‘ఇన్స్పెక్టర్ రుద్ర మొబైల్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఆయనతో వెంటనే మాట్లాడాలి’ ఫోన్ లిఫ్ట్ చేసిన హెడ్‌కానిస్టేబుల్ రామస్వామితో డిటెక్టివ్ స్నిగ్ధ కంగారుగా చెప్తూపోయింది. ‘సార్ ఓ పనిమీద నర్సాపూర్ వెళ్లారు మేడమ్. ఫారెస్ట్‌లో సిగ్నల్ లేనట్టుంది. స్టేషన్‌కి రాగానే చెప్తా’ బదులిచ్చాడు రామస్వామి.
గంట తర్వాత..మొబైల్ సిగ్నల్ కనెక్ట్ అవ్వడంతో అప్పటికే స్నిగ్ధ పంపిన వాయిస్ మెసేజీ రుద్రకు చేరింది. ‘రుద్ర.. నేను స్నిగ్ధను. ఓ ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. సిటీలో టెర్రర్ ఎటాక్ జరుగబోతున్నది. నేను ఎలాగోలా డూప్లికేట్ కోడ్‌ను లాకెట్‌పై ప్రింట్ చేయించా. దాన్ని డీ-కోడ్ చేయాలి. త్వరగా ఇంటికి రా..’ ఇదీ ఆ వాయిస్ మెసేజ్ సారాంశం. అది విన్న రుద్ర ఒక్కసారిగా కారుకు బ్రేకులు వేశాడు. అది వినగానే తన కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది. వెంటనే తేరుకున్న రుద్ర.. డీసీపీ సత్యనారాయణకు వివరాలు చెప్పాడు. స్నిగ్ధ ఇంటికి వెళ్తున్నట్టు సమాచారమిచ్చాడు. సత్యనారాయణ తాను కూడా అరగంటలో అక్కడ ఉంటానని రుద్రతో చెప్పాడు.
మరోగంట తర్వాత..
స్నిగ్ధ ఇంటిముందు అప్పటికే అంబులెన్స్ ఆగి ఉంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతా గందరగోళంగా ఉంది. అసలేం జరుగుతున్నదో రుద్రకు అర్థం కావడంలేదు. భయంభయంగా ఇంట్లోకి వెళ్తున్న రుద్రకు సత్యనారాయణ ఎదురుపడ్డాడు. డీసీపీ అంత టెన్షన్‌గా, బాధతో ఉండటాన్ని రుద్ర ఎన్నడూ చూడలేదు. ‘ఏమైంది సార్?’ ఆందోళనగా ప్రశ్నించాడు రుద్ర. ‘స్నిగ్ధను ఎవరో గన్‌తో కాల్చిచంపారు. ఇంతకాలం మనకు సాయపడ్డ ఆమె మనల్ని వదిలి వెళ్లినందుకు బాధపడాలో.. టెర్రర్ ఎటాక్ నుంచి నగర ప్రజలను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక ఆందోళనపడాలో ఏం తోచట్లేదు’ అంటూ గద్గద స్వరంతో చెప్తూ కుర్చీలో కూలబడ్డాడు డీసీపీ. రుద్రకు స్నిగ్ధ కాలేజీ స్నేహితురాలు. కేసులను సాల్వ్ చేయడంలో ఎన్నోసార్లు పోలీసు డిపార్ట్మెంట్కు సాయపడింది. గతమంతా ఒక్కసారిగా రుద్రకు గుర్తొచ్చి కండ్లలో నీళ్లు తిరిగాయి. ‘రుద్ర.. మన స్నిగ్ధను ఎవరు చంపారో ముందు కనిపెట్టాలి. అలాగే, ఆ టెర్రర్ ఎటాక్ కోడ్‌ను డీ-కోడ్ చేసి జరగబోతున్న విధ్వంసాన్ని ఆపాలి’ నిశ్చయంగా చెప్పాడు డీసీపీ. అదే తన లక్ష్యంగా తలాడించాడు రుద్ర.
పోస్ట్‌మార్టానికి స్నిగ్ధ డెడ్‌బాడీని పంపించారు. ఫోరెన్సిక్ టీమ్ క్లూస్ కోసం ఇల్లంతా వెతకడం ప్రారంభించింది. ఇంతలో.. ‘సార్.. ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏవీ పనిచేయట్లేదు’ చెప్పాడు రామస్వామి. రుద్రలో అనుమానాలు పెరగసాగాయి. ‘బాబాయ్.. నిఖేశ్‌కు స్నిగ్ధ మ్యాటర్ చెప్పారా?’ అడిగాడు రుద్ర. ‘లేదు సార్.. ఇప్పుడే చెప్తాను’ అని సమాధానం ఇచ్చిన రామస్వామి ఫోన్ కలిపాడు. నిఖేశ్, స్నిగ్ధ భార్యాభర్తలు. నిఖేశ్ కూడా ఒక డిటెక్టివ్. అయితే, ఓ ప్రైవేట్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. స్నిగ్ధ ఇండిపెండెంట్ డిటెక్టివ్‌గా కొనసాగుతున్నది. ‘నిఖేశ్ గారూ నమస్తే, నేను హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి’ ఫోన్లో అన్నాడు రామస్వామి. ‘నమస్తే సార్.. చెప్పండి. చాలారోజుల తర్వాత గుర్తొచ్చాం?’ ఆటపట్టించినట్టు అన్నాడు నిఖేశ్. ‘సార్.. మన స్నిగ్ధ మేడమ్‌ను ఎవరో హత్య చేశారు. మీరు త్వరగా రండి’ అసలు విషయం చెప్పాడు రామస్వామి. ‘వాట్.. ఏంటి మీరు మాట్లాడేది?’ అంటూ షాక్‌కు గురైన నిఖేశ్ విజయవాడ నుంచి వెంటనే బయల్దేరుతున్నట్టు చెప్పాడు.
