అమ్మంటే ఇష్టం.. ఓకే! అమ్మాయంటే చాలా ఇష్టం.. ఇంకా ఓకే! నాన్నంటే ప్రాణం.. స్నేహితుడంటే ఆరోప్రాణం.. భర్తంటే ఆరాధన.. ఈ లిస్టులో మీ పేరు ఎందుకు రాలేదు? చివరికి ఓ నటుణ్ని చచ్చేంత ఇష్టపడతారు. ఓ ఆటగాణ్ని ప్రాణప్రదంగా అభిమానిస్తారు! అందరినీ ఇంతగా ఇష్టపడే మీరు, ఆకాశమంత ప్రేమించే మీరు.. మిమ్మల్ని మీరు ఇష్టపడకుండా ఎందుకు ఉండాలి? ‘నాకు నేనేం బాగోను..’ అనుకుంటే పొరపాటు. ఎవర్నో ప్రేమించి.. వాళ్లు తిరిగి ప్రేమిస్తే పొంగిపోతాం. నో అంటే కుంగిపోతాం. మిమ్మల్ని మీరు ప్రేమించి చూడండి.. ‘ఐ డోన్ట్ లవ్యూ’ అన్న తిరస్కారమే రాదు! అలా ప్రేమించడం వల్ల మీకు మీరు కొత్తగా కనిపిస్తారు. లోకమంతా ప్రేమించేంత రేంజ్‌కు చేరుకుంటారు. అన్నీ ఉన్నా అసహనంలో కూరుకుపోతున్న వారికి వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్న మాట కూడా ఇదే! లవ్ యువర్సెల్ఫ్. అదే సెల్ఫ్ లవ్.ఎవరి ప్రేమ కోసమో పడిగాపులు కాసే బదులు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రేమించి చూడండి..
స్టాటిస్టికా అనే సంస్థ అధ్యయనం ప్రకారం 2024లో లిప్‌స్టిక్ నుంచీ డియోడరెంట్ల వరకూ… అందం, వ్యక్తిగత శుభ్రత కోసం ఉత్పత్తయ్యే వస్తువుల నుంచి వచ్చే ఆదాయమే 50 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. ప్రపంచ మార్కెట్ ఒడుదొడుకులు, ఆర్థికమాంద్యాలూ, లాక్డౌన్లు లాంటి పరిస్థితులకు అతీతంగా ఉధృతంగా ఎదుగుతున్న మార్కెట్ ఇది. కారణం స్పష్టం! ఆకర్షణీయంగా, అందంగా, ఆరోగ్యంగా కనిపించాలి అనుకునే మానవ నైజం. మరి మన దృష్టిలో మనం ఎలా కనిపించాలి.
మనల్ని మనం ఇష్టపడుతున్నామా లేదా అన్న ప్రశ్నే ‘సెల్ఫ్ లవ్’ (స్వీయప్రేమ) అనే ఆలోచనకు దారితీస్తున్నది. అయితే, ఓ వ్యక్తి తన గురించి తాను ఆలోచించుకోవడం, తనను తాను ప్రేమించుకోవడం పచ్చి స్వార్థంగా తోస్తుంది. ఫ్రాన్సిస్ బేకన్ లాంటి తత్వవేత్తలు సైతం ఈ సెల్ఫ్ లవ్ అనే లక్షణంతో ఉండేవారు, తన వ్యక్తిగత లాభం కోసం ప్రపంచాన్నే తగలబెట్టేస్తారని హెచ్చరించారు. కానీ సెల్ఫ్ లవ్ వేరు… స్వార్థం, తనను తాను మోహించుకోవడం, అహంకారం వేరు. మనలోని మంచితనాన్ని పెంచుకునే, దుర్గుణాలను తగ్గించుకునే అవకాశం సెల్ఫ్ లవ్ కల్పిస్తుంది.
లెక్కలేనన్ని లాభాలు!
