మీరు దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అది మీ దినచర్యకు అంతరాయం కలిగిస్తోందా? వెన్నునొప్పి కారణంగా కూర్చోవడం లేదా నిలబడడం కష్టంగా ఉందా? అయితే, మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ రోజుల్లో పని ఒత్తిడి, ఎక్కువ పనివేళల కారణంగా వెన్నునొప్పి అనేది సాధారణమైపోయింది. వెన్నునొప్పితో చాలామంది సతమతమవుతున్నారు. మరి ఈ వెన్నునొప్పి ఎందుకు వస్తుంది..? దీనికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్నునొప్పి అనేది వయస్సు కారణంగా వస్తుంది. వెన్నెముక ఆర్థరైటిస్ అంటే వెన్నెముక లోపల మృదులాస్థి క్రమంగా సన్నబడడం. వెన్నెముక స్టెనోసిస్ కారణంగా వెన్నుపాము కాలువ కుంచించుకుపోయి కూడా ఈ నొప్పి వస్తుంది. డిస్క్ సమస్యలు కూడా వెన్నునొప్పికి కారణమవుతాయి. భరించలేని కండరాల నొప్పి, సయాటికా, గాయాలు, పడిపోవడం, పగుళ్లకారణంగా చాలా మంది విపరీతమైన వెన్నునొప్పిని ఎదుర్కొంటారు. అలాగే, అధిక బరువులను ఎత్తడం, ఇబ్బందికరంగా లేదా ఎక్కువసేపు వంగడం, శరీరాన్ని అతిగా సాగదీయడం, పేలవమైన శరీర భంగిమ, సుదీర్ఘంగా డ్రైవింగ్ చేయడం, ఎక్కువసేపు నిల్చుండడం లేదా కూర్చోవడం, ఇబ్బందికరమైన కదలికలు కూడా వెన్నునొప్పికి దారితీయవచ్చు.