Cactus | చిరుజల్లు పడగానే చిలకమ్మ రంగులోకి మారిపోతుంది ప్రపంచమంతా. ఆ అందాన్ని చూసి పసరు వర్ణపు సోయగాన్ని మన ఇంటికీ కాస్త పులిమితే బాగుంటుందని మనసు ఉవ్విళ్లూరుతుంది. అందుకే ఈ కాలంలో కనీసం ఒకటో రెండో ఆకుపచ్చటి అంకురాలను పొదరింట్లో పదిలం చేస్తాం. ఆ ఆసక్తి ఉన్నవాళ్లూ, అందులోనూ ఆ మొక్కలు కాస్తోకూస్తో కళాత్మకంగానూ కనిపించాలనుకునే వాళ్లకు చక్కని ఎంపిక ‘జిగ్జాగ్ కాక్టస్’. దీన్నే ‘ఫిష్బోన్ కాక్టస్’ అనీ అంటారు. చూసేందుకు జిగ్జాగ్ ఆకృతిలో ఉండటం, లేదా చేప ఎముకను పోలి ఉండటం వల్ల దీనికాపేరు వచ్చింది.
‘ఎపిఫైలమ్ యాంగులిగర్’ ఈ మొక్క శాస్త్రీయ నామం. మొదట సన్నటి పుల్లలా మొదలయ్యే దీని రెబ్బలు పెరిగే కొద్దీ ఇలా జిగ్జాగ్ ఆకృతిని సంతరించుకుంటాయి. ఇంటి లోపల కిటికీలోంచి సూర్యకాంతి పడే చోట పెంచుకోవచ్చు. అలా అని మరీ ఎక్కువ వెలుతురూ అక్కర్లేదు. నీళ్లు కూడా ఒక మోస్తరుగా పోస్తే చాలు. తగినంత కాంతి లేకపోతే మాత్రం ఆకృతి సరిగ్గా ఏర్పడదు. చెట్టుకు రెండు మూడేండ్ల వయసు వచ్చాక… అందమైన తెలుపు, గులాబీ రంగు పువ్వులను పూస్తుంది! అప్పటివరకూ ప్రేమగా సంరక్షించుకోవాలి.