ఆ యువతి కుంచె నుంచి జాలువారిన చిత్రాల్లో జీవకళ ఉట్టిపడుతుంది. రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, సినీ నటులు..ఏ బొమ్మ అయినా బ్రహ్మకు సవాలు విసురుతుంది. చదువుకుంటూనే చిత్రకళ ద్వారా నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తూ.. అందులో కొంత అనాథ పిల్లలకు సాయంగా అందిస్తున్నది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన మేఘనారెడ్డి. ఆమె తల్లి దండ్రులు.. జక్కడి వెంకట్‌రెడ్డి, కవిత. కరోనా సమయంలో యూట్యూబ్‌లో చూసి పెన్సిల్ ఆర్ట్, పోర్ట్రయిట్, వాటర్ కలర్ పెయింటింగ్ నేర్చుకున్నది మేఘన. తను గీసిన చిత్రాలను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసేది. దీంతో తమ బొమ్మ గీసిపెట్టమనో, ఇంటి అలంకరణ కోసం వాల్ పెయింటింగ్ వేసివ్వమనో చాలామంది అభ్యర్థనలు పంపేవారు.
అలా చిత్రకళ మేఘన వ్యాపకంగా మారిపోయింది. సంపాదనా మొదలైంది. ఆ ఆదాయంలో 30 శాతం తాగం ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నది. ఈ సంస్థ అనాథ బాలల కోసం పనిచేస్తుంది. మేఘన చదువుల్లోనూ ఫస్టే. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీఎస్సీ ఫైనలియర్ చదువు తున్నది. ఖాళీ సమయంలో ఇంటి దగ్గర విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెబుతుంది. “చదువు, చిత్రలేఖనంలో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, నాన్నతో ‘మేడం’ అని పిలుపించుకోవాలని కోరిక” అంటున్నది మేఘనారెడ్డి.
