ఉపాధ్యాయ వృత్తి, నృత్య శిక్షణ, సినిమాలకు కొరియోగ్రఫీ.. శ్రీలక్ష్మీ ప్రవీణ జీవితమే ఓ నాట్యశాస్త్రం. తాజాగా ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కొరియోగ్రఫీ అందించారామె. అంతేకాదు, సీనియర్ నటి జయప్రద సినిమాకు నృత్య దర్శకత్వం వహిస్తున్నారు కూడా.
నల్లాన్తిగళ్ శ్రీలక్ష్మీ ప్రవీణ.. శేరిలింగంపల్లిలోని హైదర్‌నగర్‌లో ఉంటారు. ఉన్నత విద్య అభ్యసించారు. శాస్త్రీయ నృత్యంలో ప్రత్యేక కోర్సు చేశారు. పదిహేనేండ్లుగా స్థానిక రిషి మహిళా కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఎంబీఏ విద్యార్థినులకు బిజినెస్ మేనేజ్మెంట్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రవీణకు బాల్యం నుంచీ నాట్యంపై మక్కువ. నాలుగో ఏటే సాధన ప్రారంభించారు. ప్రముఖ నాట్యాచార్యుల వద్ద శిక్షణ పొందారు. కఠోర సాధనతో ఆ కళపై పట్టు సాధించారు. ‘కలర్స్ ఆఫ్ డ్యాన్స్’ అనే నృత్య శిక్షణ సంస్థనూ నిర్వహిస్తున్నారు. పలు సామాజిక సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలిస్తున్నారు. తను మంచి కొరియోగ్రాఫర్ కూడా. ‘హరి హర వీరమల్లు’ చిత్రంలోనూ ఓ నృత్య సన్నివేశానికి కొరియో గ్రాఫర్‌గా వ్యవహరించారు. హీరో పవన్ కల్యాణ్, కథానాయిక నిధి అగర్వాల్.. జంటకు నృత్య భంగిమలు సమకూర్చారు. నటి జయప్రద నిర్మిస్తున్న ఓ చిత్రానికి కూడా ప్రవీణ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
“షూటింగ్ రోజు జయప్రదగారిని చూడగానే.. పాదాభివందనం చేయాలనిపించింది. కానీ ఆమె వారించారు. కొరియోగ్రాఫర్‌గా మీరు నా గురుస్థానంలో ఉన్నారు. నేనే మీకు నమస్కరించాలి’ అంటూ ఆప్యాయత కురిపించారు” అంటూ ఓ అనుభవాన్ని పంచుకున్నారు ప్రవీణ. “హరిహర వీరమల్లు సమయంలో పవన్ కల్యాణ్‌గారిలో ఓ జిజ్ఞాసిని చూశాను. నాట్యశాస్త్రం గురించి తరచూ నాతో చర్చించేవారు. ఓ సందర్భంలో.. నాట్యకళను ఎంచుకుంటున్న పురుషుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు” అంటూ షూటింగ్ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. గతంలోనూ వివిధ చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు ప్రవీణ. మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, ఆచితూచి చిత్రాలను ఎంచుకుంటున్నానని చెప్పారు. కుటుంబ సభ్యుల తోడ్పాటు, రిషి కళాశాల యాజమాన్యం సహకారమే తన విజయానికి కారణమని వివరించారు.
-కాటేపల్లి శశిధర్