నేను ఇంటర్ చదువుతున్నా. వయసు పదిహేడు. క్లాస్‌లో యాభైమంది ఉన్నా.. ఓ ఐదుగురం క్లోజ్‌గా ఉంటాం. కానీ గత నాలుగైదు నెలల నుంచీ మా బృందంలో మునుపటి హుషారు తగ్గింది. కలుసుకోవడమూ తక్కువే. ఐఐటీ కోచింగ్ అని ఒకరు, ఆన్లైన్ ట్యూషన్స్ అని ఒకరు దూరమైపోతున్నారు. నాకు చాలా వెలితిగా అనిపిస్తున్నది. కొత్తవాళ్లతో స్నేహం చేయాలంటేనేమో బెరుకు. చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నా. మీరే సలహా ఇవ్వాలి.
జీవితం ఓ ప్రవాహం లాంటిది. ఎన్నో మజిలీలు. ప్రతి మజిలీలో కొత్తగా కొందరు స్నేహితులు అవుతారు. రకరకాల కారణాలతో పాత స్నేహితులు దూరం అవుతారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎలిమెంటరీ స్కూల్ స్నేహితులు, హైస్కూల్ స్నేహితులు, కాలేజీ స్నేహితులు.. ఇలా ఓ జాబితా రాసుకోండి. మొదటి జాబితాకు, రెండో జాబితాకు పొంతనే ఉండదు. మూడో జాబితా మరింత కొత్తగా కనిపిస్తుంది. కాబట్టి, అనివార్య పరిస్థితుల్లో దూరమైపోయే దోస్తుల గురించి ఆలోచించొద్దు. అయినా, రోజూ కలుసుకొని కబుర్లు చెప్పుకోవడమే స్నేహానికి కొలమానం కాదు. వీలైతే వారానికోసారి, లేకపోతే నెలకోసారి మీట్ కావచ్చు. ఆన్లైన్ కబుర్లు ఎలాగూ ఉంటాయి. కొత్త స్నేహాల విషయంలో మొహమాటం వద్దు. ఆఫ్‌లైన్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ఒక్క చిరునవ్వు చాలు. అదే సమయంలో చదువుల మీదా ఫోకస్ చేయండి.