పిల్లలకు బొమ్మలు చూడాలని ఆశ. తనకేమో బొమ్మలు గీయాలన్న ఆశయం. రంగుల కళతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకోవాలని కలలు కన్నాడు కానీ, అన్నం పెట్టి చదివించలేని ఇల్లు అతని ఆశలకు ఆదిలోనే గండి కొట్టింది. అయినా పట్టు విడవలేదు. ఊరు దాటి గురుకుల పాఠశాలకు చేరాడు. అక్కడ తన కళకు కొత్త రూపాన్ని సాధించాడు. దానికి నగిషీలు చెక్కాలని చేతిలో చిల్లిగవ్వ లేకుండా హైదరాబాద్‌లో ఊడిపడ్డాడు. బ్యానర్లు రాస్తూ కెరీర్ మొదలుపెట్టాడు. పట్టుదల, ప్రేరణ, ప్రయత్నం ఇవన్నీ అతణ్ని రంగుల ప్రపంచంలో ప్రకాశింపజేశాయి. చేయి తిరిగిన చిత్రకారుడిగా నిలబెట్టాయి. అంతర్జాతీయ కళాకారుడిగా పేరు తెచ్చుకుంటున్న ఆ పేదింటి బిడ్డ పేరు వరికిల్ల కిరణ్. ఆకలి క్యాన్వాస్పై మెరిసిన ఈ రంగుల కిరణం ‘బతుకమ్మ’తో పంచుకున్న ముచ్చట్లు ఇవి..
పెద్దపల్లి జిల్లాలో చిన్న బొంకూరు అనే మారుమూల పల్లెటూరు మాది. మా అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలు. ఆ రోజుల్లో మా ఊరికి బస్సు లేదు. మా వాళ్లకు నన్ను చదివించే స్తోమత లేక పెద్దమ్మ వాళ్ల ఇంట్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. అట్లా నర్సాపూర్ (ఎలిగేడు మండలం) ప్రభుత్వ పాఠశాలలో చదివాను. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరేందుకు పరీక్ష రాశాను. మేడిపల్లిలోని గురుకుల పాఠశాలలో సీటొచ్చింది.
అందులో అయిదో తరగతిలో చేరాను. అక్కడ తాండ్ర అశోక్ అనే ఆర్ట్ టీచర్ నాలో ప్రతిభను గుర్తించారు. బొమ్మలు గీయడం, రంగులు దిద్దడంలో మెలకువలు నేర్పించారు. ఆ సార్‌కు బదిలీ అయ్యాక ఆయన స్థానంలో వచ్చిన వెంకటేశ్వర్లు సార్ కూడా నన్ను ప్రోత్సాహించారు. ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చదవమని చెప్పారు. ఎలా చదవాలి? ఎక్కడ చేరాలో ఆయన చెబుతూ ఉండేవారు. అలా బొమ్మలే నా జీవితం అనే అభిప్రాయానికి వచ్చాను. చదువు మీద పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఆర్టిస్ట్ కావాలన్న కోరికతో పెరిగాను. చదువుకునే సమయమంతా బొమ్మలు గీయడానికే కేటాయించాను. మెదక్‌లోని బాల వికాస సమితి నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో నాకు జిల్లా స్థాయిలో మొదటి బహుమతి వచ్చింది. అలా ఎన్నో బహుమతులు గెలుచుకోవడంతో నాకు అవి కొత్త ప్రేరణనిచ్చాయి.
పనికి చదువు పథకం
పదో తరగతి తర్వాత కాలేజీలో చదవడానికి డబ్బుల్లేవు. కాలేజ్ ఫీజు, పుస్తకాల ఖర్చులకు రూపాయి ఇచ్చేవాళ్లు లేరు. ఇంట్లో రెక్కాడితె డొక్కాడని పరిస్థితి. గోదావరిఖనిలో సాయి గీతాంజలి జూనియర్ కాలేజ్ ఉంది. ‘కాలేజ్ ఫీజ్ లేకుండా నాకు చదువు చెప్పాలి. నేను వాళ్లకు బ్యానర్లు, బోర్డులు, వాల్ రైటింగ్ ఉచితంగా రాయాలి’ అన్న ఒప్పందంతో ఇంటర్ చదివాను. సెలవు రోజుల్లో కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తుల గురించి గోడలపై రాసే ఒక ఆర్టిస్ట్ దగ్గర రోజు కూలీగా పని చేసేవాడిని. రకరకాల ఉత్పత్తుల బొమ్మలు వేసి, వాటి గురించి రాసేవాడిని. ఆ రోజుల్లో రోజుకు డబ్బు రూపాయలు కూలీ ఇచ్చేవాడు. అది చాలా పెద్ద మొత్తం. అలా నా పుస్తకాలు, దుస్తులు, ఇతర ఖర్చులకు పైసలు సంపాదించుకునేవాడిని. చదువు మీద పెద్దగా శ్రద్ధ లేదు. ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను.
