చింతపండు.. రెగ్యులర్‌గా వంటల్లో వాడేస్తుంటాం. పులుసు తీసి చారుల్లో, కూరల్లో ఉపయోగించినా.. గింజల్ని మాత్రం పడేస్తుంటారు. అయితే, చింతగింజల్లోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చింతగింజల పొడి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల దంతాల మీద ఒక రకమైన పొర ఏర్పడుతుంది. చింత గింజల పొడితో పళ్ల మీద రుద్దడం వల్ల ఈ పొర తొలగిపోతుంది. చిగుళ్లూ ఆరోగ్యంగా మారుతాయి.
అజీర్ణాన్ని తగ్గించడంలో చింతగింజల రసం దివ్యౌషదమే! ఇందులోని డైటరీ ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
పాంక్రియాస్‌ని రక్షించే గుణం చింతగింజల్లో ఉంది. ఈ పొడి నీరు తాగితే రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. ఇందులోని పొటాషియం.. అధిక రక్తపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
చింతగింజల్లో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. అయితే, చింత గింజల పొడి ఎలా వాడాలో నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.