చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టి నష్టాలు రాగానే చేతులెత్తేస్తుంటారు. మరికొందరు స్టార్టప్‌లు ప్రారంభించి.. వాటికి ఆదరణ లేదని వదిలేస్తుంటారు. అలాంటివారికి అండగా నిలుస్తున్నది సిద్దిపేట స్టార్టప్ కమ్యూనిటీ. సిద్దిపేటలోని కోమటిచెరువు ఈ అంకురాల ఆలోచనలకు వేదికైంది. రండి మాట్లాడుకుందాం, అభిప్రాయాలు పంచుకుందామని అందరి ఆలోచనలు ఏకం చేసింది మాత్రం ఇద్దరు యువకులు. వారే రామని మధు. ఆచి విజయ్. ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఎంతో ఆదరణ పొంది నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నది ఈ స్టార్టప్ కమ్యూనిటీ. ఈ సందర్భంగా వ్యవస్థాపకుల్లో ఒకరైన రామిని మధు బతుకమ్మతో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే
నేను పడిన ఇబ్బందులు మరొకరు పడొద్దనే ఉద్యోగం వదిలేసి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. మాది సిద్దిపేట పక్కన చిన్నకోడూరు. నాన్న టీచర్, అమ్మ గృహిణి. నాకు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చినా మార్గదర్శనం చేసేవాళ్లు లేక టాప్ కాలేజీకి బదులు సాధారణ కళాశాలలో బీటెక్ పూర్తిచేశాను. ఆ తరువాత ఇష్టం లేకున్నా రెండున్నరేళ్లపాటు హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేశాను. ఆ సమయంలోనే అసలు భవిష్యత్తులో తమకు ఏం కావాలో? ఒక ఉద్యోగం కోసం ఎలాంటి కసరత్తు చేయాలో తెలియని చాలామంది యువతను గమనించాను.
అలాంటివాళ్లకోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో… ఉద్యోగానికి రాజీనామా చేసి సిద్దిపేట బాటపట్టాను. అలా 2020లో కెరీర్ గైడెన్స్ ఇచ్చేందుకు వాట్‌నెక్ట్స్ కన్సల్టెన్సీని ప్రారంభించాను. కొంతమంది జాబ్ చేయడానికి ట్రైనింగ్ ఎందుకని ఎగతాళి చేస్తే, మరికొంతమంది హైదరాబాద్‌లో పెడితే బాగుండేదని సలహా ఇచ్చారు. కానీ నేను పుట్టిపెరిగిన ప్రాంతంలోనే ఇది స్థాపించాలన్నది నా కల. దానితో పాటు హైదరాబాద్‌కు వెళ్లి మరీ ట్రైనింగ్ తీసుకోలేని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందనే ఆశ. అయితే, కరోనాతో అడ్మిషన్లు రాక ఇబ్బంది పడ్డాను. ఆ తరువాత నెమ్మదిగా పుంజుకుంది.

అలా పరిచయమయ్యాడు
హైదరాబాద్‌లాంటి ప్రాంతాల్లో వేలకు వేలు ధారపోసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు. మా వద్ద అలాంటి అపోహను పోగొట్టి కెరీర్ గైడెన్స్, కొత్త కోర్సులు, రెజ్యూమ్ ప్రిపరేషన్ లాంటి చిన్న చిన్న విషయాలు సైతం నేర్పిస్తున్నాం. బ్యాచ్‌కు ఐదుగురిని మాత్రమే తీసుకొని ఆరు నెలల పాటు శిక్షణనివ్వడం మా ప్రత్యేకత. ఇలాంటి సమయంలోనే సిద్దిపేటకు చెందిన ఆచి విజయ్ ఉద్యోగం కోసం నా ఆఫీస్కొచ్చాడు. బీటెక్ పూర్తిచేసి కొన్నెండ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. దానికితోడు కొన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించాడు. కరోనా కారణంగా అవి అనుకున్నంత ముందుకు సాగలేదు.
దాంతో అతను నన్ను సంప్రదించాడు. టెక్నాలజీపై విజయ్‌కున్న ప్యాషన్ నాకు అర్థమైంది. నాతో కలిసి నా కన్సల్టెన్సీలో పనిచేయమని అడిగాను. అప్పటినుంచి ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాడు. ఇలా ఉన్న సందర్భంలోనే సిద్ధిపేట అభివృద్ధి ఒక్కసారిగా మా కండ్లముందు కనిపించింది. పదేళ్లకాలంలో ఈ ప్రాంతం మరింతగా ముందుకు సాగింది. కార్పొరేట్ సంస్థలు సైతం నెమ్మదిగా వస్తుండటం గమనించాం. అయితే వాటి వల్ల స్థానిక వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు వెనుకబడిపోవడం గమనించాం. అలాంటి వాళ్లను ఓ కమ్యూనిటీగా చేయాలనే ఆలోచనలకు ఇద్దరం కలిసి పదును పెట్టాం.