ఒత్తిడి తగ్గిస్తుంది : ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎదరుయ్యే సవాళ్ల గురించి ప్రత్యేకించి గుర్తు చేసుకోవాల్సిన పనిలేదు. ప్రతిరోజూ, ప్రతిపనీ, ప్రతి అడుగూ సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, అంచనా తప్పినా మనల్ని మనం నిందించుకుంటూ పశ్చాత్తాపం చెందుతాం. మనల్ని మనం ప్రేమించుకుంటే… మనల్ని మనం క్షమించుకోవడమూ ఉంటుంది. ఎందుకంటే స్వీయప్రేమ… స్వీయ కరుణ (self compassion)కు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మనకు ఇష్టమైనవారు చిన్నచిన్న తప్పులు చేస్తే ఎలాగైతే వారిని నిండు మనసుతో క్షమించేస్తామో, మన నిర్ణయాలనూ మనం క్షమించగలుగుతాం.
ప్రోత్సాహం : ఇంట్లో పిల్లవాడు ఏదన్నా కొత్త పని చేయబోతుంటే… ఏం ఫర్వాలేదు, ఏం కాదు, ఏదన్నా జరిగితే నీకు నేనున్నానని అండగా నిలబడతాం. స్వీయప్రేమతో మనకు మనం దన్నుగా నిలబడే తత్వం అలవడుతుంది. ప్రతి చిన్న అడుగుకూ భయపడకుండా, రిస్క్ తీసుకునేలా చేస్తుంది. ఎలన్ మస్క్ నుంచి జాక్ మా వరకు చాలామంది అద్భుతాలు సాధించడానికి కారణం… వాళ్ల మీద వాళ్లకున్న ప్రేమే!
ఇతురులకూ అదే ప్రాధాన్యం: ధర్మరాజుకు ప్రపంచం అంతా మంచిగా కనిపించింది. దుర్యోధనుడు బయల్దేరితే లోకం అంతా దుర్మార్గంగా తోచింది. ఇలాంటి గాథలతో పెద్దలైనా, నిపుణులైనా చెప్పదల్చుకున్న మాట ఒకటే. లోకం… నీ ప్రతిబింబం. మనపట్ల మనం కరుణగా ప్రేమగా ఉండగలిగితే, ఇతరుల పట్ల కూడా సహానుభూతి (Empathy) చూపించగలం. వాళ్లతో అనునయంగా మాట్లాడగలం, వారి కష్టాల తీవ్రతను గ్రహించగలం.
అభినందన : మనం అందుకున్న విజయాలకు, చేసిన పనులకు, సాధించిన ప్రగతికి ఎవరన్నా
అభినందిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇది మానవ నైజం. చిరుద్యోగి నుంచి రచయిత వరకూ అభినందనలే ప్రతిభకు ఆయువుగా మారతాయి. కానీ, ఎవరూ అంత త్వరగా ఇతరులను మెచ్చుకునేందుకు సిద్ధపడరు. అది వెలితిగా తోస్తుంది, ఎవరి కోసం పనిచేయాలి అనిపిస్తుంది. స్వీయ ప్రేమ ఈ లోటును తీరుస్తుంది. ఎవరో ఒకరి ధృవీకరణ కోసం ఎదురుచూడకుండా, మనల్ని మనం నిష్పాక్షికంగా బేరీజు వేసుకుని… సాధించిన ఫలితాలకు మెచ్చుకునే తత్వం స్వీయప్రేమతోనే అలవడుతుంది. ఈ లక్షణంతో పనిమీద ప్రేమ కూడా పెరుగుతుంది.
