యూ ట్యూబ్ ద్వారా వంటలు నేర్చుకోవచ్చు, ఆరోగ్య సలహాలు తెలుసుకోవచ్చు. కొత్త నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఇంకా ఎన్నో ముచ్చట్లు వినొచ్చు. ఇలాంటిదే ‘అర్రే’. కాకపోతే ఇక్కడ వీడియో ఉండదు. అన్నీ మాటల మూటలే. రేడియోలా వింటూ కూర్చోవడమే. ఆసక్తి ఉంటే.. మీరూ మాట్లాడొచ్చు. నచ్చింది చెప్పొచ్చు. ఇంగ్లిష్, హిందీ, తమిళ భాషల్లో దీని బీటా వెర్షన్ (అభివృద్ధి దశలో) ఉంది. త్వరలోనే తెలుగులోనూ అందుబాటులోకి రానున్న ‘అర్రే’.. మహిళల కోసమే రూపొందిన మొదటి అప్లికేషన్‌గా చరిత్రలో నిలవడం ఖాయం.
మహిళా కంటెంట్ క్రియేటర్స్‌కు ఇదో కొత్త అవకాశం. ‘ఇక్కడ రకరకాల కమ్యూనిటీలు ఉంటాయి. సబ్‌స్ర్కైబర్స్, ఫాలోవర్స్‌ను బట్టి ఆదాయం వస్తుంది’ అని చెబుతున్నారు అర్రే సహ వ్యవస్థాపకురాలు నియతి మర్చంట్. ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ కంపెనీ కేపీఎంజీలో సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన నియతి.. స్పోర్ట్స్, మీడియా కంపెనీల్లోనూ కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ‘ప్రాజెక్ట్ అర్రే వాయిస్’ చేపట్టారు. ఆసక్తి ఉన్న మహిళలు రాజకీయాలు, కళలు, సంస్కృతి, చట్టాలు, సైన్స్, సినిమాలు, ఆరోగ్యం, వంటలు, పిల్లల పెంపకం, ఉద్యోగాలు, సైకాలజీ, టెక్నాలజీ.. ఆసక్తిని బట్టి ఏ రంగం గురించి అయినా మాట్లాడవచ్చు. మగవాళ్లది మాత్రం.. శ్రోతల పాత్రే.