కొందరు ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేస్తారు. మేనేజర్లు, ఇన్చార్జీలు కూడా.. వారి పనితీరుపై సంతృప్తి, నమ్మకంతో ఉంటారు. కానీ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల విషయానికి వచ్చేసరికి.. పనిచేసే వారికే మొండిచేయి చూపుతారు. నిజానికి, కార్పొరేట్ రంగంలో కష్టపడి పని చేయడం, సంస్థ పట్ల విధేయత చూపడం మాత్రమే సరిపోదని నిపుణులు అంటున్నారు. కెరీర్లో ముందుకు సాగాలంటే.. ఈ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, వ్యూహాత్మక అడుగులు వేయాలని సలహా ఇస్తున్నారు.
మీ కంపెనీ.. మీ ఇల్లు కాదు.
మీ తోటి ఉద్యోగులు.. మీ కుటుంబం కాదు. అందుకే.. మాతృసంస్థ అనో, ఏదైనా సెంటిమెంట్‌తోనో ఏండ్ల తరబడి ఒకే సంస్థలో పనిచేయడం మంచిదికాదు. సంస్థ పట్ల మీరు చూపించే విధేయతకు కూడా పెద్దగా విలువ ఉండదు. ఒక అంచనా ప్రకారం.. తరచుగా సంస్థలు మారే ఉద్యోగులు 30-50 శాతం వరకు అధిక జీతం అందు కుంటారు. అదే.. ఏండ్ల తరబడి ఒకే సంస్థలో విధేయంగా ఉండే వారికి కేవలం 3 శాతం పెంపు మాత్రమే దక్కుతుందట.
ఆఫీస్‌లో మీ మేనేజర్, మీ హెచ్వోడీలు.. ఎప్పటికీ మీకు మెంటార్ కాలేరు. తమ గురించి ఆలోచించినంతగా.. వారు మీ గురించి ఆలోచించలేరు. మీ కెరీర్‌కు మద్దతుదారుగా నిలవలేరు. అందుకే.. మీ ఎదుగుదల కోసం మీరే పోరాడాలి.
కష్టపడి పనిచేస్తే జీతం పెరుగుతుందనీ, ప్రమోషన్ దక్కుతుందనీ చాలామంది అనుకుంటారు. కానీ, కార్పొరేట్ ప్రపంచంలో అది ఏమాత్రం నిజం కాదు. ఉద్యోగి చేసే కష్టం సరైన వ్యక్తుల దృష్టికి వెళ్లకపోతే.. ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. పనితనం కాదు.. కేవలం గుర్తింపు మాత్రమే ప్రమోషన్ తెచ్చిపెడుతుంది. కాబట్టి, కెరీర్లో పైకి ఎదగాలనుకుంటే.. కేవలం పనిలో నైపుణ్యం ఉంటే సరిపోదు. ఆ కష్టాన్ని నిర్ణేతలకు తెలిసేలా చేయాలి.
ప్రతి ఉద్యోగానికీ ప్రత్యామ్నాయం ఉంటుంది. కంపెనీలు కూడా అదే దృష్టితో ప్రణాళికలు వేస్తాయి. కానీ, భర్తీ చేయలేనిది ఒక్కటే.. అదే మీకున్న మంచిపేరు. అందుకే, ఎంతపెద్ద సంస్థలో పనిచేస్తున్నా.. మీకంటూ సొంత ‘పర్సనల్ బ్రాండ్’ను నిర్మించుకోవాలి. మీ ఉద్యోగ హోదాకు అతీతంగా ఉండే గుర్తింపును సంపాదించుకోవాలి. ఎందుకంటే.. కంపెనీ మిమ్మల్ని తొలగిస్తే.. మీ దగ్గర మిగిలేది అది ఒక్కటే! మీరు నిర్మించుకునే ఆ గుర్తింపే.. మీకు మరో గొప్ప అవకాశాన్ని తెచ్చిపెడుతుంది.
పేరున్న పెద్దపెద్ద కంపెనీలు మొదలుకొని చిన్నచిన్న అంకుర సంస్థల వరకూ.. ఆఫీస్ పాలిటిక్స్ ఉండి తీరుతాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు, పెద్ద ప్రాజెక్టులు అప్పగించడం లాంటి అనేక విషయాల్లో ఈ పాలిటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే, ఆఫీస్ పాలిటిక్స్‌కు దూరంగా ఉండటం అంటే.. మీ భవిష్యత్ నిర్ణయాలు వేరేవాళ్లు తీసుకునేలా మీరే ప్రోత్సహిస్తున్నట్లు. కాబట్టి, ఆఫీస్‌లో మరీ అమాయకంగా ఉండకండి.