మరుసటిరోజు.. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక అనుమతులతో స్నిగ్ధ డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం చేయించి బాడీని బంధువులకు అప్పగించారు. స్నిగ్ధ పార్థివ దేహం వద్దకు చేరిన సన్నిహితులు నివాళులు అర్పిస్తున్నారు. సాక్ష్యాలు చెదరకుండా ఇంట్లోని క్రైమ్ స్పాట్‌ను బారికేడ్లతో పోలీసులు రిస్ట్రిక్ట్ చేశారు. కాసేపటి క్రితం.. నిఖేశ్ వచ్చాడు. ‘స్నిగ్ధా’ అంటూ గుండెలవిసేలా ఏడ్చాడు. అతణ్ని ఆపడం ఎవరితరమూ కాలేదు. ‘నిఖేశ్.. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనం చేయాల్సింది చాలా ఉంది. యాజ్ ఏ డిటెక్టివ్.. మీ సాయం ఇప్పుడు మాకు చాలా అవసరం’ అంటూ రుద్ర సముదాయిస్తూనే నిఖేశ్‌ను పక్కకు తీసుకెళ్లాడు. కాసేపటికి తనలో తాను తమాయించుకొన్న నిఖేశ్.. ‘రుద్ర.. స్నిగ్ధను ఎవరు చంపారో తెలిసిందా?’ అని అడిగాడు. లేదన్నట్టు తలూపాడు రుద్ర.
‘గన్‌పౌడర్ శాంపిల్స్‌ని ఫోరెన్సిక్కి పంపించలేదా?’ తిరిగి ప్రశ్నించాడు నిఖేశ్. ‘అదీ ట్రై చేశాం నిఖేశ్. అయితే, హంతకుడు చాలా తెలివిగా ఆ సాక్ష్యాన్ని కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు’ బదులిచ్చాడు రుద్ర. ‘ఒక భర్తగా ఆ హంతకుడిని పట్టుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది’ నిశ్చయంగా అన్నాడు నిఖేశ్. ‘అంతేకాదు నిఖేశ్.. సిటీలో టెర్రర్ ఎటాక్‌కు కొందరు ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఆ విషయాన్ని కూడా ఛేదించాల్సిన బాధ్యత నీపైనే ఉంది’ అన్నాడు రుద్ర. అర్థం కానట్టు కాస్త ఆశ్చర్యపడ్డ నిఖేశ్.. ‘ఏంటి రుద్ర? టెర్రర్ ఎటాక్ ఏంటి?’ అంటూ షాకయ్యాడు. ‘అవును నిఖేశ్. సిటీలో టెర్రర్ ఎటాక్ జరుగబోతున్నదని స్నిగ్ధనే నాకు వాయిస్ మెసేజ్ పంపింది. అదేంటో తెలుసుకొందామని ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఆమెను చంపేశావ్’ అన్నాడు రుద్ర. తొలుత కంగుతిన్న నిఖేశ్.. నాలుగు దెబ్బలుపడేసరికి అసలు విషయం కక్కాడు. స్నిగ్ధను తానే చంపినట్టు ఒప్పేసుకొన్నాడు. కానీ, డూప్లికేట్ కోడ్ ఉన్న స్నిగ్ధ లాకెట్ ఏమైందో తనకు తెలియదని తెగేసి చెప్పాడు. ఆ విషయం పక్కనపెడితే, స్నిగ్ధను నిఖేశ్ హత్య చేశాడని రుద్ర ఎలా కనిపెట్టాడు?
సమాధానం:
రామస్వామి ఫోన్లో.. స్నిగ్ధ హత్యకు గురైనట్టు మాత్రమే చెప్పాడు. అయితే, ‘గన్ పౌడర్ శాంపిల్స్‌ని ఫోరెన్సిక్కి పంపించలేదా?’ అంటూ గన్‌తో కాల్చడంవల్లే స్నిగ్ధ చనిపోయినట్టు పోలీసులు చెప్పకముందే నిఖేశ్ చెప్పాడు. అలా దొరికిపోయాడు. కాగా, తాను పనిచేస్తున్న ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ వ్యక్తులు.. ఉగ్రవాదులతో చేతులు కలిపారని, సిటీలో బాంబుదాడులకు కుట్రపన్నారని నిఖేశ్ పోలీసులకు చెప్పాడు. ఎక్కడెక్కడ బాంబులు పెట్టారు? అవి ఎప్పుడు పేలుతాయో మాత్రం తనకు తెలియదని, దానికి సంబంధించిన కోడ్ మాత్రం స్నిగ్ధకు తెలిసిందని పేర్కొన్నాడు. దీంతో ఆమెను చంపాలంటూ తనను పురమాయించారని, లేకపోతే తనను చంపుతామని బెదిరించారని చెప్పాడు. గత్యంతరం లేకనే స్నిగ్ధను చంపినట్టు పేర్కొన్నాడు. దీంతో ఉగ్రవాదుల స్థావరానికి బయల్దేరింది రుద్ర అండ్ టీమ్.
…? రాజశేఖర్ కడవేర్గు