మేఘసందేశం వినిపించగానే పెండ్లి బాజాలు సందడి చేస్తాయి. కొంగుముడులు పడే కాలం మొదలయ్యిందని ఊరూవాడాచాటింపు వేస్తాయి. శ్రావణ మాసంలో ముహూర్తాలన్నమాటతో మెడలో మెరిసిన పూబంతులను తలపించేలా విచ్చుకుంటాయాకాబోయే దంపతుల ముఖాలు. ఇక, వరమాల పడే సమయానికి ఆ దండల్లాగే మనసులు రెండూ మార్పడిపోతాయి. అందుకే ఆ ఘట్టం జంటలకు ప్రత్యేకం.పెండ్లి వేడుకలోని ప్రతి సందర్భాన్నీ కెమెరాల్లోబంధించినట్టే, దానికి సంబంధించిన గుర్తులనూ జ్ఞాపికలుగా మార్చుకుంటున్నారిప్పుడు.వరమాల ఫ్రేమ్స్… ఇటీవల పెండ్లికి జతైన కొత్త కానుక.
పెళ్లంటే తాళాలూ తప్పెట్లూ తలంబ్రాలు… మరెన్నో. బయటికి కనిపించే వీటికి తోడు మనసులో ఇంకెన్నో భావాలు. అన్నింటినీ గుదిగుచ్చి దాచుకోవడం మనసు వంతైతే, దానికి సంబంధించిన జ్ఞాపకాలను భద్రపరచుకోవడం మనిషి వంతు. అందుకే పెండ్లి పత్రికను ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు చాలామంది. అయితే అప్పుడు కట్టిన బాసికాలు, మార్చుకున్న దండలు, చేతి కంకణాలు, పెండ్లి గాజులు… ఇవన్నీ కూడా మధురమైన స్పృతులకు ప్రతీకలుగానే ఉంటాయి. వేడుక పూర్తయ్యాక నాలుగు రోజులు వాటిని ఇంట్లో ఉంచుకున్నా ఆ తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితి. కొద్దికాలానికి పచ్చని చెట్టు మీద చేరి ప్రకృతిలో కలిసిపోతాయివి. కానీ వాటిని కూడా పదిలంగా దాచుకుని ఫ్రేమ్ కట్టించుకుంటున్నాయి కొన్ని కొత్త జంటలు. రెజిన్ ఫ్రేమ్‌లలో వస్తున్న ఇవి కానుకల్ని అనుభూతులకు జోడిస్తున్నాయి.
నచ్చినవన్నీ…
వరమాల ఫ్రేమ్స్ పేరిట రూపొందుతున్న వీటిని రెజిన్ అనే పారదర్శక పదార్థం సహాయంతో తయారు చేస్తున్నారు. వీటిలో పెండ్లి జ్ఞాపకంగా మనం ఏమేం కావాలి అనుకుంటామో అవన్నీ ఉంచి దాని మీద రెజిన్ ద్రవాన్ని పోసి, గడ్డ కట్టేలా చేస్తారన్నమాట. అప్పుడు అవి ఉన్నవి ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి, వాతావరణ ప్రభావానికి లోనై పాడైపోవు. ఉదాహరణకు పెండ్లి పూల దండ తీసుకుంటే, అందులో ఉండే పువ్వులు, పూసలు, తళుకులు… ఇలా కొన్నింటిని తీసుకుని ఫ్రేమ్‌లో అందంగా అమర్చుకుంటున్నారు. ఫొటోలు, పెండ్లి డేట్లు, బాసికాలు, పసుపు తాడు, గాజులు, కంకణాలు… ఇలా ఎవరికి నచ్చినవి వారు పెట్టించుకుంటున్నారు. ఇక, వీటిని కస్టమైజ్డ్గా అందించేందుకు బోలెడు ఆన్లైన్ వెబ్‌సైట్లున్నాయి. మరి మీరైతే ఇందులో ఏం పదిలపరచుకుంటారు?! ఆలోచించి చెప్పండి!
Flr Fram