అందరూ బాగుండాలి : నేను బాగున్నాను కానీ లోకం బాగాలేదు, లోకం బాగుంది కానీ నేను బాగాలేను, లోకమూ బాగాలేదు నేనూ బాగాలేను, నేనూ లోకం ఇద్దరమూ బాగానే ఉన్నాం. ఏ మనిషైనా ఈ నాలుగు దశల అభిప్రాయాలలో ఏదో ఒకదాన్ని కలిగి ఉంటాడని సైకాలజిస్టులు చెబుతారు. ఈ విషయమై ‘ఐ యామ్ ఓకే యూ ఆర్ ఓకే’ తరహా పుస్తకాలు, సిద్ధాంతాలు చాలానే వచ్చాయి. నేనూ లోకం ఇద్దరమూ బాగానే ఉన్నాం అనే స్థాయికి చేరుకోవడం వల్ల వ్యక్తిగత, సామాజిక జీవనం రెండూ బాగుంటాయన్నది నిపుణుల మాట. ఇది స్వీయప్రేమతోనే సాధ్యం అంటున్నారు.
ప్రేమ ఉన్న చోట గమనింపు ఉంటుంది. బలాలు, బలహీనతల గ్రహింపు ఉంటుంది. ఇతరులు ఏం అడిగినా మొహమాటంతో అన్నిటికీ ఒప్పుకోని స్పష్టత ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా సరే మనం అనుకున్నది చేయగల సమర్థత వస్తుంది. అనుకున్నది సాధించే పట్టుదల, కష్టాన్ని భరించే ఓరిమి… అన్నీ ఈ స్వీయప్రేమతోనే సాధ్యం అవుతాయి.
లేకపోతే ఇలా ఉంటారు!
మనిషి మనుగడ సాగించేది తనకోసమే. ఎంతలేదన్నా తన మీద తనకు ప్రేమ ఉండి తీరుతుంది. అసలు ఈ స్వీయప్రేమ లేకపోతే లక్షణాలు కూడా స్పష్టంగానే కనిపిస్తాయి.
తనకు తాను హాని కలిగించుకోవడం, అనారోగ్యానికి దారితీసే అలవాట్లకు, పనులకు పాల్పడటం.
ఇంతేకాదు… స్వీయప్రేమ లేదంటే దాని అర్థం తనను తాను ద్వేషించుకుంటున్నాడనే. దానివల్ల అపనమ్మకం, ఆత్మన్యూనత, జీవితం పట్ల అసంతృప్తి, సమాజం పట్ల కసి లాంటి సవాలక్ష ప్రతికూల భావనలు అన్నీ చోటు చేసుకోవడమే కాకుండా, అవే అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. తన అభిప్రాయాలను, భవితను శాసిస్తాయి.
ఇలా సాధించాలి!
స్వీయప్రేమ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వెంటనే తెలిసిపోతుంది. మరి దాన్ని సాధించడం ఎలా? అద్దాన్ని చూసి నవ్వితే సరిపోదు కదా! ఏండ్ల తరబడి మనపట్ల మనకు ఉన్న నిరాసక్తతను, ద్వేషాన్నీ వదిలించుకుంటేనే అది సాధ్యం. దానికి కొన్ని మార్గాలు లేకపోలేదు!
నీతో నువ్వు కాసేపు : ఆఫీసులో గంటల తరబడి గడుపుతాం. స్నేహితులకు సమయం వెచ్చిస్తాం. టీవీకీ, మొబైల్‌కీ కాలాన్ని అప్పచెప్పేస్తాం. కానీ మనకు మనం సమయాన్నివ్వం. కాసేపు నిదానంగా కూర్చుని ఆలోచించుకోవడానికీ, ఓ డైరీ రాయడానికీ, జీవితంలో ఎక్కడ ఎలా ఉన్నామో బేరీజు వేసుకోవడానికీ, ధ్యానానికీ… నిమిషం కూడా కేటాయించం. అలా చేయడం మొదలుపెడితేనే ఆలోచన అంతర్ముఖం అవుతుంది. మనిషికీ, మనసుకీ మధ్య ఉన్న తెర కరిగిపోతుంది.
