..వీటన్నిటి కంటే సీసా పెంకుల బిజినెస్ బాగా వున్నదన్నాడు ముత్యాలు. ఈ పెంకుల్లోనూ మళ్ళి అన్ని రకాలూ పనికిరావుట. తెల్లసీసాపెంకులు కిలో 15 పైసలకు కొంటారుట. కాఫీరంగు సీసాపెంకులకయితే ఇంకో 5 పైసలు అదనంగా ఇస్తారట. ప్లాస్టిక్ బూరలు, దువ్వెనలు, మూతలు, నాలికబద్దలు, పర్సులు, డబ్బాలు, బరిణెలు, సంచులకయితే కిలో రూపాయి దాకా పలుకుతుందిట.
“పొద్దున్నే సద్దన్నం తింటానూ. మరే తిన్న తరువాతనేమో వొగ్గె తీసూకొని, సంచి బుజానికేసుకుని బజార్లంబడి పడతా మధ్యాన్నందాకా తిరుగుతూ కాసేపు కూసుంటా. మల్లా మాపిటాలదాకా తిరుగుతా… మా అమ్మే రోజు 10 పైసలిస్తందిగా అదిబెట్టి తిమ్మిరిబిళ్ళ కొనుక్కుతింటా” అన్నాడు ముత్యాలు.
అంతర్జాతీయ బాలల సంవత్సరాన్ని గురించిగాని, ఐక్యరాజ్యసమితి బాలలకు ప్రసాదించిన హక్కుల్ని గురించిగాని, ముత్యాలుకు తెలియదు. మన పార్లమెంటు, మన శాసనసభ, వివిధ న్యాయస్థానాలు బాలల సంక్షేమాన్ని గురించి చెప్పినవేవీ ముత్యాలు దాకా ఇంకా రాలేదు.
తిరకాసు ఎక్కడుందో ఏమిటో తెలీడం లేదు గానీ, మనకెప్పుడో సోషలిజం తెస్తామన్నారు ఏలినవారు. అదేదో అప్పుడే తెచ్చినట్లయితే, ముత్యాలు సామ్యవాద దేశంలో పుట్టివుండే వాడు. మరి మనవారేమో దాందుంప తెగిన సోషలిజం దాన్ని తీసుకురాలేక పోతున్నారు. మనవాళ్ళ చిత్తశుద్ధిని శంకించి మనల్ని మనమే అవహేళన చేసుకోవడం భావ్యంకాని మాట నిజమే! ఒకవేళ మనవారు చిత్తశుద్ధిగా కృషిచేసినా మనమీద కోపంకొద్ది ఆ సోషలిజమే, మనదాకా రానంటున్నదేమో కూడా మనకు తెలీదు. ఆ సమసమాజమో, చట్టుబండలో తొందరగా రావాలి. అలావస్తే తప్ప.. ముత్యాల్లాంటి లక్షలాది పసిబిడ్డల బతుకులు, ఈ గాజుముక్కల్లోంచి బూజుగుడిసెల్లోంచి బయటపడవు.
– రావూరి భరద్వాజ ‘జీవన సమరం’ పుస్తకం నుంచి