హైదరాబాద్‌లోని శ్రీవేంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌లో అయిదేళ్ల బీఎఫ్ఏ కోర్సుకి పదో తరగతి పాస్ అయితే చాలు. ఆ కోర్సులో చేరాలని పరీక్ష రాశాను. సెలెక్ట్ అయ్యాను. బీఎఫ్‌ఏలో చేరాలంటే పదిహేను వందల రూపాయలు ఫీజు కట్టాలి. నా దగ్గర అంత లేవు. ఇంటర్ చదివిన కాలేజ్ వాళ్లు నాకు సాయం చేశారు. బీఎఫ్‌ఏలో చేరడానికి ఫీజు ఉంది. కానీ, హైదరాబాద్ వెళ్లడానికి డబ్బుల్లేవు. పెద్దపల్లిలో రైల్వే కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన ఆర్ట్‌ని బాగా ఇష్టపడేవాడు. నేను బోర్డులు రాస్తుంటే చాలాసేపు నిలబడి చూసేవాడు. అలా తనతో పరిచయం ఏర్పడింది. ఓరోజు ఆ అన్న దగ్గరికి వెళ్లాను. ఆయన పక్కనుంటే టికెట్ లేకున్నా ఎవరూ పట్టుకోరని తన వెంట సికింద్రాబాద్ దాకా వస్తానని అడిగాను. కాదనకుండా ఆ అన్న నాకోసం వచ్చాడు.
కాలేజే కాటేజ్
మాదాపూర్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌కి చేరాను. ఉన్న డబ్బులు ఫీజు కింద కట్టాను. అక్కడ తెలిసిన వాళ్లెవరూ లేరు. సాయంత్రం అయింది. ఎక్కడ ఉండాలో తెలియదు. ఎటు పోవాల్నో తెలియదు. సిటీలో చుట్టాలు లేరు. ఫ్రెండ్స్ లేరు. కాలేజ్ గేట్ ముందు నిలబడ్డా. ఏం చేయాలో తోచట్లేదు. సెక్యూరిటీ గార్డ్ నవీన్ దగ్గరికి పోయి ‘అన్నా నాకు తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. ఏదన్నా దారి చూపించు. ఎవరన్నా ఉంటే చెప్పు’ అని రిక్వెస్ట్ చేశాను. ‘ఇప్పటికైతే ఈడ పడుకో. కానీ ఈడ ఉంటున్నట్టు ఎవరికీ తెలియకూడదు. రాత్రి పదిన్నర తర్వాత లోపలికి రా. తెల్లవారకముందే.. నాలుగు గంటలకల్లా వెళ్లిపో’ అన్నడు. కాలేజ్‌లో వారం రోజుల కంటే ఎక్కువ పడుకోవద్దని కండిషన్ పెట్టిండు. ‘ఈలోపు ఏదైనా చూసుకో’ అన్నాడు. అట్ల కాలేజ్ నాకు ఆవాసమైంది.
సైన్ బోర్డ్ రాస్తుంటే కిడ్నాప్
కాలేజ్‌లో పరిచయాలు పెంచుకుని ఒక స్టూడెంట్‌తో కలిసి మాదాపూర్‌లో ఒక ప్లాట్ అద్దెకు తీసుకున్నా. నెలకు ఏడువేల అద్దెలో సగం నేను కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు. దగ్గర్లో కుమార్ అనే ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ ఉన్నారని తెలిసింది. ఆయన్ని కలిస్తే.. ఒక బోర్డ్ రాయమని పంపారు. ‘ఈ భూమి ఫలానా వాళ్లద’ని రాస్తున్న. ఇంతలో.. ఒక నల్ల స్కార్పియో కార్ వచ్చింది. అందులోంచి నలుగురు దిగారు. నన్ను గుంజుకుపోయి కార్లో కుక్కారు. ‘కాళ్లావేళ్లాపడి నా బాధలు చెప్పుకొంటే కొంత దూరం వెళ్లాక కారు ఆపారు. డోరు తీసి బయటికి తోసేసి.. ‘ఇదర్ నహీ ఆనా’ అంటూ వెళ్లిపోయారు.
కోఠి కష్టాలు
రామ్కోఠీలో ఉన్న దుకాణాలన్నీ తిరిగాను. నా గురించి చెప్పుకొంటూ మూడు రోజులు తిరిగితే ఒక షాపులో పని దొరికింది. బ్యానర్లు, బోర్డులు రాసేవాణ్ని. రాత్రి పదకొండు గంటల వరకు అక్కడే పనిచేసేది. టీ, టిఫిన్, మీల్స్ అన్నీ అక్కడే. అలా కలిసి పనిచేస్తూ, కలిసి తింటూ ఉండటం వల్ల అక్కడివారితో స్నేహం పెరిగింది. ఆ షాపులోనే పడుకోమన్నారు. బ్యానర్లు, బోర్డులు రాసిన తర్వాత అక్కడే తిని పడుకునేది. పొద్దునే లేచి, సుల్తాన్ బజార్లో సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి, డ్రెస్ మార్చుకుని, బ్యాగు షాప్‌లో పెట్టేది. కోఠీలో కొండాపూర్ బస్సెక్కి కాలేజీకి వెళ్లేది. సాయంత్రం షాప్‌కు వచ్చి రాత్రి రెండు, మూడు గంటల వరకు పని చేసేవాణ్ని. అలా మూడేండ్లు గడిచాయి. ఫైన్ ఆర్ట్స్‌కి వచ్చాక సైన్ బోర్డులు రాస్తే గుర్తింపు లేదని అర్థమైంది. పోర్ట్రెయిట్స్ ఎక్కువగా చేశాను. వీటికి డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్లు. ఆదాయం పెరిగాక ఎల్బీ నగర్లో ఒక రూమ్ తీసుకున్నా. ఇద్దరు తమ్ముళ్లను తీసుకొచ్చా. వాళ్లను చదివిస్తూనే బీఎఫ్ఏ పూర్తిచేశాను.
ఎనిమిదేళ్ల అజ్ఞాత వాసం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఎఫ్‌ఏలో చేరిన. అక్కడ నా జీవితం గొప్ప మలుపు తిరిగింది. పెయింటింగ్ ఎలా చేయాలి? ఆర్ట్‌ని కరెన్సీగా ఎలా మలచుకోవాలో తెలిసింది. ఇంటర్నేషనల్ ఆర్ట్ గురించి అవగాహన పెరిగింది. గ్యాలరీల ఇంట్రెస్ట్ ఏమిటో తెలిసివచ్చింది. ఎంఎఫ్ఏ చదివే రోజుల్లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఇచ్చే ఉత్తమ చిత్రకారుడి అవార్డ్, తెలుగు యూనివర్సిటీ ఫెలోషిప్ వచ్చాయి. బీఎఫ్ఏ కోసం హైదరాబాద్ వచ్చిన నేను ఎంఎఫ్ఏ పూర్తయిన ఏడాది తర్వాత ఊరికి వెళ్లాను. ఎనిమిదేండ్లు ఊరికి, అమ్మానాన్నలకు, అందరికీ దూరంగా ఉన్నాను. అప్పుడప్పుడూ అమ్మానాన్నలతో ఫోన్లోనే మాట్లాడేది. ఆర్ట్ నేర్చుకోవాలి. ఆర్ట్‌తో డబ్బు సంపాదించాలి. మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు సాధించాలనే అంతకాలం కష్టపడ్డాను. అనుకున్నది సాధించాను. ఇద్దరు తమ్ముళ్లను చదివించాను. ఒక తమ్ముడు బీఎఫ్ఏ పూర్తిచేశాడు. మరో తమ్ముడు బ్యాంక్ ఉద్యోగంలో చేరాడు. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకున్నాను.
కష్టాలను ఎంజాయ్ చేశా
నేను చదివే రోజుల్లోనే తెలుగు విశ్వవిద్యాలయం, విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం- లండన్, సాలార్జంగ్ మ్యూజియం, లలిత కళా అకాడమీ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ లాంటి ప్రసిద్ధ సంస్థలు నా ఆర్ట్స్‌ని సేకరించాయి. చిన్న వయసులోనే నాకు గొప్ప గుర్తింపు దక్కింది. వయసురీత్యా ఉండే ప్రభావాలను వ్యక్తపరుస్తూ తొలి రోజుల్లో ‘డామినేషన్’ అనే సిరీస్ చేశాను. ఆ తర్వాత నాకు జ్ఞానాన్నిచ్చి, దారి చూపిన గురువులు, స్నేహితులు, సన్నిహితులను గుర్తు చేసుకుంటూ ‘ఎన్లైటెన్మెంట్’ పేరుతో ఆర్ట్ సిరీస్ మొదలుపెట్టాను. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. అలాగే ఒక టీచర్ మరొకరిని వెలిగిస్తాడు. నాకు సహకరించిన వాళ్లు, దారిచూపిన వాళ్ల వల్ల నేను ప్రకాశిస్తున్నాను. అదే ఈ సిరీస్‌కి స్ఫూర్తి. జీవన పోరాటంలో ఎన్నో కష్టాలుపడ్డా ఎప్పుడూ బాధపడలేదు. వాటిని కూడా ఎంజాయ్ చేశాను. ట్రెక్కింగ్ చేసేవాళ్లు ఉత్సాహంగా కొండలెక్కినట్టు నాకు ఇది లేదని బాధపడకుండా కష్టాలను అధిగమించాను.
…? నాగవర్ధన్ రాయల