జీవిత భాగస్వామిని ఎంచుకోవడమంటే కేవలం ప్రేమలో పడటం కాదు. జీవితాన్ని నిర్మించుకోవడం. అక్కడ పునాది ఎంత పటిష్ఠంగా ఉంటే తర్వాత బతుకు అంత సాఫీగా సాగుతుంది. మరి ప్రేమ పెళ్లికి చట్టబద్ధతే ముఖ్యమైనప్పుడు 18 ఏళ్లకు ముందే పెనవేసుకున్న వలపులు, అప్పుడు చేసిన ఆలోచనలు, దాన్ని అనుసరించిన నిర్ణయాలు చట్టవిరుద్ధమైనవని భావించాలా..! ఒక్క సూర్యోదయంతో అమ్మాయికి జ్ఞానోదయం అయిందని నమ్మి మైనర్ ఆడపిల్లకు రక్షణ వలయంలా ఉన్న తల్లిదండ్రులు ఆ కంచెను నరికేయాలా? 18వ పుట్టినరోజు నాడు ఆమెకు ఇక ఆపదలు రావని భావించి సమాజంలో స్వేచ్ఛగా వదిలేయాలా? నిజంగా అది ఆమెకు భద్రతేనా..??
ఒకవేళ అలా వదిలేయాల్సి వస్తే అప్పటిదాకా గుండెల్లో పెంచుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? పిల్లల పెంపకాన్ని కేవలం బాధ్యతగా మాత్రమే ఎవరైనా నిర్వర్తించగలరా? అందులో ప్రేమానురాగాలు పెనవేసుకొని ఉండే అవకాశం లేదా? వాటికి విలువ లేదా? అమ్మాయికి మంచి చెడు చెప్పడం అన్యాయమైతే అన్నాళ్లూ సాకిన వాళ్లను గుండెల మీద తన్ని వెళ్లడం న్యాయమవుతుందా? పెచ్చరిల్లే హార్మోన్ల తాకిడి ఓవైపు, రెచ్చగొట్టే సోషల్ మీడియా ఓవైపు… 18 నిండితే చాలు నచ్చిన వారితో వెళ్లిపోవచ్చు, ఎవరి అనుమతి అవసరం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు అన్న భావన నేటితరం ఆడపిల్లల్లో వేళ్లూనుకుంటున్నది. ఇది విపరీత పోకడలకు దారి తీస్తూ అటు అమ్మాయిల జీవితాలను అంధకారంలో పడేయడమే కాకుండా తల్లిదండ్రులకు తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చిపెడుతున్నది.
వివాహం అనేది నిజంగా ఇద్దరి అంగీకారం ఉంటే సరిపోయేది అయితే దానికి ఒక ప్రక్రియ, అంతమంది అతిథులు, పెద్ద వేడుక అవసరం లేనేలేదు. పెళ్లి అనేది కుటుంబాలకు అందులోని వారి జీవితాలకు కూడా సంబంధించింది. అందుకే, సంప్రదాయ ప్రక్రియలో ఇరువురి తల్లిదండ్రులు వాళ్ల కుటుంబాలు ఒకచోట చేరి తంతును నిర్వహిస్తారు. అక్కడ రెండు మూడు తరాలను చూసిన పండు జంటలు దర్శనమిస్తాయి. వాళ్ల అనుభవాలు కొత్త దంపతులకు జీవిత మార్గాన్ని నిర్దేశించి, చుక్కానిగా ఉపయోగపడతాయి. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు సీనియర్ల అవసరం ఎంత ఉంటుందో కొత్త దంపతుల పరిస్థితీ అంతే. అలాంటిది ఆర్థికంగా నిలదొక్కుకోకుండా, మానసిక పరిపక్వత సాధించకుండా జీవితాన్ని కొనసాగించాలన్న నిర్ణయం ఎంత ప్రమాదకరం.
