ప్రస్తుతం ఇల్లు, ఇంట్లోని వస్తువులు.. ప్రతీది కంటికి నచ్చేట్లుగా తీర్చిదిద్దుకునేందుకు ఇష్టపడుతున్నారు ఆధునికులు.అందుబాటులో ఉన్నవాటిలో కంటికి నచ్చినవి ఎంచుకోవడం కంటే, మనసుకు నచ్చినట్టు వస్తువులను తయారు చేయించుకోవడానికే ఇష్టపడు తున్నారు. అలా పుట్టుకొచ్చిందే కస్టమైజ్డ్ ఇంటీరియర్. మరి ఇంట్లో వస్తువులకే అంత ప్రాధాన్యం ఉంటే ఒంటిమీద ధరించే నగలకు ఇంకెంత ఉండాలి! సందర్భానికి తగినట్లు, మనసుకు నచ్చినట్లు, ఇష్టమైన డిజైన్లలో రూపొందించేవే కస్టమైజ్డ్ జువెలరీ. సంప్రదాయ దుస్తులపైనే కాదు, ట్రెండీవేర్పైనా అలంకరించుకునేందుకు వీలుగా ఆభరణాలను చేయించుకుంటున్నారు. నేటి తరం మగువల మనసు దోచేస్తున్న ఈ కస్టమైజ్డ్ జువెలరీ విశేషాలేంటో చూసేద్దాం..
మనకు నచ్చిన డిజైన్స్, నచ్చిన ధరలో తయారు చేసి ఇచ్చేదే కస్టమైస్డ్ జువెలరీ. ఆధునిక మహిళలను ఆకర్షించేందుకు వారికి నచ్చినట్టుగా అందమైన నగలను రూపొందిస్తున్నారు తయారీదారులు. కొనుగోలుదారుల కోరిక మేరకు సంప్రదాయ వేడుకల్లో ధరించే దుస్తులకు తగినట్లు వీటిని తీర్చిదిద్దుతున్నారు. బంగారం, ప్లాటినమ్ లాంటి ఖరీదైన లోహాలతోనే కాకుండా వెండితోపాటు రోజ్ గోల్డ్, వన్‌గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జువెలరీలోనూ ఈ కస్టమైజ్డ్ నగలు నిగనిగలాడుతున్నాయి. ఒక అడుగు ముందుకేసి వ్యక్తుల పేర్లు, అక్షరాలు చెక్కిన ఉంగరాలు, లాకెట్లు, పెండెంట్లు, బ్రేస్లెట్లు, గొలుసులు.. తయారు చేయించుకుంటున్నారు.
అతివలు. ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల గుర్తులను కూడా ఈ నగల్లో పొదిగి అందమైన జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. ఇష్టమైన వ్యక్తుల ప్రతిరూపాలు, ఫొటోలతో ఆభరణాలు తయారు చేయించుకుంటున్నారు. రకరకాల థీమ్స్‌తో ఈ జువెలరీ అందుబాటులో ఉంది. నచ్చినవాళ్లు రెడీగా ఉన్నవాటిని కొనుక్కోవచ్చు. ఉన్నవి నచ్చకపోతే కోరుకున్న డిజైన్‌లో చేయించుకోవడమే!