Inspiration | జీవితంలో ఒడుదొడుకులు సహజమే. పడినా లేస్తామన్న నమ్మకమే చాలామందిని ముందుకు నడిపిస్తుంది. కానీ ఆమె జీవితం అలా కాదు. ఇరవై తొమ్మిదేండ్ల వయసులో పిడుగులా వచ్చిపడ్డ వ్యాధి చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. క్షీణించే కండరాలు, అదుపు తప్పుతున్న నరాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. అప్పుడే, ఓ ఉక్కు సంకల్పం చేశారామె.తనలాంటి వాళ్ల కోసం ‘స్వర్గ’ అనే సంస్థను ప్రారంభించి, ఎంతో మందికి చేయూత అందిస్తున్నారు. దేశ రక్షణలో దివ్యాంగులైనా కుమిలిపోకుండా విజయపథంలో పయనిస్తున్న వీరుల చిత్రాలతో ఈ ఏడాది ఆ సంస్థ వేసిన క్యాలెండర్… ఆమె మనోధైర్యానికి ప్రతీక.ఆ చీకటి వెలుగుల ప్రయాణాన్ని జె. స్వర్ణలత పంచుకున్నారిలా…
క్యాలెండర్… తిరిగే ముల్లుతో పాటు చిరిగే కాగితం. కానీ స్వర్ణలత నేతృత్వంలోని స్వర్గ ఫౌండేషన్ రూపొందించిన ‘అయామ్ స్పెషల్’ క్యాలెండర్ మాత్రం అంతకు మించినది. ఇందులోని ఒక్కో పేజీ మనకు ఓ స్ఫూర్తి పాఠాన్ని బోధిస్తుంది. ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా.. దేశరక్షణలో దివ్యాంగులుగా మారిన తర్వాత కూడా క్రీడాకారులు, కోచ్‌లు, కళాకారులుగా వివిధ రంగాల్లో విజయపథాన దూసుకెళ్తున్న మాజీ సైనికుల స్ఫూరి కథనాలను పొదువుకున్నది ఆ క్యాలెండర్.
ఒక్కపూటలో తారుమారు
పుట్టిననాడే ‘ఆడపిల్లా..’ అనే నొసటివిరుపును చూసిందామె. ఎదిగేకొద్దీ అమ్మప్రేమకూ ఎల్లలుంటాయని తెలుసుకున్నారు. ఎదిగిన తర్వాత కుటుంబ సభ్యుల నుంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మరొకరి పశుప్రవృత్తికి తాను శిక్ష అనుభవించాల్సి వచ్చింది. కక్షగట్టినట్టు చదువు మాన్పించేశారు. అలాంటి అవరోధాలు అనేకం దాటుకుని ఉద్యోగం సంపాదించారు స్వర్ణలత. ఇష్టపడ్డ వ్యక్తిని పెండ్లాడేట ప్పుడూ కుటుంబం నుంచి ఆక్షేపణలు వచ్చాయి. కానీ తనపై అంతులేని ప్రేమను చూపించిన మనిషిని ఆమె వదులుకోలేదు. నిండు మనసుతో జీవితంలోకి ఆహ్వానించారు. పండంటి బిడ్డకు తల్లి అయ్యారు. ముచ్చటైన కుటుంబం …చక్కటి జీవితం అనుకుంటున్న సమయంలో అతిపెద్ద పరీక్ష ఎదురైంది.
అది 2009 సంవత్సరం. రోజూ లాగానే నిద్రలేచిందామె. మధ్యాహ్నం కాస్త జ్వరంగా అనిపించి పడుకున్నారు. సాయంత్రం మంచం మీద నుంచి లేద్దామనుకుంటే శరీరం సహకరించలేదు. మెడ కింది భాగమంతా మొద్దుబారి పోయిందని అర్థమైంది. మెదడు నుంచి వివిధ శరీర భాగాలకు సమాచారం వెళ్లకుండా అవరోధాలు సృష్టించే ‘మల్టిపుల్ స్లెరోసిస్’ వ్యాధి లక్షణం అది. రుగ్మత బారిన పడ్డాక దవాఖాన జీవితం ఎంత దుర్భరమో అర్థమైంది. భర్త గురుప్రసాద్ సాయంతో చాలా వరకూ కోలుకున్నారు. నడక మాత్రం పూర్తి స్థాయిలో రాలేదు.
