ఒక అత్యున్నత నిర్మాణం వెనుక తప్పకుండా ఒక అత్యుత్తమ కృషి ఉంటుంది. జమ్మూ- శ్రీనగర్లను అనుసంధానించేందుకు నిర్మించిన భూమి మీది అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన వెనుక కూడా అలాంటి కష్టమే ఉంది. ప్రపంచాన్ని అబ్బురపరిచే ఈ నిర్మాణంలో తెలుగు వనిత డా॥ గాలి మాధవీలత పదిహేడేండ్ల శ్రమ దాగుంది. నేలకు వేల అడుగుల ఎత్తున పట్టాలు పెట్టించడానికి ఆమె బృందం ఎన్నుకున్న టెక్నిక్.. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలోనే సరికొత్త మార్గంగా మారింది.
అసాధ్యమనిపించే పనిని సుసాధ్యం చేసి చూపిస్తే అది చేసిన వారికే కాదు, చూసిన వారికీ ఆనందాన్ని కలిగిస్తుంది. హిమాలయ సానువుల్లో చీనాబ్ వంతెన మీదుగా రైలు ప్రయాణం చేసేవారు తప్పకుండా ఈ ఆనందానుభూతిని పొందుతారు. శత్రుదుర్భేద్యం అనదగిన కొండలను తొలిచి భారత్‌లోనే తొట్ట తొలిసారిగా నిర్మించిన స్టీల్ ఆర్క్ బ్రిడ్జ్ అది. చీనాబ్ నదీ పాయకు 1200 అడుగుల ఎత్తున, 4300 అడుగుల పొడవుతో దీన్ని నిర్మించారు. అయితే సాధారణంగా ఇప్పటిదాకా భారత్‌లో జరిగిన బ్రిడ్జిల నిర్మాణానికీ దీనికీ చాలా తేడా ఉంది. ఆకాశానికీ నేలకూ మధ్య దీన్ని నిర్మించాలంటే పర్వతాలు, రాళ్లు వాటి స్వభావాల్లాంటి అనేక విషయాల మీద లోతైన అవగాహన అవసరం. అందుకే ఐఐటీలో చదువుకుని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి రాక్ మెకానిక్స్‌లో పోస్ట్ డాక్టోరల్షిప్ చేసిన డా॥ మాధవీలత వంతెన నిర్మాణంలో కీలకంగా వ్యవహరించగలిగారు. ఈ ప్రాజెక్టులో కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించారామె. ఆమెది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు.
పని ముందుకు వెళ్తున్న దాన్నిబట్టి వంతెనను డిజైన్ చేస్తూ పోవడమే అని చెప్పేదే మాధవీలత బృందం ఎంచుకున్న డిజైన్ యాజ్ యూ గో టెక్నిక్. మిగతా నిర్మాణాలు వాటి ప్రణాళికలకు దీనికీ అసలైన భేదం ఇక్కడే ఉంది. నేల స్వభావం, గట్టిదనం, నీరు పారే వేగం, దిశలాంటి వివిధ అంశాలను బట్టి సాధారణంగా ఇంజినీర్లు వంతెనల నిర్మాణానికి ప్లాన్ గీస్తుంటారు. అయితే ఇక్కడ పరిస్థితి వేరు. దీని గురించి మాధవీలత ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్‌లో రాసిన అనుభవాల ప్రకారం… ఆ పర్వతాల మీద విభిన్నమైన రాళ్లు ఉన్నాయి. ముందుగా వాటి స్వభావాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. వాటి పటిష్టత కూడా పెద్ద అంశమే. దాని ఆధారంగానే స్టీలు యాంకర్లు వేయాల్సి ఉంటుంది. అయితే కొండల అంచున వేర్వేరు రాళ్లే కాదు, వాటిలో పెద్ద పెద్ద ఖాళీలు కూడా ఉన్నాయి. కాబట్టి వంతెనను నిలబెట్టడానికి ముందు వాటిని కాంక్రీట్‌తో నింపాల్సి వచ్చింది.
మరో విషయం ఏంటంటే అంత ఎత్తున గాలి కూడా విపరీతమైన వేగంతో వస్తుంది. నిరంతరం అలాంటి గాలులకు వంతెన తట్టుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ ప్రదేశంలో పనిచేస్తున్నాం, అక్కడి పరిస్థితులేంటి అన్నదాన్నిబట్టే వంతెనను డిజైన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాం. నిర్దిష్టమైన ప్లాన్ పెట్టుకుని అలాగే వెళ్లాలంటే ఇక్కడ కుదరదు. అందుకే ఈ వంతెన రూపకల్పన (డిజైనింగ్) విషయంలో పనితోపాటు మార్పులు చేసుకునే పద్ధతినే అనుసరించారు. మరో విషయం ఏమిటంటే ఏకంగా రిక్టర్‌స్కేలు మీద 8 తీవ్రతలో ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. -20 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రతలు… ఇవి కాక ఈ ప్రాంతంలో టెర్రరిస్టులు దాడికి తెగబడే అవకాశాలూ ఎక్కువే. అందుకే 63 మిల్లీమీటర్ల మందంతో కాంక్రీట్, స్టీల్ కలగలిపిన బ్లాస్ట్‌ప్రూఫ్ పిల్లర్లను నిర్మించారు. హిమాలయ పర్వతాల ఎత్తుపల్లాల్లో ప్రయాణించి సామగ్రిని చేర్చేందుకు తొలుత మార్గం లేదు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నాది ఒక పాత్ర మాత్రమే. ముఖ్యంగా వాలు ప్రాంతాల్లో వంతెనను పటిష్ట పరిచే డిజైన్‌కు సంబంధించే నేను ఎక్కువ పనిచేశాను. అంత మాత్రాన నేనేదో గొప్ప అన్నట్టు ప్రచారం చేయడం సరికాదు. దీని నిర్మాణంలో వేల మంది పనిచేశారు. అందరూ ఈ ప్రశంసలకు అర్హులే!
అప్పుడు గుర్రాలు, గాడిదలే వాహనాలు. ప్రస్తుతం జమ్మూ, శ్రీనగర్ నగరాల మీదుగా వెళ్లే విమానాల్లో ఈ వంతెన వచ్చినప్పుడు పైలట్లు ప్రత్యేక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ప్రయాణికులూ ఎంతో ఆసక్తిగా ఫొటోలు తీసుకుని ఆనందిస్తున్నారు. పడవల్లో వెళ్లి అంచనాలు వేసుకుని, తీవ్రమైన చల్లగాలులకు తట్టుకుంటూ, రోజుల తరబడి చంటిబిడ్డల్ని కూడా వదిలి తాను శ్రమించిన పని పూర్తవడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు మాధవీలత. త్వరగా కుటుంబంతో వంతెన మీదుగా ప్రయాణించాలని ఉవ్విళ్లూరుతున్నానంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.