Life Style | అత్తలేని కోడలు ఉత్తమురాలు అనేది పాత మాట. అత్త ఉన్న కోడలూ.. అందులోనూ అత్త ఉద్యోగస్థురాలైన కోడలు కెరీర్లో మరింత ఉత్తమురాలని చెబుతున్నాయి తాజా సర్వేలు. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నేతృత్వంలో జరిగిన.. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా-2023’ నివేదిక ఈ విషయాన్ని బల్లగుద్ది చెప్పింది. అత్తలు ఉద్యోగినులు అయిన కుటుంబాల్లో .. దాదాపు 70 శాతం కోడళ్లు ఏదో ఓ కొలువు చేస్తూనే ఉంటారట. ఎందుకంటే, కెరీర్ ఉమెన్ అయిన అత్తకు.. ఉద్యోగ జీవితంలోని కష్ట నష్టాలు తెలుస్తాయి.
ఇంటిని-ఆఫీసును సమన్వయం చేసుకోవడం ఎంత పెద్ద సవాలన్నది అప్పటికే అర్థమై ఉంటుంది. ఆ ఇబ్బందిని అధిగమించిన అనుభవంతో కోడలి పరిస్థితినీ అర్థం చేసుకుంటుంది. ఆఫీసుకు వెళ్లేలోపు వంట చేయలేదనో, రెండో కప్పు కాఫీ ఇవ్వలేదనో, ఆడపడుచు వచ్చినప్పుడు ఆఫీసుకు సెలవు పెట్టలేదనో వేధించుకుని తినదు. తనవంతుగా ఇంటి పనిలో సహకరిస్తుంది. ఆఫీసు పనిలోనూ సాయపడుతుంది. కొవిడ్ సంక్షోభ సమయంలో పురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయారు. ఆ నిస్పృహ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్వయం ఉపాధి మార్గం వైపు నడుస్తున్నట్టు కూడా నివేదిక పేర్కొన్నది.