పచ్చని మొక్కలు నాలుగు ఉంటే… ప్రతి లోగిలీ బృందావనమే! కానీ, మొక్కలు తెచ్చి పెంచే ఓపిక, వాటిని నిర్వహించే తీరిక ఎందరికి ఉంది? ఇలాంటి వారికోసమే మొక్కలు అద్దెకిచ్చే సేవలు మొదలయ్యాయి. ఈ కొత్తరకం విధానం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో జనాలను ఆకర్షిస్తున్నది. ఇంటిని అందంగా, చల్లగా మార్చే ట్రెండ్‌కు యువత గ్రీన్ కార్పెట్ పరచి స్వాగతిస్తున్నది. నచ్చిన మొక్కలను ఆన్లైన్లో బుక్ చేస్తే చాలు.. మీ ఇంటికి చేరిపోతాయి. సీజన్ తర్వాత వచ్చి తీసుకెళ్తారు.
నగరాల్లో ఊపందుకుంటున్న అద్దె మొక్కల సేవలు Ugaoo, Greenly లాంటి వెబ్సైట్లు, స్థానిక నర్సరీలు అందిస్తున్నాయి. మొక్కల ఎంపికను బట్టి నెలకు రూ.200 నుంచి రూ.1000 వరకు కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు కావాలనుకున్నప్పుడు వాటిని తిరిగి ఇచ్చేయొచ్చు. దీంతో స్థల సమస్య ఉండదు, నిర్వహణ భారమూ పడదు. పైగా ఈ మండువేసవిలో మీ లోగిలి పచ్చదనంతోపాటు చల్లదనంతో మురిసిపోతుంది.
మొకలు ఇంటిని స్టయిలిష్‌గా మార్చడమే కాదు, గాలిని శుద్ధి చేసి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇంటి అందాన్ని రెట్టింపు చేసే జాస్మిన్, వక్క జాతి చెట్టు, వెదురు లాంటి మొక్కలను ఎక్కువగా అద్దెకు తీసుకుంటున్నారట. ఈ నయా ట్రెండ్‌కు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతున్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో #GreenLiving, #PlantLovers ట్యాగ్‌లతో రీల్స్ వైరల్ అవుతున్నాయి. మొకలతో అలంకరించిన ఇళ్లను యువత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ ట్రెండ్‌ను బూస్ట్ చేస్తున్నారు. పర్యావరణహిత జీవనం, తకువ బడ్జెట్లో ఫ్యాషనబుల్ డెకర్ కోసం ఈ సర్వీస్ టాప్ చాయిస్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో కొండాపూర్, మాదాపూర్ నర్సరీలు, కొన్ని గ్రీన్ స్టార్టప్‌లు ఈ సేవలను జోరుగా అందిస్తున్నాయి. అద్దెకు తరలివచ్చే వసంత సంతసాన్ని మనమూ ఆస్వాదిద్దాం.