చాయ్‌లో అద్దుకొని తింటే బ్రేక్‌ఫాస్ట్ అయినట్టే! కూరగాయ ముక్కలు, చీజ్‌తో కలిపి తింటే బర్గర్‌గా మారి ఈవెనింగ్ హంగర్ తీర్చేస్తుంది! లేనివాడి అల్పాహారమూ అదే. ఉన్నవాడి చిరుతిండీ అదే! అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండే ఆహార పదార్థం బన్. వేసవిలో ఇదే బన్ కాస్తా ఐస్‌క్రీమ్‌గా మారి చవులూరిస్తున్నది. రెండు బన్నుల మధ్య చేరిన చల్లటి మిఠాయిని ఆవురావురుమంటూ తినేస్తున్నారు ఐస్‌క్రీమ్ ప్రియులు. మెత్తదనానికి, చల్లదనం తోడై ముచ్చటైన మూడో టేస్ట్ జిహ్వకు తగులుతున్నదని మురిసిపోతున్నారు. తమకు నచ్చిన ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌ను బన్‌లోకి చొప్పించి లొట్టలేసుకొని లాగించేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మొదలైన ఈ బన్ ఐస్‌క్రీమ్ ట్రెండ్ వేసవి వేళ మరింత ఊపందుకున్నది.