భృంగరాజు.. సంప్రదాయ మూలిక. స్థానికంగా ‘గుంటగలిజేరు’ అంటారు. జుట్టు పెరగడానికి, పిత్త దోషాల నివారణకు భృంగరాజ తైలాన్ని వాడతారు. భృంగరాజును ‘మూలికల్లో రారాజు’గా పేర్కొంటారు. ఈ మొక్క భారత్, థాయ్‌లాండ్, బ్రెజిల్ దేశాల్లో కనిపిస్తుంది. భృంగరాజు ఉపయోగాలు, దుష్ఫలితాల గురించి తెలుసుకుందాం.
భృంగరాజ ఆకులను కొబ్బరినూనె, బాదంనూనె, నువ్వుల నూనెతో కలిపి తైలం తీస్తారు. ఈ నూనెను క్రమం తప్పక వాడితే జుట్టు కుదుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది. ఇందులోని విటమిన్-ఇ కేశాల పెరుగుదలను అడ్డుకునే ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది.
చుండ్రు ఒక్కసారి అంటుకుందంటే వదిలించుకోవడం కష్టం. భృంగరాజ తైలంలో ఉండే యాంటీమైక్రోబియల్, యాంటీఫంగల్ గుణాలు చుండ్రు రాకుండా నివారిస్తాయి. అప్పటికే ఉన్న సమస్య నుంచి విముక్తినిస్తాయి.
భృంగరాజ తైలం జుట్టు నెరిసే క్రమాన్ని నెమ్మదింపజేస్తుంది. పైగా దీనికి కేశాలను నల్లబరిచే గుణాలు కూడా ఉన్నాయి. దీని గురించి మరింత
లోతైన అధ్యయనం జరగాలి.
భృంగరాజ తైలం విశ్రాంతిని చేకూర్చుతుంది. తలకు పట్టించుకుంటే కండరాలకు రిలాక్సేషన్ లభిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కారణంగా నిద్రాదేవి ఇట్టే వరిస్తుంది.
భృంగరాజ మొక్కలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని చర్మానికి మర్దన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సోరియాసిస్, డెర్మటైటిస్, మొటిమలు లాంటి సమస్యల చికిత్సలో సహాయకారి.
భృంగరాజ తైలాన్ని రుద్దినప్పుడు కొందరిలో మంటగా అనిపిస్తుంది. భృంగరాజు ఆకుల్ని తిన్నప్పుడు మూత్రం అధికమయ్యే ముప్పు ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, బాలింతలు వాడకూడదని చెబుతారు నిపుణులు.