Honey For Face | తేనెను మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని పలు రకాల పానీయాల్లో కలిపి సేవిస్తుంటారు. కొందరు తేనెను నేరుగా తింటుంటారు కూడా. ఆయుర్వేద ప్రకారం తేనె అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తేనెను రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. పలు వ్యాధులకు తేనె ఔషధంగా పనిచేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల తేనె మనకు అనేక లాభాలను అందిస్తుంది. అయితే తేనె వల్ల వ్యాధులు నయం అవడమే కాదు, చర్మ సౌందర్యం కూడా మెరుగు పడుతుంది. చర్మానికి సంబంధించి మనకు కలిగే అనేక రకాల సమస్యలను, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో తేనె పనిచేస్తుంది. ఇందుకు గాను పలు పదార్థాలతో కలిపి తేనెను పలు ఇంటి చిట్కాల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఒక టీస్పూన్ తేనెను తీసుకుని ముఖానికి రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ, ఒక టీస్పూన్ తేనె, ఒక గుడ్డు పచ్చ సొన కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి. వారంలో 2-3 సార్లు ఇలా చేస్తుండాలి. దీని వల్ల కూడా ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను పాటిస్తుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అదేవిధంగా కొద్దిగా తేనె, ఆలివ్ నూనెలను తీసుకుని కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి కొంత సేపటి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు తగ్గి ముఖం ప్రకాశిస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు పొడి, అంతే మోతాదులో తేనెలను కలిపి మిశ్రమంగా చేసి ముఖంపై రాయాలి. తరువాత కొంత సేపు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుండడం వల్ల ముఖంపై ఉండే మృతకణాలు పోతాయి. చర్మానికి తేమ లభిస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. చర్మం తేమగా మారి కాంతివంతంగా ఉంటుంది. అదేవిధంగా ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, నిమ్మరసంలను కలిపి ముఖంపై రాయాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా, తేమగా మారుతుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ తేనె, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ పెరుగును తీసుకుని కలిపి ముఖానికి రాయాలి. 15 నిమిషాల పాటు ఉంచాక కడిగేయాలి. ఈ చిట్కాను తరచూ పాటిస్తుంటే ముఖంపై ఉండే ఎరుపుదనం పోతుంది. ఎండ వల్ల కందిపోయిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. మొటిమలు తగ్గిపోతాయి.
తేనె, ఓట్స్‌ను ఉపయోగించి కూడా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇందుకు గాను ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని అందులో అంతే మోతాదులో ఓట్స్ పొడి, 1 టీస్పూన్ నీళ్లు లేదా పాలను వేసి కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని ముఖానికి రాసి 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఈ చిట్కా వల్ల ముఖంపై ఉండే మృత చర్మ కణాలు తొలగిపోతాయి. అతిగా ఉండే నూనె తొలగిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ చిట్కా మేలు చేస్తుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది. అదేవిధంగా ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం తీసుకుని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఈ చిట్కా వల్ల ముఖానికి తేమ లభిస్తుంది. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా తేనెతో పలు చిట్కాలను పాటించడం వల్ల ముఖ సౌందర్యాన్ని సులభంగా పెంచుకోవచ్చు.