సంప్రదాయ పద్ధతిలో వివాహం ఓల్డ్ ఫ్యాషన్ అనుకుందాం. తల్లిదండ్రుల అంగీకారం మేజర్ అయిన పిల్లలకి అవసరం లేదనే అనుకుందాం. మరి పెళ్లికి చట్టబద్ధత తెచ్చుకోవాలంటే కనీసం రిజిస్టర్ మ్యారేజ్ పద్ధతిలో వెళ్లినా ఆ ఇద్దరి అంగీకారమే సరిపోదు… కనీసం మూడో వ్యక్తి సాక్షి సంతకం పెట్టాల్సిందే. అంటే తాను అండగా ఉంటాను అంటూ ప్రభుత్వంతో అక్కడ హామీ ఇచ్చినట్టే. మరి ఆ సంతకం పెట్టే మనిషి నాన్న కన్నా నమ్మకస్తుడా? అమ్మ కన్నా అక్కున చేర్చుకునే వ్యక్తా? అన్న కన్నా అర్థం చేసుకునేవాడా? పోనీ ఇవేవీ గడిచిన 18 ఏళ్లలో నీకు అందలేదు అనుకుందాం. వాళ్లెవరూ నీ మనసును గెలుచుకోలేదు అని భావిద్దాం. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని బంధాల్లో నీకు కలగని ఆ నమ్మకం, భరోసా అవతలి ఒకే ఒక్క వ్యక్తి, పోనీ అతని కుటుంబ సభ్యులు నీకు ఇవ్వగలరా? నీ ఇంట్లో వాళ్లకే నువ్వు దగ్గర కానప్పుడు, వాళ్లకు నీకు మనసులు కలవనప్పుడు కొత్త కుటుంబంలో నువ్వు ఇమడగలవా?! ముందు రోజు దాకా గారాబంగా పెరిగిన అమ్మాయి ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడినా కొత్త ఇంట్లో అర్థం చేసుకునేవారు ఎంతవరకు ఉంటారు.
జీవితం అంటే కేవలం ప్రేమించుకోవడమే కాదు. ప్రేమ… ప్రయాణానికి నాంది మాత్రమే. తరువాత ఏర్పడే కుటుంబం, కలిగే సంతానం దాని తాలూకు బాధ్యతలు, అక్కడ ఎదురయ్యే ఒడుదొడుకులు అన్నిటినీ చాకచక్యంగా దాటగలిగే నేర్పు ఓర్పు ఉండాలి. నిజంగా 18 ఏళ్లకే ఇవన్నీ నేర్చుకుని తల్లిదండ్రుల సహాయం ఏమాత్రం లేకుండా అమ్మాయి ముందుకెళ్లగలుగుతుందా? అలా వెళ్లిపోయిన వాళ్ల జీవితాలు ఎలా ఉన్నాయో కనీసం 10 సంవత్సరాలు గడిపిన వాళ్లని అడిగి తెలుసుకుంటే అర్థం అవుతుంది. తొందరపాటు నిర్ణయాలతో పెళ్లి చేసుకున్న చాలామంది ఆడపిల్లలు దుర్భర జీవితాలను గడుపుతూ కన్నవారిని దుఃఖసాగరంలో ముంచుతున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయాక ఆమె అందం మీద మోజు తీరి వదిలేసిన మగవాళ్లు కొందరైతే, డబ్బును వాడుకుని హింసించిన వాళ్లు, కుటుంబం అండ లేదు కనుక ఎలాగైనా పడి ఉంటుందంటూ హీనంగా చూసేవాళ్లు, అదీ కాదంటే కేవలం వలపు వల విసిరి పారిపోయి వచ్చాక ఆడపిల్లల్ని అమ్మేసుకుంటున్న కేసులు పోలీసుల దగ్గర పెద్ద చిట్టానే ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి? ఏ విధంగా ఆలోచించాలి అన్న సంగతులు తప్పకుండా తెలుసుకోవాలి. అసలైన మెచ్యూరిటీ అంటే అది!
అమ్ములూ… నాన్నెందుకు చేదయ్యాడు!
