ఆ మధ్య వార్తల్లో చూశాం, ఫోన్ లాక్కుందని తల్లిపై కొడుకు దాడి చేయడం, అధ్యాపకురాలిని ఇంజినీరింగ్ విద్యార్థిని బూతులు తిట్టడం, చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం. ఈ విపరీత ప్రవర్తనలకు మూల కారణం ఏంటో తెలుసా? పొద్దస్తమానం ఫోన్ లో మునిగి పోవడం. ఫోనే ప్రపంచంగా మారిపోవడం. దీన్నే ఫబ్బింగ్ అంటారు. ఈ ధోరణికి కారణాలు ఏంటి? దాని పర్యవసానాలు ఏంటి? దీని బారి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
చుట్టూ ఉన్న వ్యక్తులను పట్టించుకోకుండా మొబైల్ ఫోన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్నే ఫబ్బింగ్ అంటారు. ఇది ‘ఫోన్’, ‘స్నబ్బింగ్’ (పట్టించుకోకపోవడం) అనే రెండు పదాల కలయికతో ఏర్పడిన పదం. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, భాగస్వామితో ఉన్నప్పుడు కూడా వారి మాటలను వినకుండా, ఫోన్ వైపు చూడటం, మెసేజ్లు చెక్ చేయడం, సోషల్ మీడియాలో మునిగిపోవడం ఇలా చేస్తుంటారు చాలామంది. ఈ వైఖరినే ఫబ్బింగ్ అని పిలుస్తున్నారు. ఈ విపరీత ధోరణి ఎంతలా ఉందంటే.. 2022లో హైదరాబాద్ విద్యార్థులపై నిర్వహించిన ఓ సర్వేలో 52% మంది విద్యార్థులు ఫబ్బింగ్లో మునిగి తేలుతున్నారని తెలిసింది. వీరిలో 23% మంది తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, 34% మంది కొద్దిపాటి మానసిక సమస్యతో సతమతమవుతున్నారని వెల్లడైంది. మగ పిల్లల కంటే ఆడ పిల్లలే ఎక్కువగా ఫబ్బింగ్లో ఉంటున్నారని సర్వే వెల్లడించింది. ఫబ్బింగ్ సమయంలో 87.8% వాట్సాప్లో, 46.6% ఫేస్ బుక్ లో ఉంటామని సర్వేలో పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.
ఫబ్బింగ్ ఎందుకు?
సాధారణంగా ఫబ్బింగ్కు దారితీసే కొన్ని కారణాలు ఉన్నాయి.
ఫబ్బింగ్కు గురైనవారిపై ప్రభావం..
ఎవరైతే తమ భాగస్వామి, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి నిరాదరణకు గురవుతారో, వారిలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
ఎలా బయట పడొచ్చు..
ఫబ్బింగ్ అలవాటును మార్చుకోవడం కోసం కొన్ని ఆచరణాత్మక, సులభమైన చిట్కాలు ఉన్నాయి
1.ఫోన్ ఫ్రీ జోన్స్
మీరు, మీతో ఉన్నవారు కచ్చితంగా ఫోన్ ఉపయోగించకూడదని నిర్ణయించుకునే నిర్దిష్ట సమయాలను, ప్రదేశాలను ఏర్పాటు చేసుకోండి. కుటుంబంతో కలిసి భోజనం చేసేటప్పుడు ఫోన్లను పక్కన పెట్టండి. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ తినండి. పడుకునే ముందు లేదా లేచిన వెంటనే ఫోన్ చెక్ చేయకుండా ఉండండి. నిద్రపోయే కనీసం ఒక గంట ముందు ఫోన్ను పక్కన పెట్టడం వలన నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు, పిల్లలతో ఆడుకునేటప్పుడు వేరే గదిలో ఫోన్ను ఉంచేయండి.
2. ఆఫ్ నోటిఫికేషన్స్
పదేపదే వచ్చే నోటిఫికేషన్లు ఫోన్ను చెక్ చేయాలనే కోరికను పెంచుతాయి. సోషల్ మీడియా, ఇతర యాప్ల ‘సైలెంట్’ మోడ్లో లేదా పూర్తిగా ఆఫ్ చేయండి. అత్యవసరమైన వాటికి మాత్రమే అలర్ట్ వచ్చేలా సెట్ చేసుకోండి. మీరు ఇతరులతో ఉన్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు డూ నాట్ డిస్టర్బ్ (డీఎన్బీ) మోడ్ను ఆన్ చేయండి. దీనివల్ల దృష్టి మరలడం తగ్గుతుంది.
3. సెట్ యువర్ టైమింగ్స్
నిరంతరం ఫోన్ చెక్ చేయడానికి బదులుగా, రోజులో నిర్దిష్ట సమయాన్ని మాత్రమే ఫోన్ చూడటానికి కేటాయించండి. ఉదాహరణకు ప్రతి గంటకు 5 నిమిషాలు లేదా ప్రతి 3 గంటలకు 15 నిమిషాలు మాత్రమే మెసేజ్లు, అప్డేట్లు చెక్ చేయండి. పని చేసే సమయంలో లేదా సంభాషణలో ఉన్నప్పుడు ఫోన్ను దూరం పెట్టండి.
4. మైండ్ఫుల్గా ఉండటం..
ఫోన్ తీసినప్పుడల్లా ‘నేను దీన్ని ఎందుకు తీసుకున్నాను? ఇది ఇప్పుడు అత్యవసరమా?‘ అని ప్రశ్నించుకోండి. ఇది అలవాటుగా ఫోన్ చూడటాన్ని తగ్గిస్తుంది. కొంతమంది బోర్ కొట్టినప్పుడు లేదా ఇబ్బందిగా అనిపించినప్పుడు ఫోన్ చూస్తారు. ఆ సమయాల్లో ఒక పెన్ను లేదా చిన్న వస్తువును చేతిలో పట్టుకోవడం వలన ఫోన్ వాడకాన్ని తగ్గించవచ్చు.
5. కమ్యూనికేషన్ మెరుగుపరచడం..
మీరు ఇతరులతో ఉన్నప్పుడు వారిపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మాట్లాడేటప్పుడు వారి కళ్లల్లోకి చూడండి, వారి మాటలను శ్రద్ధగా వినండి. ‘అవును, ఆ తర్వాత?’ లాంటి ప్రోత్సాహకరమైన మాటలను ఉపయోగించండి. మీ భాగస్వామి, స్నేహితులతో ఫబ్బింగ్ సమస్య గురించి నిజాయతీగా మాట్లాడండి. ఇద్దరూ కలిసి ఈ అలవాటును మార్చుకోవడానికి ఏ నియమాలు పాటించాలో నిర్ణయించుకోండి.
ఈ మార్పులు మీ సంబంధాలను, మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సాయపడతాయి.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261