దేవుడికి మెడలోనూ గుడి కడుతున్నారు డిజైనర్లు. ‘టెంపుల్ లాకెట్లు’ నగల డిజైన్లలో కొత్త ట్రెండ్ ఇప్పుడు. దేవుడి ప్రతిమ ఏదైనా.. దాని చుట్టూ ముచ్చటైన మందిరాన్ని పోలిన నిర్మాణం ఉండటం వీటి ప్రత్యేకత. శిల్ప కళకు దీటుగా నగిషీలు చెక్కుతున్నారు. అందమైన స్తంభాలు, ముచ్చటైన గోపురాలను ఆభరణాల్లో ఆవిష్కరిస్తున్నారు. లక్ష్మి, గణపతి, కృష్ణుడు, శివుడు, వేంకటేశ్వరుడు.. ఇలా రకరకాల దేవతా ప్రతిమలు ఉంటున్నాయి ఇందులో. ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించి బోలెడు డిజైన్లు వస్తున్నాయి. మందిరం ఆకృతుల్లో అయితే లెక్కకు మిక్కిలి వెరైటీలు దొరుకుతున్నాయి. యాంటిక్ ఫినిష్తో చోకర్లు, హారాలు, నెక్లెస్లు.. ఇలా అన్నిటిలోనూ వస్తున్నాయి. పచ్చలు, కెంపులు, వజ్రాలు, ముత్యాలు పొదిగినవే కాదు.. నగకు ప్రత్యేక లుక్ తీసుకు వచ్చేలా బీడ్స్ తరహాలోనూ టెంపుల్ లాకెట్లు రూపొందుతున్నాయి. కొన్ని మందిరాలు త్రీడీ తరహాలో ఉంటే, కొన్ని అచ్చమైన మండపంలా చదరంగా ఉంటున్నాయి.