ఇప్పటివరకు గూగుల్ క్రోమ్, ఇతర బ్రౌజర్లను వాడుతున్నాం కదా? ఏమైనా కావాలంటే, కీ వర్డ్స్ టైప్ చేస్తాం. బ్రౌజర్ పది లింక్‌లు ఇస్తుంది. వాటిని చదివి, మనకు కావాల్సిన సమాచారాన్ని వెతుక్కోవాలి. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. ఎందుకంటే.. OpenAI సంస్థ తీసుకొచ్చిన ChatGPT Atlas మనం అడిగినదానికి లింక్‌లు ఇవ్వదు. సరాసరి సమాధానమే ఇస్తుంది. అంతెందుకు, మనకు సాయం చేయడానికి ఓ కోచ్ మాదిరిగా పక్కనే కూర్చుని పనిచేస్తుంది. అందుకే దీన్ని టెక్ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పుగా పరిగణిస్తున్నారు. చూడటానికి ఇది సాధారణ సెర్చ్ బ్రౌజర్ లాగే పనిచేస్తుంది.. ట్యాబ్‌లు, హిస్టరీ ఉంటాయి. కానీ, దీని పక్కనే ChatGPT అసిస్టెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఏదడిగినా అక్కడికక్కడే జవాబిస్తుంది. ఈ కొత్త అసిస్టెంట్ రోజు వారి బ్రౌజింగ్ అవసరాల్ని క్షణాల్లో తీర్చేస్తుంది. ఇప్పుడీ ఏఐ బ్రౌజర్ మోసుకొచ్చే ఫీచర్లు ఏంటో చూద్దాం.
చదువు సులభం: పాఠాలు మనకు అర్థమయ్యేలా చెప్తుంది. కాలేజీ స్టూడెంట్స్ ఈ బ్రౌజర్‌తో ఇట్టే వారి సందేహాల్ని తీర్చుకోవచ్చు. క్లాస్ నోట్స్, ైస్లెడ్స్ని అప్లోడ్ చేస్తే.. బ్రౌజర్ దానిని పూర్తిగా చదువుతుంది. మనకు అర్థం కాని అంశాలను ఇన్‌స్టంట్‌గా, సులభమైన మాటల్లో వివరిస్తుంది. అడిగే కంటెంట్‌పై ఫాలో-అప్ ప్రశ్నల్ని కూడా విద్యార్థుల్ని అడుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులకు అర్థం కాని పాఠాన్ని టీచర్లా పక్కనే ఉండి చెబుతుందన్నమాట.
ఉద్యోగ ప్రయత్నాలు: ఇంటర్వ్యూకి మనల్ని సిద్ధం చేస్తుంది. ఎంతలా అంటే.. మనం వెతికిన సమాచారం ఆధారంగా, ఇంటర్వ్యూకి ఏం చదవాలి? ఏం చెప్పాలి అనే విషయాలను ఒక పర్సనల్ కోచ్‌లా తయారు చేసి ఇస్తుంది. ఉదాహరణకు ‘నేను పోయిన వారం చూసిన జాబ్ పోస్టింగ్‌లన్నీ వెతికి.. ఇండస్ట్రీ ట్రెండ్స్ గురించి ఇన్పుట్స్ తయారు చేసివ్వు.. నేను ఇంటర్వ్యూలకు సిద్ధం కావాలి’ అని ప్రాంప్ట్ ఇస్తే చాలు. క్షణాల్లో బ్రౌజర్లో అన్నీ మన ముందుంటాయి.
ఆటోమేటిక్‌గా పనులు: ఒక రెస్టరెంట్ లేదా ఈవెంట్ బుకింగ్ చేయాలనుకుంటే, బ్రౌజర్‌కు చెబితే చాలు. అది మన తరఫున ఆన్లైన్లో వెతికి, ఫామ్స్ నింపేసి, బుకింగ్‌లను పూర్తి చేస్తుంది. మళ్లీ మళ్లీ వెబ్ పేజీలు, పలు ట్యాబ్‌ల్లోకి మారాల్సిన అవసరం ఉండదు.
