హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు అనగానే మనకి గుర్తొచ్చేవి రెండు.. ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీలు, రెండు అంతులేని ట్రాఫిక్ జామ్‌లు! ఈ ట్రాఫిక్ నరకంలో పడి రోజుకు ఎన్నిసార్లు మనోళ్లు తిట్టుకుంటారో లెక్కలేదు. అమ్మాయిలైతే చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. రాంగ్ రూట్లో వచ్చేవాడు ఒకడైతే.. డ్యాష్ కొట్టి వెళ్లేవాడు ఇంకొకడు.ఇలాంటి పోకిరీలపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ‘మనకెందుకులే’ అని లైట్ తీసుకుంటాం.
కానీ, బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పంకజ్ తన్వర్ మాత్రం అలా లైట్ తీసుకోలేదు. ‘రోడ్డుపై మూర్ఖంగా ప్రవర్తించే వారిని చూస్తే విసుగొస్తుంది’ అని తిట్టుకుంటూ కూర్చోకుండా, తన కోపాన్ని ఒక టెక్నాలజీ ఆయుధంగా మార్చాడు. తన హెల్మెట్నే ఒక ‘మినీ ఏఐ ట్రాఫిక్ పోలీస్’గా మార్చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
సాధారణంగా హెల్మెట్ అంటే తలని కాపాడుతుంది. కానీ, పంకజ్ హెల్మెట్ మాత్రం ట్రాఫిక్ని కాపాడుతుంది.
డ్యాష్ క్యామ్-ఏఐ: పంకజ్ తన హెల్మెట్‌కు ఒక డ్యాష్ క్యామ్, ఆన్-డివైజ్ ఏఐ సిస్టమ్‌ను అమర్చాడు.
రియల్ టైమ్ గుర్తింపు: రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, ఈ ఏఐ సిస్టమ్ వారిని వెంటనే గుర్తిస్తుంది.
ఆటోమేటిక్ రిపోర్ట్: నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనం నంబర్ ప్లేట్‌ను ఫొటో తీయడం, వివరాలను రికార్డ్ చేయడం.. ఆపై నేరుగా పోలీసులకు ఈ-మెయిల్ పంపడం అంతా కేవలం కొన్ని క్షణాల్లో ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.
పంకజ్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక డెమో వీడియో పెట్టాడు. అందులో హెల్మెట్ లేని స్కూటర్ రైడర్‌ను ఏఐ సిస్టమ్ క్షణాల్లో గుర్తించి ఫ్లాగ్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ పంకజ్ తన్వర్కి కేవలం ఒక ‘హాబీ’ మాత్రమేనట. ఖాళీ టైమ్‌లో ఇలాంటి వింతైన ఆవిష్కరణలు చేయడం ఆయనకు అలవాటు. కానీ, ఈసారి ఆయన చేసిన పని మాత్రం ట్రాఫిక్ దొంగలకు చెమటలు పట్టిస్తున్నది.
టెక్నాలజీ అనేది మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలకు పరిష్కారం చూపడానికని చెబుతుంటాడు పంకజ్. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో మన రోడ్లపై క్రమశిక్షణ తెస్తుందని ఆశిద్దాం. గుర్తుంచుకోండి.. మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు మీ పక్కన వెళ్తున్న హెల్మెట్ కేవలం సేఫ్ గార్డ్ మాత్రమే అనుకోకండి! అది మిమ్మల్ని వాచ్ చేస్తున్న ‘డిజిటల్ కానిస్టేబుల్’ కూడా కావచ్చు! బీ అలర్ట్!!