ఆడపిల్లల్ని అమితంగా ఇబ్బంది పెట్టే సమస్య అవాంఛిత రోమాలు. కాళ్లు చేతులతో పాటు ముఖం, గుండెల మీదా కూడా కొందరికి ఇవి వస్తుంటాయి. జీన్, హార్మోన్ల అసమతుల్యత.. పెరగడానికి కారణం ఏదైనా కానివ్వండి వాటిని తొలగించడం మాత్రం కాస్త కష్టంతో కూడుకున్నదే.
హాట్ వ్యాక్స్‌తో లాగేస్తే నొప్పికి గిలగిల్లాడాల్సి వస్తే, చల్లగా ఉండే క్రీములతో తొలగిస్తే చర్మం నల్లబడుతుంటుంది. కానీ, ఈ సమస్యకు సులువైన పరిష్కారం అంటూ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి మార్కెట్లోకి కొత్తగా వస్తున్న‘మ్యాజిక్ క్రిస్టల్ హెయిర్ ఎరేజర్’లు. అద్దంలా కనిపించే దీనితో మనం ఎక్కడైతే వెంట్రుకలు తొలగించాలనుకుంటున్నామో అక్కడ గుండ్రంగా రుద్దితే చాలు. ఆ ప్రాంతంలోని జుట్టు అంతా నొప్పి లేకుండానే పోతుంది.
అంటే ఎరేజర్‌తో తుడిపేస్తే అక్షరాలు ఎలా పోతాయో అలా అన్నమాట. ‘మైక్రో ఎక్స్ఫోలియేషన్’ అనే ప్రక్రియ ద్వారా ఇది పనిచేస్తుందని తయారీ సంస్థలు చెబుతున్నాయి. హెయిర్ ఎరేజర్లో సూక్ష్మమైన గాజు ముక్కలు ఉంటాయి. దాన్ని చర్మం మీద రుద్దినప్పుడు వెంట్రుకలు మొదళ్ల నుంచి తెగిపోతాయి. అందుకే నొప్పి కలగదట.
నిజానికి దీనికి సంబంధించిన వీడియోలు చూస్తే విచిత్రంగానే అనిపించేలా ఉన్నాయి. వాడిన వాళ్లలో కొందరు ‘అబ్బో, భలే ఉందే..’ అంటే, కొందరు మాత్రం ‘ఎబ్బే, ఏమీ బాగోలేదు..’ అంటున్నారట. మొత్తానికి ఈ మధ్య బ్యూటీ గ్యాడ్జెట్లలో ఇది తెగ ట్రెండ్ అవుతున్నది.