షాపింగ్‌లోనూ సలహాలు: ఎప్పుడు, ఏది కొనాలో చెబుతుంది. కొత్త ఫోన్, టీవీ, ఇంకేదైనా కొనేటప్పుడు బ్రౌజర్‌కు చెప్తే చాలు. క్షణాల్లో పది షాపుల్లోని రేట్లు, ఫీచర్లు, కస్టమర్ రివ్యూలను వెంటనే పోల్చి చూపిస్తుంది. ‘ఇది మీ బడ్జెట్లో బెస్ట్’ అని సలహా ఇస్తుంది. అంతేకాదు, ఏ రోజు రేటు తక్కువగా ఉంటుందో ట్రాక్ చేసి కూడా చూపుతుంది.
టైపింగ్ సాయం: ప్రొఫెషనల్ మెయిల్స్‌కి స్పందించాల్సి వస్తే.. మీ తరుఫున ఇ-మెయిల్స్ అప్పటికప్పుడే రాస్తుంది. ఏదైనా ఇ-మెయిల్ లేదా ఆఫీస్ డాక్యుమెంట్ రాయాల్సి వస్తే.. వేరే యాప్‌కి వెళ్లాల్సిన పనిలేదు. బ్రౌజర్లో సెర్చ్ చేస్తూనే, పక్కనే ఉన్న ChatGPTకి చెబితే, అది వెంటనే రాసిస్తుంది. ఇంతవరకు బ్రౌజర్లు ఇంటర్ఫేస్లా మాత్రమే ఉండేవి. కానీ, ChatGPT Atlas ఒక వ్యక్తిగత అసిస్టెంట్‌లా మారిపోయింది.
చదివేది అర్థం చేసుకుంటుంది: ఏదైనా ఆర్టికల్, ఆఫీస్ ైస్లెడ్స్ అర్థం కాకపోతే, స్క్రీన్షాట్లు తీసి వేరే యాప్‌లో అడగాల్సిన పనిలేదు. ఇది మనం చూస్తున్న పేజీని చూసి, అర్థం చేసుకుని వాటి గురించి మనం అడిగిన ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇస్తుంది.
గోప్యత మన చేతుల్లోనే: ప్రైవేట్‌గా బ్రౌజ్ చేసినా, AI అసిస్టెంట్ కొన్ని వివరాలు గుర్తుంచుకుంటుందేమో అనే భయం అక్కర్లేదు. ‘ఇన్‌కాగ్నిటో మోడ్’ ఆన్ చేస్తే, AI అసిస్టెంట్ ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది. అంతేకాదు, ఏయే వెబ్సైట్లను AI అసిస్టెంట్ చూడాలి, గుర్తుంచుకోవాలి అనేది మనమే ఎంచుకోవచ్చు. అలా మన గోప్యత మన చేతుల్లోనే ఉంటుంది.
ఎవరికి అందుబాటులో ఉంది?
యాపిల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, త్వరలోనే Windows, iOS (iPhone), Android యూజర్ల కోసం కూడా వస్తుందని OpenAI హామీ ఇచ్చింది. మీరు దీన్ని వాడుకోవాలంటే మీ Mac
కంప్యూటర్లో ఈ మూడు ఉండాలి:
బ్రౌజర్‌ను ఇన్స్టాల్ చేయడం చాలా సులభం. కేవలం ఈ నాలుగు స్టెప్స్ ఫాలో అయితే చాలు. chatgpt.com/atlas వెబ్‌సైట్‌కు వెళ్లి ఇన్‌స్టాలర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయిన ఫైల్‌ను ఓపెన్ చేసి, Atlas ఐకాన్‌ను Applications ఫోల్డర్లోకి డ్రాగ్ చేయాలి. తర్వాత అప్లికేషన్‌ను ఓపెన్ చేసి, ChatGPT అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. మనం ఇంతకు ముందు వాడుతున్న Chrome గానీ, మరేదైనా బ్రౌజర్ నుంచి పాత పాస్వర్డ్లు, బుక్మార్క్లు ఒకే క్లిక్‌తో Atlasలోకి తెచ్చుకోవచ్చు. ఈ Atlas బ్రౌజర్‌ను డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేసుకుంటే, మొదటి ఏడు రోజుల పాటు మీకు ఎక్కువ ఫీచర్లను వాడే అవకాశం లభిస్తుంది.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్