ప్రేమతో పోల్చదగిన మధుర పదార్థం తేనె. తుట్టె నుంచి స్రవించే తేనె వలపు కవితలా రసభరితం. దాన్ని పదిలపరిచి వనిత మెడలో నగలా వేయాలనుకున్నారు సృజన కారులు. ఆ ఆలోచనకు రూపమే హనీకాంబ్ జువెలరీ.
హనీ.. అన్న మాట చెవిన పడితే చాలు. ఎవరికైనా వలపు పిలుపే వినిపిస్తుంది. మధురమైన పదార్థాన్ని గుర్తు చేసుకుంటూ ఆమెను సుమధురంగా సంబోధిస్తాడు ప్రియుడు. ఆ పిలుపు వినగానే.. అమ్మాయిలకూ చెవిలో తేనె పోసినంత ఆనందం. అంతేకాదు, తేనెటీగలు కూడా ప్రేమ చిహ్నాలే. ‘రాణీ ఈగలా నా హృదయానికి నువ్వే మహారాణివి’ అనే భావాన్ని స్ఫురింపజేస్తుందట తేనెగూడు మీద ఉండే తేనెటీగ చిహ్నం.
ఆ ఆనందాన్ని అందంగా ఇముడ్చుకున్న హనీకాంబ్ నగలు ఇప్పుడు అమ్మాయిల ప్రేమకు నోచుకుంటున్నాయి. తేనెగూడులానే వీటికీ గడులు ఉంటాయి. అందులో తేనెలా రెజిన్లాంటి పదార్థం, దాని మీద తేనెటీగ బొమ్మ ఉండటం ఓ ప్రత్యేకత. రెజిన్లోపల పువ్వులు వేసి కూడా ముస్తాబు చేస్తున్నారు.
ఇక, కేవలం గూడు డిజైన్లోనూ వస్తున్నాయి. లాకెట్లు, ఉంగరాలు, చెవి పోగులు, బ్రేస్లెట్లు.. ఇలా రకరకాల నగలు రూపుదిద్దుకుంటున్నాయి. బంగారం, వెండితోనూ ఈ ఆభరణాల్ని తయారు చేస్తున్నారు. ఫ్యాషనబుల్ దుస్తుల మీదికి కూడా సూపర్‌గా సూట్ అవుతాయి. చూడగానే ‘వారెవ్వా’ అనిపిస్తాయి. తేనెగూడు మీ గుండెగూడు చేరిందా మరి!