ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచడంలోనూ గ్రీన్ టీ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్ గుణాలు చర్మాన్ని కాంతిమంతంగా చేయడానికి ఉపయోగపడతాయి. జుట్టు సంరక్షణలోనూ గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్, టానిన్స్ కండ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించడంలో సాయపడతాయి. గ్రీన్ టీ లోని విటమిన్ కె.. రక్తప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది. వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను అరగంటపాటు ఫ్రిజ్లో పెట్టి కళ్లపై పది నిమిషాలు ఉంచుకోవాలి. రోజుకి రెండుసార్లు ఇలా చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.
ముఖంపై ముడతలను మటుమాయం చేయడానికి కూడా గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. రెండు స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు, అర టీస్పూన్ గ్రీన్ టీ పొడి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. కాసేపటి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల ముఖం నిగారిస్తుంది. గ్రీన్ టీ లోని యాంటీ ఏజింగ్ గుణాలు చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
ముఖం మీది మొటిమలు, వాటి వల్ల వచ్చిన మచ్చలను తగ్గించడంలో గ్రీన్ టీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అర కప్పు గ్రీన్ టీ పొడిలో తగినన్ని నీళ్లు పోసి పేస్టులా చేసుకుని ముఖం, మెడ చుట్టూ ప్యాక్లాగా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ఉన్న మృతకణాలు తొలిగిపోయి మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం మెరుస్తుంది.