హాయ్ అమ్మా! నీకు గుర్తుందా..?! అప్పుడే పుట్టిన నా వంక నువ్వు ఎంత మురిపెంగా చూశావో! నాకెలా తెలుసంటావా?! ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే! నీ బిడ్డను కదా!! ఈ చంటిపాపను చూడగానే.. నీ కంటిపాపలో ఏదో వెలుగు! నీ కళ్లల్లో ఏదో వరం పొందిన అనుభూతి. నా చిట్టికళ్లు లీలగా నీ వంకే చూశాయి. అంతలో.. నా నుదుటిపై అందమైన ముద్దు ఇచ్చావ్! అర్థం కాని బ్రహ్మరాత… అర్థవంతమైన అమ్మరాతగా మారిపోయిన క్షణం అది. ఆ నిమిషంలో నాకు తెలియకుండానే.. నా చిట్టి పెదాలపై అరనవ్వు విరబూసింది. నాన్న తీసిన ఫొటోనే అందుకు సాక్ష్యం. తొలిగా నీ ముద్దు, తొలిగా నువ్వు తినిపించిన గోరుముద్ద, మొదటిసారి మందలింపు, ప్రతీసారి నీ ఊరడింపు అన్నీ నాకు మధురమైన గురుతులే అమ్మా! నా అనుభూతులు పంచుకునే అరుదైన సందర్భం మాతృదినోత్సవం. నీ గురించి నాలుగు మంచి మాటలు. అమ్మలందరికీ అన్వయమయ్యే వరాల మూటలు.

నీ పొట్టలో నలుసుగా పడ్డప్పటి నుంచి.. నాకు అనుక్షణం ఆనందమే అమ్మా! నీ గర్భాలయం నీ మనసంత పవిత్రంగా ఉండేది. కానీ, ఎందుకో తెలియదు! ఒక్కోసారి ఉమ్మనీరు ఉప్పు సముద్రంలా ఉప్పొంగేది! ఆ రోజు బయటి నుంచి ఏవో మాటలు కాస్త గట్టిగానే వినిపించేవి! నాన్నకు, నీకు పేచీ అని అర్థమయ్యేది. నువ్వు ముభావంగా ఉండిపోయేదానివి. నేనూ అదోలా మిన్నకుండిపోయేది. సాయంత్రానికి నాన్నతో రాజీ కుదిరేది. నీలో మళ్లీ హుషారు. నాలో రెట్టించిన కదలికలు. అవి గమనించి నువ్వు ఎంతలా పొంగిపోయేదానివో.. నీకన్నా నాకే బాగా గుర్తుంది. ఎందుకంటే.. నీ గుండెకు నేను మరీ దగ్గరగా ఉండేదాన్ని కదా! నువ్వు పలికే మాటలు, పాడే పాటలు, వినే సంగీతం, తినే ఆహారం.. అన్నీ నేను నీ బొజ్జలో ఉన్నానన్న స్పృహతో ఎంత జాగ్రత్తగా చేశావో! నేను పుట్టక ముందే.. నా గురించి ఎన్నేసి జాగ్రత్తలు తీసుకున్నావో!
ఆ రోజు రానే వచ్చింది. అలా పుట్టగానే ఇలా ఏడ్చేశాను. వెచ్చని గర్భాలయం దాటి మామూలు మనుషులు మసిలే లోకంలోకి వచ్చానన్న బాధ! ఎంతసేపు.. రెండుసార్లు కేర్ మన్నానో లేదో.. ఇందాక చెప్పినట్టు నీ వెచ్చని స్పర్శ నా నోటికి తాళం వేసింది. నన్ను నీ ఒడిలోకి తీసుకున్న క్షణం మరింత అపురూపం. ఆనాడు కలిగిన భరోసా.. నేటికీ అలాగే ఉంది. ఏనాటికీ అలాగే ఉంటుంది. నా ఆకలి తీర్చడం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపేదానివో!
నాకేం పనా.. పాటా.. అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా కెవ్వుమని ఏడ్చేసేదాన్ని. ఆ వెంటనే.. ‘బంగారూ! ఓమైందిలా..’ అంటూ గుండెలకు హత్తుకొని పాలు ఇస్తుంటే అమృతపానం చేసినంత ఇదిగా ఉండేది. పాపం నాన్న కూడా లేచేవాడనుకో! ‘నేను చూసుకుంటాలే.. నువ్వు పడుకో’ అని నాన్న అన్నా.. నువ్వు ససేమిరా అనేదానివి! ఎందుకమ్మా అంత ప్రేమ నేనంటే!!

