ఎవరైనా ‘మీ ఇల్లు చాలా బాగుంది. బాగా సర్దుకున్నారు’ అని ప్రశంసిస్తే మురిసిపోతాం. ఆ ముస్తాబు వెనుక మన అభిరుచి ఉన్నా, మన ఆలోచనలను అర్థం చేసుకొని, ఓ రూపం ఇచ్చిన ఘనత మాత్రం ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లదే. ఇండియాలోని టాప్ ఆర్కిటెక్ట్‌లలో ముంబైకి చెందిన ఖుష్బూ ఖండేల్వాల్ ఒకరు. ‘ది డిజైన్ ఇంక్’ పేరుతో ఎన్నో స్టూడియోలు ఏర్పాటు చేశారు. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది రాకెట్ టెక్నాలజీ ఏం కాదనీ.. ఆ నైపుణ్యాన్ని ఇంటింటికీ చేర్చాలన్నదే తన లక్ష్యమని చెబుతారు ఖుష్బూ. ఈ మధ్యే హైదరాబాద్‌ను సందర్శించారామె. ఈ సందర్భంగా ‘జిందగీ’తో ముచ్చటించారు.
గృహాలంకరణ.. నిన్నమొన్నటి వరకూ ఆడవాళ్ల వ్యవహారం. కాలక్రమేణా ఆ బాధ్యత కెరీర్‌గా మారింది. ఇంటీరియర్ డిజైనింగ్‌ను వృత్తిగా ఎంచుకుని ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దుకున్నారు. ఇక, ఆర్కిటెక్చర్ వైపు ఆడవాళ్లు తొంగి చూసేవారు కూడా కాదు. ఇప్పుడలా కాదు. దేశంలోని టాప్‌టెన్ ఆర్కిటెక్ట్‌లలో సగంమంది మహిళలే. అందులో ఒకరు.. ఖుష్బూ ఖండేల్వాల్. ఎంచుకున్న రంగంలో నిశ్శబ్దంగా సాగిపోవడం కొందరి పంథా అయితే.. అందరి కంటే ఉన్నత స్థానంలో నిలబడటం మరి కొందరి పద్ధతి. ఖుష్బూ కూడా అంతే. చిన్నప్పటి నుంచి ఇంటీరియర్ డెకొరేషన్, మేనేజ్మెంట్ రంగాల పట్ల ఆసక్తి ఆమెకు. దాన్నే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. ‘మనం జీవిస్తున్నది రంగుల ప్రపంచం. ఆ రంగులను రోజువారీ జీవితానికి అద్దుకుంటే.. జీవన ప్రయాణం సాఫీగా సాగి పోతుంది’ అంటారు ఖుష్బూ. ఉన్న కాస్త స్థలంలోనే గజిబిజీగా నాలుగు గోడలు కట్టేసి, రెండు కుర్చీలు వేసేసి ఇదే ఇల్లు అనొచ్చు. కానీ కాస్త ప్లానింగ్‌తో తక్కువ స్థలంలో ఎక్కువ అందంగా, ఎక్కువ సౌకర్యవంతంగా కట్టుకుంటే మాత్రం.. ఆ ఇల్లే నందనవనం అవుతుంది. ఖుష్బూ చేస్తున్నది ఇదే.
Sofa2
ఇద్దరూ కలిసి..
ముంబైలోని కమల రహేజా విద్యానిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ఖుష్బూ ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశారు. అక్కడే కునాల్ ఖండేల్వాల్తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఏడడుగులు వేశారు. ప్రాజెక్టులో భాగంగా తలోచేయీ వేసి ఎన్నో డిజైన్లు క్రియేట్ చేశారు. కాన్సెప్ట్ గురించి ఖుష్బూ ఆలోచిస్తే.. దాన్ని ఎలా అమలు చేయాలన్నది కునాల్ అధ్యయనం చేసేవారు. అలా ఇద్దరి ఆలోచనలూ కలిసి ‘ది డిజైన్ ఇంక్’ స్థాపనకు అడుగులు పడ్డాయి. పాతికేండ్లుగా వందలాది స్టూడియోలు డిజైన్ చేశారు. ఏదైనా ఫర్నిచర్ షాప్‌కి వెళ్తే.. మనకు కావాల్సిన మంచాలు, సోఫాలు, టేబుల్స్, అద్దాలు, లైటింగ్, వార్డ్రోబ్, హోమ్ డెకార్స్.. అన్నీ పేర్చి చూపిస్తారు. మనకు నచ్చినవి కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాం. కానీ.. కునాల్, ఖుష్బూ దంపతుల ఫర్నిచర్ స్టూడియోకి వెళ్తే ఆ అనుభూతి వినూత్నంగా ఉంటుంది. ఆ ఫర్నిచర్‌ను మన ఇంట్లో ఎలా అమరిస్తే అందంగా ఉంటుందో అక్కడే సెట్ చేసి చూపిస్తారు కూడా.
ఆ హాయిని అనుభవించిన తర్వాతే నచ్చిన ఫర్నిచర్ కొనుక్కోవచ్చు. రెస్టారెంట్ పెట్టాలనే ఉద్దేశంతో ఓ బిజినెస్ మ్యాన్ విశాలమైన ఫ్లోర్ సిద్ధం చేసుకుని కుర్చీలు, టేబుళ్లు పేరుస్తాడు. ఓ పేరు ఖరారు చేసి వ్యాపారం ప్రారంభిస్తారు. కానీ ఆ బాధ్యత ఖుష్బూకు అప్పగిస్తే.. నాలుగు గోడల మధ్య ఓ అద్భుతాన్ని సృష్టిస్తారు. సెలూన్, ఆఫీస్, పబ్, బోర్డ్‌రూమ్.. దేన్నయినా కళాత్మకంగా డిజైన్ చేయడంలో ఈ దంపతులకు తిరుగులేదు. ఆ పనితనం చూసే ఎంతోమంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ కలల సౌధాన్ని వీరి చేతుల్లో పెట్టారు. కళాత్మకంగా తీర్చిదిద్దుకున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్, స్టూడియో డిజైనింగ్‌ను టెక్నాలజీ సాయంతో కొత్తపుంతలు తొక్కించారు కునాల్, ఖుష్బూ. ఆర్టిఫీషియల్
ఇంటెలిజెన్స్ సాయంతో సరికొత్త హంగులు జోడించారు. ఒక పని మొదలు పెడితే చేస్తూ పోవడం కాదు. కష్టపడి చేయాలి.. సరికొత్త ఆలోచనలతో చేయాలి అంటారు కునాల్. అలాంటి ఆలోచనలతో ముందడుగు వేసినందుకే దేశంలోని ఫేమస్ డిజైనింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచామని చెబుతారు ఖుష్బూ. ‘డిజైన్ ఇలాగే ఉండాలని ముందే ఓ నిర్ణయానికి వచ్చేయం. సమయాన్ని, స్థలాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. ఈ మధ్యే బంజారాహిల్స్‌లో ‘ది కొలాజియం’ అనే ఫర్నిచర్ స్టూడియో డిజైన్ చేశాం. ఏడు అంతస్తుల్లో.. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో డిజైన్ ఫర్నిచర్ ఉండేలా రూపొందించాం. ఒక్కో సెక్షన్‌కు వెళ్లి చూస్తే.. అచ్చం బెడ్రూమ్లో ఉన్నట్టు అనుభూతిస్తారు’ అని వివరిస్తారు ఖుష్బూ.
…? సుంకరి ప్రవీణ్‌కుమార్
చిన్న యాదగిరి గౌడ్
Sofa1
Sofa
Sofa4