సేదదీర్చే అలవాట్లు : ఇంట్లో అందరికీ ఏం నచ్చుతుందో తెలుసుకుని నెరవేరుస్తాం. లోకానికి ఎలా ఉంటే నచ్చుతుందో గమనించుకుంటూ, అలాగే మసులుకుంటాం. మరి మనకు ఏం నచ్చుతుంది. పాత పాటలా, పుస్తకాలా, హాస్యమా, మెరిసే బట్టలా… మనకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి. ఇతరులకు ఇబ్బంది కలగనంతవరకూ వాటిని పాటించడంలో వచ్చే ఇబ్బందేమీ ఉండదు. మనకు నచ్చిన పనులు చేసేందుకు కూడా… ఇతరులు ఏమనుకుంటారో అనే అనుమానంతో ఆగిపోతే బతుకు నిస్సారంగా సాగిపోతుంది.
శరీరాన్ని గమనించుకోండి: స్వీయప్రేమ లేకపోతే మన ఒంటి మీద మనకే ధ్యాస ఉండదు. మన రూపం ఎలా ఉన్నా, దాన్ని స్వీకరించాలి. ఎవర్నో ఆకర్షించడానికి కాకపోయినా… శుభ్రంగా కనిపించేలా చూసుకోవాలి. మంచి అలవాట్లతో ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి.
కృతజ్ఞత: ఎవరన్నా సాయం చేస్తే కృతజ్ఞత చూపిస్తాం. ఉద్యోగం ఇస్తే కృతజ్ఞతగా పనిచేస్తాం. ఆఖరికి ఈ జీవితం ఇచ్చినందుకు దేవుడిని నమ్మేవారు, ఆయనకీ కృతజ్ఞత చెబుతారు. మరి మన జీవితానికి ఓ వాహకంగా, ఉనికికి మార్గంగా ఉన్న శరీరం పట్ల ఎందుకు కృతజ్ఞత చూపించం? ఎందుకంటే విలువ కట్టలేనివి అంటే మనకు చులకన, అయాచితంగా అందినవంటే లోకువ. అలాగే మన శరీరాన్ని కూడా భావిస్తాం. మనకు తగినంత సత్తువ ఇచ్చేందుకు, అనారోగ్యాల నుంచి కాపాడేందుకు అది చేసే ప్రయత్నాన్నీ, పోరాటాన్నీ ఒక్కసారి గమనిస్తే దానిపట్ల ఎంత కృతజ్ఞత చూపించినా తక్కువే అనిపిస్తుంది. ప్రేమ జనిస్తుంది.
ప్రత్యేకం అని గుర్తించండి: ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలూ ఒకేలా ఉండవు. అభిరుచులూ పూర్తిగా కలవవు. మన వ్యక్తిత్వం, నైపుణ్యం కూడా అంతే. ఏదో ఒక విషయంలో మనం ఇతరులకంటే భిన్నం అని గుర్తించగలిగితే మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఆ ప్రత్యేకతనే కెరీర్‌గా మార్చుకోగలిగితే ఇంకా మంచిది!
నిదానించాలి: మనం ఊపిరి తీసుకునే విధానం నుంచి… భోజనం చేయడం వరకూ అంతా హడావుడే. కాస్త నిదానిస్తేనే ఆరోగ్యకరం అని తెలుసు. అంతేకాదు. మనలో, మన చుట్టూ ఏం జరుగుతున్నదో గ్రహించే సమయమూ ఉంటుంది. హడావుడిగా ఉంటే… మనం ఎవరో కూడా మనకు తెలియకుండానే జీవితం చేజారిపోతుంది.