ఈ పరిస్థితుల్లో అనుకోకుండా గర్భం ధరించారు. తనకు మాతృత్వం ఓ సవాలని తెలిసినా.. కడుపులో ఉన్నది ఆడపిల్ల్లే అని బలంగా నమ్మారు. ఈ భూమ్మీద ఒక్క ఆడపిల్ల అయినా తాను రాకుమారినని అనుకునేంత గొప్పగా పెంచాలని ఆశపడ్డారు. అందుకే, గండాలను అధిగమించి జన్మనిచ్చారు. తన జీవితగానం ఆ పసిబిడ్డే అని అర్థమొచ్చేలా ‘గాన’ అని పేరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తనలాంటి ఎంతోమంది రోగుల్ని చూశారామె. కదలలేని వాళ్లకు చెప్పలేనన్ని సమస్యలు. ఒకరి మీద ఆధారపడాల్సిందే. వారికి సౌకర్యవంతమైన జీవితం అందించే ఉద్దేశంతో కోయంబత్తూరు కేంద్రంగా ‘స్వర్గ ఫౌండేషన్’ స్థాపించారు ఆ తెలుగు వనిత.
మల్టిపుల్ స్లెరోసిస్లాంటి నరాల వ్యాధులతో పాటు రకరకాల అవకరాలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సహాయం అందిస్తుంది ‘స్వర్గ’. అంతేకాదు ‘సౌఖ్య’ పేరిట ఆయుర్వేద క్లినిక్, ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభించి నెలకు వెయ్యి మందికి ఉచిత చికిత్స అందిస్తున్నారు. అవసరమైతే ఆర్థిక సహాయమూ చేస్తున్నారు. తక్కువ ఖరీదులో మంచి వైద్యం ఎక్కడ అందుతుంది, మంచి చక్రాల కుర్చీలను ఎలా ఎంపిక చేసుకోవాలి.. తదితర అంశాలపై సలహాలనూ ఇస్తున్నారు.
‘స్వర్గ’ గత పదేండ్లలో ఎంతో మందికి సహాయం అందించింది. వీల్‌చైర్ రోగులు ప్రయాణాలు చేయడం కష్టం. అలాంటి వారికోసం ‘సారథి’ పేరిట చక్రాల కుర్చీ నేరుగా లోపలికి వెళ్లగలిగేలా ఓ వాహనాన్ని రూపొందించారు స్వర్ణ లత. అందులోనే సౌకర్యవంతమైన టాయిలెట్ డిజైన్ చేశారు. రైల్వేస్టేషన్ల లాంటి జనసమ్మర్ధ ప్రాంతాల్లోనూ వీళ్లు సులభంగా వెళ్లగలిగేలా ర్యాంపులు నిర్మించారు. వివిధ వేదికల మీద స్ఫూర్తి దాయక ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమీకరించిన నిధులతో ఈ సంస్థలను నడుపుతున్నారామె. తన సేవలకు అనేక ప్రశంసలు, పురస్కారాలతో పాటు రాష్ట్రపతి అవార్డునూ అందుకున్నారు స్వర్ణలత.
వందశాతం విజేత
చక్రాల కుర్చీకి పరిమితం అయ్యాక తన ఆలోచనలు, అనుభవాలను పంచుకుంటూ కొన్ని వందల స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు చేశారు స్వర్ణలత. ఒక్క టెడెక్స్ వేదిక మీదే అయిదుసార్లు మాట్లాడారు. అందుకే, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆమె పేరు పదిలమైంది. తన అనుభవాలను చిన్న కథలుగా రాశారు కూడా. స్వర్ణ పది భాషల దాకా మాట్లాడగలరు. గోవాలో జరిగిన అందాల పోటీలో సాధారణ మహిళలతో పోటీ పడి విజేతగా నిలిచారు.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి