జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండాలని ప్రతిఒక్కరూ ఆశపడతారు. కానీ, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో జుట్టుపై శ్రద్ధపెట్టే సమయమెక్కడిదీ? జుట్టు సమస్యలకు ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలెన్నో. చాలామంది జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హెయిర్ ప్యాక్‌లు, మసాజ్‌లు, రకరకాల చిట్కాలు పాటిస్తారు. ఒత్తయిన జుట్టుకోసం మీరూ ఓసారి ఇలా ట్రై చేయండి.
క్యారెట్: క్యారెట్ వెంట్రుకలను దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో విటమిన్ బీ7 పుష్కలంగా ఉంటుంది. దీన్నే బయోటిన్ అని పిలుస్తారు. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే క్యారెట్‌ని ఉపయోగించి తయారుచేసిన హెయిర్‌ప్యాక్‌ని అప్పుడప్పుడూ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందచ్చు. దీనికోసం కొన్ని క్యారెట్ ముక్కలను తీసుకొని నీటిలో వేసి ఉడకబెట్టి మెత్తటి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్త్లె చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వెంట్రుకలు రాలడాన్ని నియంత్రించి వాటిని దృఢంగా పెరిగేలా చేస్తుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీ తాగడంతో పాటు తలకు ప్యాక్‌లా పట్టించడం వల్ల కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికోసం నాలుగైదు గ్రీన్ టీ బ్యాగ్‌లను.. అరలీటర్ నీటిలో వేసి వేడి చేయాలి. నీళ్లు చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో తలను బాగా తడపాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
మందారం హెయిర్ ప్యాక్: ముందుగా మందార పూలను రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. పూలతో పొడి చేసుకోవాలి. ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల పెరుగులో ఓ టేబుల్ స్పూన్ మందారం పొడిని కలపాలి. ఇందులో రోజ్ మేరీ ఎస్సెన్స్ కూడా కలుపుకోవచ్చు. ఇది పింక్ రంగులోకి మారిన తర్వాత తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.