వాక్ విత్ టాక్
వ్యాపారం మొదలు పెట్టి నష్టం వచ్చిందని ఏడాదిలోనే తీసేస్తుంటారు. మా వద్ద బిజినెస్ ఆలోచనలు ఉన్నాయి. వాటిని పంచుకునేందుకే అవిష్కర్తలు కరువయ్యారు. అందరిలో ఆలోచనలు ఉంటాయి. కానీ, వాటిని బయటికి తీసుకొచ్చే వేదిక లేక ఆగిపోతుంటారు. అలాంటి వాళ్లను ఒక వేదికపైకి తేవాలని ఈ ఏడాది మార్చిలో ‘సిద్దిపేట స్టార్టప్ కమ్యూనిటీ’ ఏర్పాటు చేశాం. ‘రండీ మీ ఆలోచనలు పంచుకోండి ’ అని ఓ వీడియో విడుదల చేశాం. దానికి మంచి స్పందన వచ్చింది. సిద్దిపేటకు కేరాఫ్ అడ్రస్ అయిన కోమటిచెరువు దగ్గరే మా మీటింగ్ పాయింట్‌గా పెట్టుకున్నాం. ఉదయం 6 నుంచి 8 వరకు కచ్చితమైన సమయాన్ని పెట్టుకొని నిర్వహిస్తున్నాం. వాక్ విత్ టాక్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు పంచుకోవడం మా ఉద్దేశం. వ్యాపారంలో రాణిస్తున్నవారు ఆ సక్సెస్ కిటుకేమిటో చెప్పడం, బిజినెస్ చేయాలనుకునేవారు సలహాలు తీసుకోవడం. అంకురాల రూపకల్పన వంటి అనేక అంశాలను ఈ కమ్యూనిటీలో చర్చిస్తుంటాం. ప్రధానంగా అందరికి ఆదివారం అనుకూలంగా ఉంటుందని భావించే ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

అదే నా కల
మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తున్నది. ప్రతిసారీ 60 మందికి తగ్గకుండా వస్తున్నారు. ఇంత ఆదరణ వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు. రెండు మూడు ఐడియాలకు పెట్టుబడిపెట్టేందుకు కూడా పలువురు ముందుకు రావడం నాకెంతో సంతోషానిచ్చింది. స్టార్టప్ కేంద్రంగా సిద్దిపేటను చూడాలన్నది నా కల. ఇందుకోసం సిద్దిపేట స్టార్టప్ కమ్యూనిటీలో బోర్డు మెంబర్లను నియమించి, కమ్యూనిటీ సభ్యుల సహకారంతో భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలకు మా వంతుగా కొంత ఆర్థిక సహకారం అందించాలనే ఆలోచనలో ఉన్నాం.
వీళ్లలా మరెందరో
సిద్దిపేటకు చెందిన 24 ఏళ్ల యువకుడు ఏఐ గురించి బుక్ రాశాడు. కానీ, దాన్ని ప్రచారంలోకి తీసుకురాలేకపోయాడు. మన కమ్యూనిటీలో ఆ విషయం చర్చించడంతో ఓ మంచి ఐడియా చెప్పాం. ప్రస్తుతం టౌన్‌లోని కొన్ని స్కూళ్లలో ఆ బుక్‌ను కరికులమ్లా పెట్టుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. గజ్వేల్‌కు చెందిన ఓ మహిళ సమ్మర్లో కలారీ పట్టు శిక్షణనిచ్చేందుకు కోచ్‌ను కూడా పిలిపించింది. సమ్మర్ క్యాంప్ ప్రారంభించినా ఎక్కువ మంది రాలేకపోయారు. ఆమెకు ప్రమోషన్ చేయడంతో ప్రస్తుతం 50 మంది వరకు నేర్చుకుంటామని ఫోన్లు చేశారట. ఇలా చాలామంది మా స్టార్టప్ కమ్యూనిటీ సహకారంతో ముందడుగు వేస్తున్నారు.
…? రాజు పిల్లనగోయిన