Idli Day | ‘భూమి ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ‘ఇడ్లీ ఆకారంలో..’ అని జవాబు రాశాడట ఓ వీరాభిమాని. ‘రోజూ చూసే ఆకాశంలోనే రోజూ చూసే నక్షత్రాల్ని చూస్తూ.. రోజూ పొందని అనుభూతిని పొందడమే కవిత్వం’ అంటారు. ఇడ్లీకి కూడా ఈ పోలిక వర్తిస్తుంది. కాస్త భావుకతతో చూసినప్పుడు తెల్ల్లగా, గుండ్రంగా పున్నమి చంద్రుడిలా కనిపిస్తుంది. ఏ సైన్స్ ఫిక్షనో చూస్తూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు.. పళ్లెంలో వాలిన ఫ్లయింగ్ సాసర్లా అనిపిస్తుంది. ఏ చాగంటివారి ఉపన్యాసమో వింటూ పొట్ట నింపుకొంటున్నప్పుడు కొలెస్ట్రాలాసురుడిపై విష్ణుమూర్తి సంధించిన మందపాటి సుదర్శన చక్రమే.. మన నోటిని పావనం చేయడానికి ఇడ్లీలా అవతరించిందని మురిసి పోతాం. క్షీరసాగర మథనంలో అమృతంతోపాటే ఇడ్లీ కూడా పుట్టిందని అల్లం చట్నీ సాక్షిగా వాదించేవారూ లేకపోలేదు. అందుకు కారణం.. ఇడ్లీలోని అపార పోషకాలే! ఆ మక్కువతోనే భోజనప్రియులంతా కలిసి మార్చి 30ని ‘ఇడ్లీ డే’ గా ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్ని వైవిధ్యమైనఇడ్లీల పరిచయం.
ఇడ్లీ ఆత్మ అయితే.. ఇడ్లీ పిండి శరీరం. పిండి ఎంత బాగా కలుపుకొంటే ఇడ్లీ అంతబాగా కుదురుతుంది. అలా అని ఇదేం రాకెట్ టెక్నాలజీ కాదు.. ఒక కప్పు మినుప పప్పు, రెండు కప్పుల ఇడ్లీ రవ్వ ఐదు గంటల పాటు వేరువేరు పాత్రలలో నానబెట్టుకోవాలి. కప్పునకు నాలుగు కప్పుల చొప్పున నీళ్లు సరిపోతాయి. నానబెట్టిన మినుప పప్పును మిక్సీ లేదా గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పిండిలో ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కలపాలి. ఆ మిశ్రమాన్ని ఆరుగంటల పాటు ఒక గిన్నెలో మూత బెట్టి ఉంచాలి. ఆ తర్వాత, సరిపడా ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. ఇక ఇడ్లీల తయారీ ప్రారంభించవచ్చు.
ఒక మూకుడు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. నూనె కొద్దిగా వేడెక్కగానే టేబుల్ స్పూన్ ఆవాలు, ఒకటిన్నర స్పూన్ మినుప పప్పు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి సెనగపప్పు వేయాలి. చిటపట మనగానే చిటికెడు ఇంగువ చిలకరించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, దోరగా వేగుతున్నప్పుడు.. అప్పటికే సిద్ధం చేసుకున్న కొబ్బరి తురుము (5 స్పూన్లు) వేసుకోవాలి. అలాగే, రెండు కరివేపాకు రెబ్బలు సన్నగా తరిగి.. చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడితోపాటు వేయాలి. సగం టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయాలి. ఆ తర్వాత, ఈ మొత్తం మిశ్రమాన్ని ఇడ్లీపిండిలో కలపాలి. దాంతో ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
ముందుగా ఒక బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి సగం స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర జోడించి చిటపటమంటూ ఉండగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అంతేకాదు, తరిగిన ఆలుగడ్డను మెత్తగా మెదుపుకొని కలపాలి. చిటికెడు ఇంగువా వేసుకోవచ్చు. ఓ రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి మిరియాలపొడి లేదా కారం చిటికెడు జోడించి.. తగినంత ఉప్పు వేయాలి. ఆ తర్వాత మూత పెట్టి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. దించేప్పుడు మాత్రం, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రెండు స్పూన్ల మొలకలను కలపాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేస్తే పోషక విలువలు పోతాయి. అందుకే దించే ముందు కలుపుకోవడమే ఉత్తమం. ఈ మిశ్రమాన్ని పిండిలో కలిపి ఇడ్లీ ప్లేట్స్‌లో వేసి..కుక్కర్లో పెట్టాలి. సాంబారుతో సూపర్‌గా ఉంటాయి.
ఒక క్యారెట్, సగం బీట్రూట్, నాలుగు బీన్స్‌తోపాటు పిల్లలు ఇష్టంగా తినే ఇతర కూరగాయలనూ జోడించవచ్చు. బాదం, పిస్తా, జీడీ పప్పు కూడా వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, మిరియాలు కూడా వేయాలి. ఈ వెజ్జీ మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి, ఈ మిశ్రమాన్ని వెయ్యాలి. పైన ఇడ్లీ పిండి పోయాలి. సాధారణ ఇడ్లీల్లానే కుక్కర్లో పెట్టుకుంటే సరి.
ముందుగా నాలుగు స్పూన్ల కరివేపాకు పొడి, రెండు స్పూన్ల కారం ఓ పాత్రలో వేసుకోవాలి. నచ్చిన ఆకుకూరలు సన్నగా తరిగి లేదా గ్రైండ్ చేసుకుని అందులో వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత, పిండిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రల్లో పోయాలి. కుక్కర్‌ను ఓ మోస్తరు మంట మీద ఉంచితే సరిపోతుంది.
ఒక్కోసారి ఇంట్లో చట్నీలు మిగిలిపోతాయి. అసలే నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. చూస్తూ చూస్తూ వృథాగా పడేయలేం కదా. ఈ సమస్యకు పరిష్కారమే చట్నీ ఇడ్లీ. ఇడ్లీ పిండిని కుక్కర్ ప్లేట్లో వేసి ..ఆ పిండి మధ్యలో చిటికెడు చట్నీ వేయాలి. పైన ఇంకొంత ఇడ్లీ పిండితో కవర్ చేయాలి. తర్వాత.. కుక్కర్‌ను స్టౌ మీద పెట్టాలి. ఓ మోస్తరు మంట సరిపోతుంది. తింటున్నప్పుడు, మరో చట్నీ అవసరం కాకపోవచ్చు. అన్నిరకాల చట్నీలూ ఈ ఇడ్లీలకు పనికొస్తాయి.
– రాధికా ఫణి వంగర టెక్సాస్, అమెరికా