బ్రెయిన్ అండ్ బిహేవియర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం భౌతికంగా, మానసికంగా మనం పెంపొందించుకునే సానుకూలమైన అలవాట్లే… స్వీయప్రేమకు దారితీస్తాయి. కాబట్టి అలాంటి ప్రతీ లక్షణాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం మంచి ఫలితాలనే ఇస్తుంది. ఇతరుల మీద ద్వేషాన్నీ, మన మీద మనకు అయిష్టతనీ పెంచుకుని ఈ చిన్న జీవితాన్ని అసంతృప్తితో నింపేసుకుంటే అంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది? అలా కాకుండా కాస్త ప్రేమను, సానుకూలతను జోడిస్తే బతుకు విలువే మారిపోతుంది. ప్రతిక్షణం ఓ కొత్త అవకాశాన్నీ, ప్రతిరోజూ ఓ కొత్త లోకాన్నీ పరిచయం చేస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆస్తిపాస్తులకంటే విలువైన ఆత్మసంతృప్తి మిగులుతుంది.
నార్సిసిజం!
అనగనగా ఓ గ్రీకు పాత్ర. పేరు నార్సిసస్. దేవతకు, అప్సరసకు పుట్టిన నార్సిరస్ మహా అందగాడు. తనను ఎంతోమంది ఆరాధించారు, ప్రేమించారు. కానీ నార్సిసస్కి ఎవరూ నచ్చేవారు కాదు. ఓసారి నార్సిసస్ వేటకు బయల్దేరాడు. దారిలో ఉన్న కొలనులో తన ప్రతిబింబాన్ని చూసుకుని దాంతోనే ప్రేమలో పడ్డాడు. కానీ దాన్ని తాకబోయినప్పుడల్లా చెదిరిపోయింది. తన చేతుల్లోకి తీసుకోలేని ఆ రూపాన్ని చూసి నార్సిసస్ గుండె పగిలిపోయింది. ఆ రూపాన్ని చూసుకుంటూనే, అక్కడే కన్నుమూశాడు.
ఇలా… తనను తాను మోహించుకునే తత్వానికి నార్సిసిజం (స్వానురక్తి) అని పేరు పెట్టారు. ఫ్రాయిడ్, వాల్డర్ లాంటి సైకాలజిస్టులు వీటి మీద ఎన్నో సిద్ధాంతాలు వెలువరించారు. ఒక మోతాదు వరకూ నార్సిసిజం వల్ల లాభం ఉండవచ్చు. కానీ హద్దులు దాటితే అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కుటుంబం, సమాజం పట్ల నిర్లక్ష్యంగా అమానవీయంగా ప్రవర్తించేలా చేస్తుంది. కొంతమంది సెలెబ్రిటీలు విపరీతమైన అహంకారపూరితంగా ప్రవర్తించడం వెనుక కారణం కూడా, విపరీతమైన ఆత్మవిశ్వాసంతో వాళ్లలో ఏర్పడిన నార్సిసిజమే! సెల్ఫ్లవ్కీ నార్సిసిజానికీ ఆత్మవిశ్వాసానికీ, అహంకారానికీ ఉన్నంత తేడా ఉంది. అది గమనించుకోవాలి!
తస్మాత్ జాగ్రత్త
ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే అనుమానం సహజం. కానీ చాలా సందర్భాల్లో ఆ అభిప్రాయాలకు మన జీవితం, వ్యక్తిత్వం కంటే ఎక్కువ విలువనిచ్చేస్తాం. అది నష్టమే!
చాలామంది వ్యక్తిత్వాలు
నచ్చకపోయినా మొహమాటంతో అంటిపెట్టుకుంటాం. మన మీద వారికి తెలియకుండానే అజమాయిషీ ఇచ్చేస్తాం. ఇలాంటి పరిచయస్తులకు దూరంగా ఉండాలి!
