ఆసక్తి అందరికీ ఉంటుంది. దాన్ని అభిరుచిగా ఆరాధించడం కొందరికే సాధ్యం. ఈ ప్రయాణంలో నిజమైన సాధకుడు కష్టాలు ఎదురైనా చలించడు. మోసాలకు గురైతే కుంగిపోడు. అన్నీ భరిస్తాడు. ప్రతిసారీ మరింత కష్టపడతాడు. ఎంతో ఇష్టపడి పనిచేస్తాడు. వి.జయశంకర్ ఈ కోవకు చెందిన వ్యక్తి కాబట్టే.. తెలుగులో మొట్టమొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇండిపెండెంట్ మూవీ డైరెక్టర్‌గా పేరు గడించాడు. సినిమాలు తీయడంలో తనదైన పంథా కొనసాగిస్తూ.. సామాజిక స్థితిగతులు, ఈతరం పోకడలను అద్దం పడుతున్న యువ దర్శకుడి ప్రయాణమిది.
‘పేపర్ బాయ్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జయశంకర్ వంగ స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ గ్రామం. తల్లిదండ్రులు ప్రమీల, కనకయ్య. టింబర్ బిజినెస్ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన ఆయన స్వతహాగా పుస్తకాల పురుగు. చిన్నప్పట్నుంచీ రకరకాల నవలలు చదివేవాడు. ఇంజినీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలోనే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అయితే రచయిత అవ్వాలి.. లేదంటే దర్శకత్వం వహించాలి అని కలలు కనేవాడు.
కానీ, కుటుంబ బాధ్యతలు ఉద్యోగం వైపు నడిపించాయి. ‘చేస్తున్నది బ్యాంకు ఉద్యోగం.. ఎంత జాగ్రత్తగా ఉండాలి?’.. అని ఎంతగా నచ్చజెప్పచూసినా మనసు ఒక పట్టాన మాట వినేది కాదు. చదువుకునే రోజుల్లోనే మెదడులో దూరిన సినిమా పురుగు అస్తమానం తొలుస్తూ ఉంటే బ్యాంకులో తన సీట్లో కుదురుగా కూర్చునేవాడు కాదు! ఇదే విషయం ఇంట్లోవాళ్లకు చెప్పడమూ, ఎలాగోలా వాళ్లూ ఒప్పుకోవడమూ జరిగిపోయాయి. మరుక్షణం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేందుకు ఇండస్ట్రీ జనాలు ఉండే కాలనీలో అడుగుపెట్టాడు.
ఎన్నో మోసాలు.. అవమానాలు..
ఇండస్ట్రీలో అడుగుపెట్టినవారికి ఎదురయ్యే కష్టాలే జయశంకర్నూ పలకరించాయి. శ్రీనగర్‌కాలనీ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడలో పూటకో మోసానికి గురయ్యేవాడు. అవకాశాల ఆశచూపేవాళ్లు కొందరైతే, అవసరానికి ఆదుకోమని చెప్పేవారు ఇంకొందరు. ‘డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టాలంటే గుర్తింపు కార్డు ఉండాలన్నాడు ఒకతను. నిజమే కాబోలు అనుకున్నా. అడిగినన్నీ ఇచ్చాను. ఇప్పటికీ ఆ వ్యక్తి కార్డు తెచ్చివ్వలేదు’ అంటాడు జయశంకర్. ఒకవైపు దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే.. మరోవైపు షార్ట్‌ఫిల్మ్స్ తీస్తుండేవాడు.
అలా ఆయన తీసిన ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ షార్ట్‌ఫిల్మ్ చూసి ఓ పెద్ద దర్శకుడు జయశంకర్‌ను పిలిపించాడు. ‘ఆయన పిలవడం, దర్శకత్వం చాన్స్ ఇస్తానని చెప్పడం నమ్మలేకపోయాను. కానీ, ఆ ఆనందం ఎన్నో రోజులు నిలువలేదు. ఏమైందో తెలియదు కానీ, మూడు రోజుల తర్వాత అవకాశాల్లేవ్ అన్నారు. ఏవో అడ్డు పడుతున్నాయంటే నా టాలెంట్ లిమిటెడ్‌గా ఉందన్నమాట అనుకున్నా. అప్పట్నుంచీ ఇంకా హార్డ్ వర్క్ చేశా’ అని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటాడు జయశంకర్.
ఆ కసితో మరో షార్ట్‌ఫిల్మ్ తీశాడు. అది దర్శకుడు సంపత్ నంది దృష్టిలో పడింది. ఆయన పక్కనున్న వాళ్లు వద్దని వారించినా తనకు డైరెక్టర్ ఆఫర్ ఇచ్చారు. అలా ‘పేపర్ బాయ్’ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అంతకన్నాముందు ఆయన డైరెక్ట్ చేసిన ‘లవ్ యూ ఫర్ ఎవర్’, ‘గాడ్ మస్ట్ బీ క్రేజీ’, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘రామాయణంలో తుపాకుల వేట’, ‘హ్యాపీ ఎండింగ్’ తదితర షార్ట్‌ఫిల్మ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ప్రస్తుతం ‘అరి’ అనే సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నాడు జయశంకర్.
అమ్మయ్యో.. ఏఐ!
తెలుగులో మొట్టమొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇండిపెండెంట్ మూవీగా పేరున్న ‘విటమిన్ షీ’ జయశంకర్లోని మరోకోణాన్ని పరిచయం చేసింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న, వినియోగిస్తున్న ‘ఏఐ’ విశ్వరూపాన్ని ముందే ఊహించి తీసిన సినిమా ఇది. కొవిడ్ టైంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆరు భాషల్లో వచ్చిన ‘విటమిన్ షీ’ ఓటీటీలో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే దాదాపు 30 కోట్లకు పైగా వీక్షణలు సంపాదించింది.
ఈ చిత్రంలో ఉండే ‘అడ్వాన్స్డ్ వాయిస్ అసిస్టెంట్’ మనిషికి సాయం చేస్తూ.. మానవాళిని పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంటూ, ఎలా ఆడుకుందో చూపించాడు జయశంకర్. లాక్డౌన్ టైంలో కేవలం మూడు రోజుల్లో, నాలుగు లక్షల బడ్జెట్లో, ఐదే ఐదు పాత్రలతో ఈ సినిమా తీశాడు. ‘ఎవరైనా ప్రొడ్యూసర్ ముందుకు వస్తే, ఇదే సినిమాను ఫీచర్ ఫిలింలా రూపొందిస్తే మరింత మందికి చేరువవుతుంది కదా..’ అని అడిగితే ‘వై నాట్’ అంటున్నాడు ఈ పెద్దపల్లి పిల్లాడు.
…? నరేశ్ ఆరుట్ల