మధ్యలో ఓ నాలుగు రోజులు వానలు దంచికొట్టాయి. వాతావరణం కొంత చల్లగా అనిపించింది. మళ్లీ ఎండలు ముదురుతున్నాయి. వేసవి తీవ్రత తెలిసివస్తున్నది. బయట వాతావరణం ఎలా ఉన్నా.. ఇంటికొచ్చాక అయినా చల్లగా అనిపించకపోతే.. నరకమే. చల్లదనం అనేది కొంతవరకు మనసుకు సంబంధించిన వ్యవహారం కూడా.
ఎరుపు, నీలం, గోధుమ.. తదితర ముదురు వన్నెలు మనమనసును బెదరగొడతాయి. గోడలకు లేత వర్ణాలనే ఎంచుకోవాలి. ఆ చల్లని రంగుల మధ్య సముద్రతీరంలో ఉన్న అనుభూతి పొందుతాం.
మినీ ఫౌంటెన్‌ను గది అలంకరణలో భాగం చేసుకోండి. ఆ జల్లుల చల్లదనాన్ని ఆస్వాదిస్తూ కాసేపు ఎండవేడిని మరిచిపోండి.
కొన్ని అత్తర్లు చల్లని అనుభూతిని ఇస్తాయి. ఇంకొన్ని ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉదాహరణకు పెప్పర్మింట్ ఆయిల్‌కు చల్లదనపు గుబాళింపులు పంచే గుణం ఉంది.
సాధ్యమైనంత వరకు కాటన్, లినెన్ వస్ర్తాలనే ధరించాలి. వాటికి శ్వాసించే గుణం ఉంటుంది. కాబట్టే, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేయవు. కర్టెన్లు, బెడ్‌షీట్స్, దుప్పట్ల్లు.. దేనికైనా జై కాటన్ అనాల్సిందే. సింథటిక్ మెటీరియల్ వాతావరణంలో వేడిని సృష్టిస్తుంది.
మన ఇంట్లో ఎయిర్ కండిషనర్ ఏ వైపున పెట్టామన్నదీ ముఖ్యమే. ఏసీని పడమర, ఉత్తర భాగాల్లో బిగించాలి. అప్పుడే గాలి సమంగా విస్తరిస్తుంది.
గృహాలంకరణలో మొక్కలను కూడా భాగం చేయండి. తూర్పు, ఉత్తరం, ఈశాన్యం.. కుండీలు ఉంచేందుకు అనువైన ప్రదేశాలు.