విజ్ఞానమూ ఒప్పుకొంటున్నది
ఇంగ్లండులోని హార్ట్ఫోర్డ్ షైర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు అయిదువేలమంది మీద ఓ పరిశోధన చేశారు. వాళ్లకు ఎలాంటి సానుకూల అలవాట్లు ఉన్నాయి, వాటివల్ల ఎంత సంతృప్తి లభిస్తున్నదో తెలుసుకోవాలని అనుకున్నారు. ఇతరులకు సాయం చేయడం, దగ్గరివారితో గడపడం లాంటి అలవాట్ల వల్ల చాలా సంతృప్తి కలుగుతుందని తెలిసింది. ఆశ్చర్యంగా తనను తాను అంగీకరించే అలవాటు (self acceptance) ఉన్నవాళ్లు ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు తేలింది. కానీ చాలా తక్కువమందికి ఆ అలవాటు ఉండటం ఈ పరిశోధనలో తేలిన మరో విషయం.
తనను తాను ప్రేమించుకోవడం, తన తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం ఓ స్వార్థపూరిత లక్షణంగా భావించడమే ఇందుకు కారణం కావచ్చు. వాటర్లూ విశ్వవిద్యాలయంలో జరిగిన మరో పరిశోధనలో తనపట్ల తనకు ప్రేమ లేనివారు, బంధాల పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తేలింది. ఏదన్నా సమస్య వస్తే, మాట్లాడి దాన్ని సానుకూలంగా పరిష్కరించుకునే తత్వం వీరిలో ఉండదట. ఫలితంగా తమ అసంతృప్తినీ, అనుమానాలణష్త్ర మనసులోనే ఉంచుకుని దూరమైపోతుంటారట. ఇలాంటి ఎన్నోపరిశోధనలు స్వీయప్రేమ విలువను గుర్తు చేస్తున్నాయి.
ఆపరేషన్ బ్యూటిఫుల్
అమెరికాకు చెందిన కేట్లిన్ బోయెల్ చాలామందిలాగానే ఆత్మన్యూనతతో బాధపడేది. కారణాలు చాలానే ఉన్నాయి. ఓ ఆరోగ్య సమస్య వల్ల తను బరువు పెరిగిపోయింది. ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉండటంతో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ, కాలేఝఋకి వెళ్లేది. ఉద్యోగంలో విపరీతమైన పని ఒత్తిడి వల్ల తను చదువు మీద అంతగా దృష్టి పెట్టలేకపోయింది. దాంతో ఓసారి పరీక్షలలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. పైగా తన రూపాన్ని చూస్తూ వెక్కించే మాటలు కూడా తన మనసును విరిచేశాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో, బాత్రూంలో తలుపు వేసుకుని భోరున ఏడ్చింది. కానీ… కాసేపటికి అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు తన ధోరణి ఎంత తప్పో అర్థమైంది.
‘నన్ను నేను ద్వేషించుకుంటే ఎలా?’ అనిపించింది. వెంటనే బ్యాగ్‌లోంచి ఒక స్టిక్ నోట్ తీసి ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు?’ అని రాసి అద్దానికి అంటించింది. ఆ మాటలు తనకే కాదు… తన తర్వాత, అక్కడికి వచ్చి అద్దం ముందు నిలబడే ప్రతి ఒక్కరిలో ఆత్మ విశ్వాసం నింపాలి అనుకుంది. క్రమంగా ఇది ‘ఆపరేషన్ బ్యూటిఫుల్’ అనే ఉద్యమంగా మారిపోయింది. చాలామంది ‘నువ్వు సాధించగలవు’, ‘ఈ సరికొత్త రోజును ఆస్వాదించు’ లాంటి స్టిక్ నోట్స్ రాసి బహిరంగ ప్రదేశాల్లో అంటించేవారు. అలా ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా స్టిక్ నోట్స్‌కు సంబంధించిన ఫొటోలు కేట్లిన్కు చేరాయి. చేరకుండా ఉన్నవి మరెన్నో! ఈ మాటలతో, అనుభవాలతో తను రాసిన పుస్తకం కూడా సూపర్ హిట్ అయ్యింది. స్వీయప్రేమ ఎంత అవసరమో, ప్రభావవంతమో నిరూపించింది.
…? కె.సహస్ర