Clay Cups Business Idea | ప్రస్తుత తరుణంలో ఉద్యోగం లభించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. అందుకనే చాలా మంది స్వయం ఉపాధి మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే స్వయం ఉపాధి విషయానికి వస్తే అందుకు భారీ ఎత్తున పెట్టుబడి అవసరం అవుతుంది. కానీ చాలా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిల్లో మట్టి కప్పుల బిజినెస్ కూడా ఒకటి. మట్టి కప్పులను మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. టీ తయారీ దారులు, రెస్టారెంట్లు, హోటల్స్ తదితర ప్రాంతాల్లో మట్టి కప్పుల్లో టీని అందిస్తుంటారు. అలాగే లస్సీని కూడా ఇలాంటి కప్పుల్లో అందిస్తుంటారు. అయితే ఇలాంటి మట్టి కప్పులను తయారు చేసి విక్రయిస్తే నెల నెలా చక్కని ఆదాయం పొందవచ్చు.
మట్టి కప్పుల తయారీని ప్రారంభించాలంటే కేవలం రూ.5వేల పెట్టుబడి సరిపోతుంది. మీ ఇంట్లోనే కాస్త ఖాళీ ప్రదేశం ఉంటే చాలు, అందులోనే వీటిని తయారు చేయడం ప్రారంభించవచ్చు. మట్టికప్పులకు ప్రస్తుతం డిమాండ్ బాగానే ఉంది. టీ తయారీదారులు, హోటల్స్‌తో ఒప్పందం చేసుకుంటే మీరు తయారు చేసే మట్టి కప్పులను నేరుగా వారికే విక్రయించవచ్చు. దీంతో మీకు మార్కెటింగ్ చేసుకునే అవసరం ఉండదు. నెల నెలా వారికి కావల్సిన సంఖ్యలో మట్టి కప్పులను తయారు చేసి సరఫరా చేయవచ్చు. దీంతో నెల నెలా చక్కని ఆదాయం వస్తుంది.
చిన్న సైజులో ఉండే మట్టి కప్పులకు రూ.30 నుంచి రూ.60 వరకు వసూలు చేయవచ్చు. అదే లస్సీ కోసం మట్టి కప్పులను కాస్త పెద్ద సైజులో తయారు చేస్తే రూ.60 నుంచి రూ.100 వరకు వసూలు చేయవచ్చు. ఈ క్రమంలోనే రోజుకు కనీసం రూ.2వేల వరకు బిజినెస్ జరిగేలా చూసుకోవాలి. దీంతో నెలకు రూ.60వేల ఆదాయం వస్తుంది.
అయితే మార్కెటింగ్ చేసుకుని ఇంకాస్త పెద్ద ఎత్తున కప్పులను తయారు చేయగలిగితే నెలకు రూ.1 లక్ష వరకు కూడా సంపాదించవచ్చు. ప్రస్తుతం పర్యావరణంపై అవగాహన పెరిగి ప్లాస్టిక్‌ను వాడడం లేదు. అందుకు బదులుగా మట్టి కప్పులను చాలా చోట్ల టీకి, లస్సీకి ఉపయోగిస్తున్నారు. అందువల్ల మట్టి కప్పులను తయారు చేసి విక్రయించగలిగితే నెల నెలా మంచి ఆదాయం పొందవచ్చు. దీనికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. కప్పులను తయారు చేసేందుకు అవసరం అయ్యే సామగ్రితోపాటు అందుకు వాడే మట్టి ఉంటే చాలు. సులభంగా మట్టి కప్పులను తయారు చేయవచ్చు. చక్కని లాభాలను గడించవచ్చు.
మట్టి కప్పుల తయారీకి పెద్దగా అనుభవం కూడా అవసరం లేదు. యూట్యూబ్‌లో అనేక రకాల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన సామగ్రిని ఎలా తెచ్చుకోవాలో కూడా చూపిస్తారు. వాటి సహాయంతో ఈ బిజినెస్‌ను సులభంగా ప్రారంభించవచ్చు. ఉద్యోగం లేని వారు, స్వయం ఉపాధి మార్గాల వైపు చూస్తున్నవారు మట్టి కప్పులను తయారు చేసి విక్రయించవచ్చు. దీంతో డబ్బు సంపాదించవచ్చు.