తరం ఆడపిల్లలు కోరుకునేదీ అదే కాబట్టి డిజైనర్లు కూడా బోలెడు ప్రయోగాలు చేసి వీటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ట్రెండీగా కనిపించే రెయిన్కోట్లు ఈ మాన్సూన్ ఫ్యాషన్.
వర్షాకాలం వచ్చిందంటే కొన్నిసార్లు అడుగు బయటపెట్టడం కష్టం అనిపిస్తుంది. చెప్పులు, బూట్లు తడిసిపోయాయంటే ఆరబెట్టుకోవడం, పోనీ రోజంతా వాటితో నెట్టుకురావడం సాదాసీదా విషయమేమీ కాదు. అందుకే ఈ సీజన్ జెల్లీ చెప్పులకు జై అంటుంది. గ్లాసీ లుక్‌తో చూసేందుకు జెల్లీలా ఉండే ఇవి ఎంత తడిసినా చటుక్కున ఆరిపోతాయి. అసలివి నీటినే పీల్చుకోవు. ఇప్పుడు వీటిలో ఎన్నో వెరైటీలు దొరుకుతున్నాయి. షూ, కట్షూ, శాండల్… ఇలా విభిన్న రకాల పాదరక్షలు ఈ తరహాలో వస్తున్నాయి.
హీల్స్, ఫ్లాట్స్ కూడా వీటిలో ఎంచుకోవచ్చు. సాదాగా గాజులా పారదర్శకంగా ఉండే వాటితోపాటు చమ్కీ వేసినట్టు మెరిసేవీ, పూల డిజైన్లు వచ్చేవీ… ఇలా ఎన్నో వెరైటీలు దొరుకుతున్నాయి. మన కాలికి నప్పేలా, అభిరుచికి తగట్టు ఎంచుకోవడమే తరువాయి. అసలే బీచ్ ఫ్యాషన్‌ని తెగ ఇష్టపడే ఈ తరం అమ్మాయిలు జెల్లీ చెప్పులకు మనసిచ్చేస్తున్నారు.
చిటపట చినుకులు పడ్డ ప్రతిసారీ చెట్టు కిందికి వెళ్లడం కుదరదు. అందుకే అందరం గొడుగు చాటున చేరుతాం. వానకాలం ఛత్రమే హస్తభూషణంలా అలరారుతుంది. జల్లు పడితే నెమలి పింఛం విప్పుతుందో లేదో కానీ మనం మాత్రం చటుక్కున చెత్రి తెరిచేస్తాం. అయితే అది కూడా ఎప్పుడూ ఒకేలా బోరింగ్‌గా ఎందుకుండాలి అని ఆలోచించి కాస్త విభిన్నతను జోడించారు సృజనాత్మకత కలిగిన తయారీదారులు. అందులో భాగంగా మార్కెట్లోకి వచ్చినవే మ్యాజిక్ అంబ్రెల్లా, కలర్ చేంజింగ్ అంబ్రెల్లాలు.
పొడిగా ఉన్నప్పుడు సాదాగా ఉండే మ్యాజిక్ అంబ్రెల్లా మీద వాన చినుకులు పడగానే పూలు వికసిస్తాయి. అదేనండీ పూల డిజైన్లు కనిపిస్తాయి. ఇక కలర్ చేంజింగ్ అంబ్రెల్లాల మీద డిజైన్లు ఉంటాయి. మామూలుగా ఉన్నప్పుడు తెలుపు రంగులో ఉండే డిజైన్లు, నీటి తడి తగలగానే రంగులు దిద్దినట్టు కలర్ఫుల్గా మారిపోతాయి. సీజన్‌ను బట్టి వాడే వస్తువులే అయినా విభిన్నంగా ఉండాలి అనుకునే వారికి ఈ వానకాలం ఇదో డిఫరెంట్ కలెక్షన్ అనే చెప్పొచ్చు!