గోరింటాకు పూసిన చేతులు, మువ్వలు ముద్దాడిన పాదాలు కళకూ, కవిత్వానికీ చిరునామాలే. అందుకే వాల్ మ్యూరల్ ఆర్ట్‌లోనూ ఇప్పుడు వాటి హవా నడుస్తున్నది. మువ్వ గోపాలుడి చేతులూ, ముదితల అడుగులూ వీటిలో ముగ్ధమనోహరంగా అమరుతున్నాయి. అందమంతా తమలోనే అమరిందంటూ విభిన్న భంగిమల్లో వినూత్నంగా దర్శనమిస్తున్నాయి.
మపూ కడియాల చేతులూ, బ్రహ్మ కడిగిన పాదాలూ… మన భక్తి పాటల్లో కనిపిస్తాయి. కాళ్లను పట్టుకు వదలని కళ్ల సంగతులు సినీ సంగీతం చెబుతుంది. బుద్ధుడి బోధనలనూ చేతులే చేతల్లో చూపమని చెబుతాయి. కరచరణాల కలయికగా సాగే అభినయ ముద్రలకు అర్థాలెన్నో చెబుతుంది నాట్యశాస్త్రం.
అలా మన సంప్రదాయంలో, నిత్యజీవితంలో చేతికీ, పాదానికీ బోలెడు ప్రాధాన్యమే ఉంది. స్వాగత హస్తాలు మన అతిథి మర్యాదకు అద్దంగా నిలుస్తాయి. అందుకే వాల్ మ్యూరల్ ఆర్ట్‌లో భాగంగా వాటిని ఇంటిలో అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇప్పటి జనం.
గోడకు ఏం పెట్టామన్న దానికన్నా, అది ఎంత అందంగా, మరెంత విభిన్నంగా ఉందన్న విషయాన్నే ప్రముఖంగా చూస్తున్నారిప్పుడు. ఈ రెండిటి కలబోతగా ఉంటున్నాయి ఫుట్ అండ్ హ్యాండ్ వాల్ మ్యూరల్స్. టెర్రకోటతో చేసిన వాటిలో అయితే నీలం, గులాబీలాంటి నిండైన వర్ణాల మేళవింపుగా వస్తున్నాయి. మెటల్ శిల్పాల తరహాలో వచ్చేవి బంగారు వన్నెలో మెరిసి పోతున్నాయి. వీటికి రాళ్లూ కుందన్లను కూడా పొదిగి అందంగా రూపొందిస్తున్నారు.
బుద్ధుడి సంజ్ఞలను కూడా ఈ తరహా ముస్తాబుల్లో భాగం చేస్తున్నారు. మనం పూర్వకాలంలోని ఇళ్ల ముందు వాడే స్వాగత హస్తాలూ సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి.
అందమైన దృశ్యమో, అమ్మాయి చిత్రమో గోడ మీద వేలాడాలన్న నియమాన్ని పక్కకు పెట్టి ఇవన్నీ ఇప్పుడు ఇంటి ముస్తాబులో భాగమవుతున్నాయి. కళా హృదయం ఉండాలే గానీ కాదేదీ అలంకరణకు అనర్హం అన్నట్టు లేవూ ఈ చిత్రాలన్నీ!