‘బంగారం.. ఈ పింక్ కలర్ డ్రెస్‌లో నువ్వు చాలా బాగుంటావు’ అని పొగిడినప్పుడల్లా ముచ్చట పడి ఆ డ్రెస్ కొనిచ్చిన నాన్నను ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సింది. ‘ఈ జుంకీలు నీకు భలే నప్పుతాయి బుజ్జీ..’ అన్నప్పుడు నీ కోసం వాటిని ఏరి కోరి తెచ్చిన అమ్మని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి కదా! సినిమా చూసి వచ్చేప్పుడు ‘నిన్ను బండి మీద దింపుతాగా!’ అన్న ప్రేమికుడి మాట విని పొంగి పోయి ఉంటావు. అప్పుడు నిన్ను రోజూ భద్రంగా బస్‌స్టాప్‌లో దింపే అన్నయ్యనో, తమ్ముడినో తలుచుకోవాల్సింది. కొత్తవారిని ప్రేమించడం అంటే పాతవారిని ద్వేషించడం, దూరం చేసుకోవడం అని కాదు. ప్రేమ లేదా పెళ్లి అనేది మన కుటుంబాన్ని పెంచుకునేది కానీ తెంచుకునేది కాదు. ఇలాంటి ఓ చిన్ని ఆలోచన అందరు అమ్మాయిలకు వచ్చి ఉంటే ఎంత బాగుండో కదా! అలా ఆలోచిస్తే ఏ అమ్మానాన్నలు విలన్లు కారు, ఏ అమ్మాయీ తల్లిదండ్రుల దుఃఖానికి కారకురాలు అవ్వదు.
ఇవి సరిచూసుకుంటున్నారా
గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం, నిమిషానికోసారి తెగ పొగడటం, జోకులు వేస్తూ చుట్టూ ఉన్న వారిని నవ్వించడం, హ్యాండ్సమ్ లుక్, స్టయిలిష్ వాక్ ఇవన్నీ బాగుంటాయి. కానీ జీవితాన్ని గడపాలి అంటే ఇవి మాత్రమే చాలవు అన్న పరిపక్వత నేటి తరం అమ్మాయిల్లో లోపిస్తున్నది. చాలా సినిమాల్లో బ్యాడ్ బాయ్స్‌ని ఆకర్షణీయంగా చూపిస్తారు. నిజ జీవితంలో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులతో జీవితం పంచుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి సిల్లీ విషయాలకి ఆకర్షితులై తెలిసీ తెలియని వయసులో చేసిన పొరపాట్లకు పశ్చాత్తాప పడే యువతులు ఎందరో. అలా జరగకుండా ఆడపిల్లలు కొన్ని విషయాలను తప్పకుండా గమనంలో పెట్టుకోవాలి.
భావోద్వేగంతో వద్దు
టీనేజీలో ఆకర్షణలు చాలా బలంగా ఉంటాయి. ‘చూడగానే పడిపోయా!’ లాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడూ భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. కోపం లోనో, బాధలోనో, ఒంటరితనంతోనో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరం.
సమయం తీసుకోవాలి
ప్రేమ నిజమైతే కాలం గడిచే కొద్దీ మరింత మధురమే తప్ప, మారదు. కాబట్టి అవతలి వ్యక్తి నచ్చినప్పుడు ఆ ప్రేమ బంధాన్ని కొన్నాళ్లు ముందుకు తీసుకెళ్లి, దాన్ని బలపరుచుకొని అప్పుడే నిర్ణయం తీసుకోవడం మంచిది. పెళ్లి విషయంలో తొందరపాటు అవసరం లేదు.
స్థిరత్వం ముఖ్యం
ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడు ఆర్థిక స్థిరత్వం చాలా అవసరం. అందుకే చదువు, ఉద్యోగం విషయాలను వివాహ బంధంలోకి అడుగు పెట్టేటప్పుడు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక స్వావలంబన లేకుండా తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెడతాయి.
పెద్దల సలహా అవసరం
చదువు, ఉద్యోగంలాగే జీవితంలో ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు కూడా మనకన్నా వయసులో, అనుభవంలో పెద్దవారి సలహా తీసుకోవడం ఎంతో మంచిది. వాళ్లు ఎదుర్కొన్న కష్టసుఖాలను చెబుతూ మనకు దిశా నిర్దేశం చేయగలరు. ఆ సూచనలు సంసారాన్ని సౌకర్యంగా ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో ఉపకరిస్తాయి.
పూర్తిగా అర్థం చేసుకోవాలి
ఒక వ్యక్తిని కొన్ని కోణాల్లోనే చూసి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. అతను కోపంలో ఎలా ప్రవర్తిస్తాడు, డబ్బు విషయంలో ఎలా ఉంటాడు, మహిళలను గౌరవిస్తాడా, కుటుంబ బాధ్యతలు తీసుకోగలడా? ఇలాంటి అంశాలు బాగా తెలుసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే జీవితాన్ని సంతోషంగా సాగించే అవకాశం దొరుకుతుంది.
