ఇప్పుడంతా యమా స్పీడు.. ఇంటర్నెట్ అయినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అయినా. అన్నీ కాస్త ఓవరే. సినిమా డైలాగుల నుంచి సిల్లీ పంచుల దాకా అన్నిట్లోనూ రాజ్యమేలుతున్నది అతే. ఉయ్ వాంట్ దట్ అతి… అన్నది నేటి యూత్ మాట. నగల్లోనూ అదే దారి. ఓవర్సైజ్డ్ లాకెట్ ఇప్పుడు ఆభరణాల అడ్డాలో కొత్తకొమ్మ. నగ ఏదైనా లాకెట్ మరీ పెద్దగా ఉండటమే వీటి ప్రత్యేకత.
అతివ అలంకారంలో అగ్రతాంబూలం ఆభరణాలదే. అందుకే అందులో ఎన్నో రకాలు, ఎన్నెన్నో డిజైన్లు. కాసులపేరు నుంచి కాలిమెట్టెల దాకా, వడ్డాణం నుంచి వేలి ఉంగరం దాకా ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా ముస్తాబవుతుంటాయి. కాబట్టి డిజైనర్లు ఏ కొత్త ప్రయోగాన్నయినా ముందుగా నగలపైనే చేస్తారు. అందులోనూ మరీ ముఖ్యంగా కలకంఠి కంఠాన్ని అలంకరించే కంఠాభరణాలలో లెక్కకు మిక్కిలి వైవిధ్యాలు
సృష్టిస్తుంటారు.
సన్నటి గొలుసు నుంచి రాణీ హారాల దాకా ఎన్నెన్నో చిత్రాలు చెక్కుతుంటారు. ఇక, ఇప్పుడు ఇందులోనే భారీ లాకెట్లను ప్రయోగానికి ఎన్నుకున్నారు. గగనతలాన రాకెట్లలాగే ఇది కూడా మార్కెట్లో రివ్వున ఎగసింది. అతివ మదిలో మెరిసింది. ఇంకేం, సాదా బంగారు నగల నుంచి రాళ్ల గొలుసుల దాకా అన్నిటా ఓవర్ సైజ్డ్ లాకెట్లు కళ్లనిండుగా కనిపిస్తున్నాయి. చూడగానే కొంత ప్రత్యేకంగా, మరింత చిత్రంగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా టెంపుల్ జువెలరీలో ఇవి ఎక్కువగా తయారవుతున్నాయి. ఏ వేడుకలోనో వీటిని చూసిన దగ్గరివారు, కాస్త ఓవర్ అయిందేమో… అని అన్నా, ఉయ్ వాంట్ దట్ అతి… అనేస్తున్నారు అతివలు.