రోజురోజుకూ పెరుగుతున్న ధరలు ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దీంతో జనం ఖర్చులు తగ్గించుకునే ఆలోచనలో ఉన్నారు. తాజాగా జరిగిన ఓ సర్వేలో ఈ విషయమే వెల్లడైంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో కొద్దిశాతం మంది మాత్రమే ఈ దసరా, దీపావళి సీజన్లో గతేడాదితో పోలిస్తే షాపింగ్ బడ్జెట్ పెంచే అవకాశం ఉందని ‘యుగవ్ ఇండియా’ సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 31 శాతం మంది మాత్రమే 2022తో పోలిస్తే ఈ సీజన్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. అయితే, పోయిన సంవత్సరం ఈ సంఖ్య 36 శాతం. ఇక రెండు వంతుల మంది మాత్రం.. గత ఏడాదితో పోలిస్తే తమ ఇంటి ఖర్చులు బాగా పెరిగినట్టు వాపోయారు. కాగా, ఈ సర్వే కోసం ఆన్లైన్ ద్వారా 2,000 మంది నుంచి వివరాలను సేకరించారు.