నేను బోర్లా పడితే సంతోషం. బోసిగా నవ్వితే ఆనందం. అంబాడితే నువ్వు అంబారీ ఎక్కినంత పొంగిపోయావ్. అడుగులు వేస్తే.. పరుగున వెళ్లి అందరికీ చెప్పావ్. పలుకులు పలికితే.. పంచదార చిలుకలు పంచావ్. నేనేం చేసినా.. నీకు గొప్పే! నువ్వు గొప్పగా ఉండటానికి ఏదైనా చేయాలని ఉండేది! నాకేం వచ్చు.. ఊఁ కొట్టడం, ఉలిక్కిపడటం తప్ప!! అందుకే చిత్రవిచిత్రమైన హావభావాలు ప్రకటించేది. నేను చేసే రవ్వంత విన్యాసాలు కొండంతలు చేసి అందరితో చెప్పేదానివి. ఆనక నాకు నలత చేస్తే.. ఇరుగమ్మలు పొరుగమ్మల దిష్టి అంటూ మంత్రం వేసేదానివి. నీ ఆరాటాలు, పోరాటాల నడుమ నేను రాటుదేలానమ్మా!

బడి వయసు వచ్చాక.. బడితె పూజలు తప్పేవి కావనుకో! నువ్వు మాత్రం ఏం చేస్తావ్.. నేనలా కొంటె పనులు చేస్తుంటే! నా మోకాలికి గాయమైనప్పుడు.. వీపులో రెండు తగిలించావ్. అంతలోనే గుండెకు హత్తుకొని.. నీకే నొప్పి కలుగుతున్నట్టుగా బోరున ఏడ్చావ్. ‘పెద్దగా నొప్పి లేదమ్మా’ అని నేనంటే.. ‘చూడు ఎలా రక్తం ధారలు కడుతుందో’ అని రెండు చుక్కల రక్తానికే తెగ హైరానా పడిపోయావ్. అమ్మ మనసు నొప్పించానని నేను కుదురుగా ఉండటానికి ప్రయత్నించేది. పది రోజులకే మరో గాయం. నీ ప్రేమతో మలాము రాసేదానివి. వారానికే అది మటుమాయం అయ్యేది.
అమ్మా! చదువులో నేను వెనుకబడ్డప్పుడు, నాన్న నన్ను వెనుకేసుకొని వచ్చినప్పుడు.. నీ ముఖం చూడాలి! నాకైతే నవ్వొచ్చేది. కానీ, భయంగా నటించేదాన్ని. నువ్వు నన్ను, నాన్నను కడిగేస్తుంటే గప్‌చుప్‌గా ఉండటం మాకు అలవాటేగా! నిన్ను ఉడికించడానికి బుంగమూతి పెట్టేసేదాన్ని. రాత్రి పడుకున్న తర్వాత.. నా తల నిమిరిన నీ చేతి వేళ్లు.. వెయ్యేళ్లు వర్ధిల్లు అని ఆశీర్వదించేవి. నాకు మార్కులొస్తే నువ్వు పొంగేదానివి. ఆటల్లో ఫస్టుగా నిలిస్తే నువ్వే గెలిచినంత సంబురపడేదానివి. నాకు చదువు చెప్పడం కోసం నువ్వెన్ని చదివావో నాకూ గుర్తుందమ్మా! నీ ఒడిలో అక్షరాలు దిద్దిన నేను.. ఎలా వెనుకబడతానమ్మా! అందుకే నీ ఆశలనే నా ఆశయాలుగా చేసుకున్నా! అనుకున్నది సాధించా!

నా ప్రతి దశలోనూ నువ్వు చేసిన దిశానిర్దేశం నన్ను ఇలా నిలబెట్టింది. నా విజయంలో కీలకం నువ్వు. నేను పరాజయం పాలైతే.. నీ మనసుకు కష్టం కలిగేదేమో! కానీ, నాపై నువ్వు చూపే ప్రేమలో చిటికెడు కూడా తేడా ఉండేది కాదని నాకు తెలుసు! ఎందుకంటే నువ్వు మాతృమూర్తివి. ఆది దైవానివి! నన్ను మీ అమ్మకు ప్రతిరూపంగా భావించి పెంచి, పెద్ద చేశావు. నీ ప్రేమకు నా గెలుపోటములు గీటురాయి అవ్వవు కదా! వెన్నముద్దలు తినిపించావ్. వెన్నుతట్టి ప్రోత్సహించావ్. దారి తప్పితే మందలించావ్. నా తప్పులు దిద్ది.. ఒప్పుగా నిలబెట్టావ్. ఎవరి సహకారం ఉన్నా.. లేకున్నా.. నన్ను మిన్నగా చూసుకున్నావ్! నేనూ అమ్మనయ్యాను అమ్మా! నువ్వు నన్ను పెంచిన తీరే.. అమ్మగా నా కర్తవ్య నిర్వహణకు భగవద్గీత! హ్యాపీ మదర్స్ డే అమ్మా! నాక్కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!
– అద్వైతా