భవిష్యత్తును అర్థం చేసుకోవాలి
ఈ క్షణం ప్రపంచమంతా మనదే అనిపిస్తుంది ప్రేమ జంటకి. కానీ ప్రేమికులైన కారణంతో ఏ ఇల్లు ఉచితంగా అద్దెకు దొరకదు. ఏ కిరాణా షాప్ వాడు బియ్యం పప్పులు ఊరికే ఇవ్వడు. కాబట్టి మన భవిష్యత్తు ఆలోచనలు ఏమిటో తెలుసుకుని అబ్బాయి భవిష్యత్తు ఆలోచనలు అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం మంచిది.
తల్లిదండ్రులూ అర్థం చేసుకోవాలి
టీనేజీ ఓ కలల ప్రపంచం. తమ కలలన్నీ కళ్లముందే ఉన్నాయి అనిపించే కొత్త బంగారు లోకమది. భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉందని తమకన్నీ తెలుసు అనిపించే వయసు వాళ్లది. అలాంటప్పుడు వాళ్లని చిన్నపిల్లల్లా చూడటం, వాళ్లకేమీ తెలియదని అనుకోవడం పెద్ద వాళ్లు చేసే తప్పు. టీనేజీలో పిల్లలు చూసే ప్రపంచం మారుతుంది. నేడు ప్రపంచమే అర చేతిలోకి వచ్చింది. వినాశకర వార్తలు, విధ్వంసకర సంస్కృతి కళ్ల ముందు కనిపిస్తున్నాయి. పదేపదే అలాంటి వాటిని చూడటం, వినడం ద్వారా పిల్లల మనసులు అవి నిజమేనని, సరైనవని అనుకుంటాయి. దానికి తోడు హార్మోన్ల మార్పులు ఎదుటివారి పట్ల ఆకర్షణలకు కారణమవుతాయి. అలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు తమతో స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణాన్ని కల్పించాలి. ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి ఆలోచన చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆడపిల్ల ఇంటి నుంచి వెళ్లిపోవడం అన్నది కేవలం కుటుంబ పరువుకు సంబంధించిన విషయమే కాదు ఆమె భద్రతకు సంబంధించిన విషయం కూడా!
విశృంఖలత్వం పెరిగిపోతున్న ఈ రోజుల్లో చిన్నారి పాపని కాపాడుకోవడం కూడా ఇప్పుడు ప్రాథమిక విషయమే. అందుకే పిల్లలతో స్నేహంగా ఉంటూ వారి భావాలను తెలుసుకుంటూ మంచి సఖ్యత ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా విషయం చెప్పినప్పుడు కోప్పడకుండా… తప్పొప్పులను సహేతుకంగా ప్రేమతో వివరించాలి. మన పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలి. అప్పుడు భావోద్వేగాలపరంగా వాళ్లు బయట వాళ్లపై ఆధారపడటం తగ్గించుకుంటారు. ఒకవేళ ఎవరినైనా ప్రేమించానని చెబితే, ముందుగా అవతలి వ్యక్తి గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. వాళ్లు అమ్మాయికి ఎంతవరకు సరిపోతారు అనే విషయాన్ని మంచి చెడ్డా రెండూ వివరిస్తూ అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించవచ్చు. వీటన్నిటి ద్వారా టీనేజీ పిల్లలను వలపు వల నుంచి కొంతవరకు తప్పించవచ్చు. కానీ, తల్లిదండ్రులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలు అయినా వారిది వేరే ప్రాణం, వేరే దేహం, వేరే మనసు. తల్లిదండ్రులుగా వాటన్నిటినీ పూర్తిస్థాయిలో నియంత్రించడం ఎప్పుడూ వీలుపడదు. కాబట్టి ఒకవేళ అనుకోనిదే జరిగితే తరువాత మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలి తప్ప పరువు హత్యలకు పాల్పడటం, పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోవడం వల్ల చివరికి మిగిలేది అంతులేని వేదనే!
-లక్ష్మీహరిత ఇంద్రగంటి