Contact Lense care | ఇటీవల కాలిఫోర్నియాలో ఓ మహిళ కంట్లో నుంచి 23 కాంటాక్ట్ లెన్స్‌లను వైద్యురాలు బయటకు తీశారు. కంట్లో పెట్టుకున్న లెన్స్‌లను రాత్రి వేళ తీయడం మరిచిపోయిన సదరు మహిళ.. ఉదయాన్నే మరో లెన్స్ పెట్టుకున్నది. ఇలా మొత్తం 23 కాంటాక్ట్ లెన్సులు ఆమె కంట్లో ఉండిపోయాయి. చివరకు కంట్లో నొప్పిగా ఉండటం, దృష్టి సమస్యలు రావడంతో.. ఆమె చేసిన తప్పిదం బయటపడింది. ఇలాంటి మహిళలు మన చుట్టూ కూడా ఉన్నారు. కాంటాక్ట్ లెన్సులను వాడేవారు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే దృష్టి పూర్తిగా పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని హైజీన్ టిప్స్ మీ కోసం..
చేతుల పరిశుభ్రత
మన చేతులు చాలా సూక్ష్మక్రిములతో కప్పబడి ఉంటాయి. అందుకని కాంటాక్ట్ లెన్స్ పెట్టే ముందు లేదా బయటకు తీసే ముందు చేతులను కడిగి శుభ్రం చేసుకోవాలి. లోషన్ లేని సబ్బును ఉపయోగించాలి. ఆ తర్వాత చేతులను ఆరబెట్టి లెన్స్ కోసం వాడాలి.
క్రమం తప్పని పరీక్షలు
కాంటాక్ట్ లెన్స్ ధరించిన వారు ఏడాదికి ఒకట్రెండు సార్లు ఆప్టోమెట్రిస్ట్ ద్వారా క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోవాలి. వైద్యులు చెప్పే సూచనలను తూచా తప్పక పాటించాలి. ఇలా కళ్లను పరీక్షించుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా వైద్యపరీక్ష చేయించుకోవడం ద్వారా లెన్స్‌తో వస్తున్న సమస్యలను గుర్తించి నివారించేందుకు సాయపడుతుంది.
ఇతరులతో పంచుకోవడం
మనం వాడే కాంటాక్ట్ లెన్సులను ఇతరులతో పంచుకోవద్దు. కుటుంబసభ్యులైనా, స్నేహితులకైనా మన కాంటాక్ట్ లెన్సులను ఇవ్వకూడదు. అలాకాకుండా ఒకరి వాడే లెన్సులను మరొకరు వాడటం వల్ల వారి కంట్లో ఉండే బ్యాక్టీరియా, అలర్జీలు ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. లెన్స్‌లను పంచుకోవడం వలన కంటి ఇన్ఫెక్షన్లు, కార్నియల్ అల్సర్లు వంటి ఇతర సమస్యలకు దారితీసే అవకాశాలుంటాయి.
అవసరం లేని సమయాల్లో..
కాంటాక్ట్ లెన్సులను అవసరమైన సమయాల్లోనే వాడటం అలవాటు చేసుకోవాలి. స్నానం చేసే సమయాల్లోగానీ, నిద్రకు ఉపక్రమించే సమయంలోగానీ లెన్సులను బయటకు తీసి భద్రపరుచుకోవాలి. రాత్రి వేళ కార్నియా ప్రశాంతంగా ఉండేలా లెన్స్‌ను తీసేయాలి. లెన్సులతోనే పడుకోవడం వల్ల కళ్లు ఎర్రగా మారడం, పుండ్లు పడటం, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
నిత్యం శుభ్రం చేసుకోవడం
నిత్యం లెన్సులను శుభ్రం చేసుకోవడం మరిచిపోవద్దు. వాటి పరిశుభ్రత మన కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్స్‌లను వాడకపోతే ప్రతిరోజూ లెన్స్‌లను క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోవాలి. వైద్యులు సూచించిన మేర లెన్స్ కేర్ సొల్యూషన్ ఉపయోగించాలి.