సైకిల్ తొక్కడం పిల్లలకు సరదా. యువతకు సాహసం. పెద్దలకు ఆరోగ్యం. అమెరికా అమ్మాయి లేల్ విల్కాక్స్కి సైకిలే ప్రపంచం.స్నేహం, సాహసం, ప్రేమ, ప్రయాణం, జీవితం.. తనకన్నీ సైకిలే అంటుందామె. అబ్బాయి ప్రేమలో పడి సైక్లింగ్ అలవాటు చేసుకున్న ఆ అమ్మాయి.. బ్రేకప్ అయినా సైకిల్ రైడ్‌ని బ్రేక్ లేకుండా సాగించింది. అదే సైకిల్‌పై ప్రపంచాన్ని చుట్టొచ్చి గిన్నిస్ రికార్డులకెక్కింది! ఆ సాహస ప్రేమగాథే ఈ సైకిల్ రైడ్!
లేల్ విల్కాక్స్ అమెరికాలోని అలస్కాలో పుట్టి పెరిగింది. నేచురల్ సైన్స్, ఫ్రెంచ్ సాహిత్యంలో బ్యాచ్‌లర్ డిగ్రీ చదివింది. పదిహేనేండ్ల కిందట నికొలస్ కమన్ అనే అబ్బాయి ఆమెకు పరిచయమయ్యాడు. అతని ప్రేమలో పడింది. అతనితోపాటే సైకిల్ ప్రేమలోనూ పడింది. ప్రేమ, సైకిల్ రైడ్ రెండే ప్రపంచం అన్నట్టుగా సాగిపోయారిద్దరూ. ప్రేమికుడితో కలిసి సైకిల్ రైడ్ మొదలుపెట్టింది. ప్రేమలో అలా సాగిపోతున్న ఆ జంట లక్ష్యం.. లక్ష మైళ్ల దూరం కలిసి ప్రయాణించడం. అందుకోసం 30కి పైగా దేశాలు పర్యటించాలని అనుకున్నారు. అమెరికాలోని కొన్ని నగరాల్లో సైకిళ్లపై విహరించారు. ఈ ప్రయాణంలో పాఠశాల పిల్లల కోసం సైకిళ్లను సేకరించడం, విద్యార్థులకు సైకిల్ మరమ్మతులు నేర్పించడం లాంటివి చేసేవారు.
ఈ క్రమంలో విల్కాక్స్ Trans Am 2016 పోటీల్లో పాల్గొంది. పోటీలో భాగంగా అమెరికా పశ్చిమ తీరం నుంచి బయలుదేరి తూర్పు తీరానికి చేరుకోవాలి. 4,400 మైళ్ల దూరాన్ని 18 రోజుల్లో అలవోకగా పూర్తి చేసింది విల్కాక్స్. సైక్లిస్టులు ధరించే ప్రత్యేకమైన దుస్తులు లేకుండా, సాధారణ డ్రెసింగ్‌తో పోటీపడ్డ ఆమె గెలుపును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రైడ్‌ను పూర్తి చేసిన తొలి మహిళగా, గెలిచిన మొదటి అమెరికన్‌గా రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత లెక్కలేనన్ని సైకిల్ రైడ్స్‌లో గెలిచింది. ఎంత గెలిచినా ప్రపంచ సైకిల్ యాత్ర చేయాలన్న కోరిక తీరలేదు. ఆ లక్ష్యం కోసం ప్రణాళికలు రూపొందించుకుని సాగుతున్న విల్కాక్స్, కమన్ జోడీ 2017లో విడిపోయింది. ఉత్సాహంగా సాగిన వాళ్ల ప్రయాణానికి బ్రేక్ పడింది.
ప్రపంచ యాత్ర
కమన్తో ప్రేమ చెడినా అతని వల్ల అలవడిన సైకిల్ రైడ్‌ని విల్కాక్స్ వదిలిపెట్టలేదు. చికాగో నగరంలో మే 26న ప్రపంచ సైకిల్ యాత్రను మొదలుపెట్టింది. 1,268 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూయార్క్ చేరుకొని తొలి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఆ తర్వాత ఐరోపా యాత్ర కోసం విమానంలో బయలుదేరి పోర్చుగల్‌లో వాలింది. అక్కడి నుంచి తూర్పు దిశగా సవారీ చేస్తూ స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియా, స్లొవేకియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా, బల్గేరియా, టర్కీ, జార్జియా దేశాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగించింది. రెండో దశలో 7,683 కిలోమీటర్ల భారీ దూరాన్ని సులభంగా దాటేసింది. అంతే ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో అడుగుపెట్టింది. జూలై మాసమంతా ఆ దేశంలోనే గడిపింది. తర్వాత న్యూజిలాండ్‌కు చేరుకొని వారంలో అక్కడ పర్యటన ముగించింది. అక్కడి నుంచి ఉత్తర అమెరికా బయలుదేరింది. అలస్కాలోని ఆంకోరేజ్ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించింది. ఆంకోరేజ్ నుంచి పశ్చిమ కెనడాకు దిగువగా తీర ప్రాంతంలో సైకిల్ యాత్ర సాగిస్తూ లాస్ ఏంజెల్స్ మీదుగా మొట్టమొదట తాను బయలుదేరిన చికాగోకు చేరుకుంది. ఇలా సెప్టెంబర్ 11న ప్రపంచ సైకిల్ యాత్రను ముగించింది.
ప్రేమ యాత్ర
108 రోజుల 12 గంటల 12 నిమిషాల సుదీర్ఘమైన ప్రయాణంలో 18,125 మైళ్లు ప్రయాణించింది విల్కాక్స్! రోజుకు సగటున 166 మైళ్ల దూరం ప్రయాణం చేసిందంటే ఆమె సంకల్ప బలాన్ని అర్థం చేసుకోవచ్చు. కొండ ప్రాంతాలు, ఎగుడు దిగుడు దారుల్లోనూ మొక్కవోని దీక్షతో ప్రయాణం సాగించింది. మంచి రోడ్డు మార్గం ఉన్న రోజు 200 మైళ్ల దూరాన్ని అలవోకగా సైక్లింగ్ చేశానని విల్కాక్స్ చెప్పుకొచ్చింది. ఈ సుదీర్ఘ ప్రయాణంతో సైకిల్‌పై ప్రపంచాన్ని వేగంగా చుట్టొచ్చిన మహిళగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్కాటిష్ సైక్లిస్ట్ జెన్నీ గ్రహమ్ ఆరేండ్ల క్రితం… 124 రోజుల 11 గంటలు సైకిల్‌పై ప్రయాణించి గిన్నిస్ రికార్డుల కెక్కింది. ఆ రికార్డుని విల్కాక్స్ అధిగమించి చరిత్రకెక్కింది. 38 సంవత్సరాల వయసులో ఈ రికార్డ్ సాధించడం మరో అద్భుతం.
సైకిల్ సవారీ అంటే సుదూర
ప్రయాణమే కాదు.. అదో సాహసం. ఎత్తయిన పర్వతాలు, లోతట్టు ప్రాంతాలు, మంచు ఎడారులు, తుఫానులు, దుర్గమ అరణ్యాలు, నదులు దాటేందుకు ఎన్నో సాహసాలు చేస్తూ రాత్రీ పగలు ప్రయాణించాలి. అలసట తప్ప భీతి లేని ఈ ప్రయాణంలో ఆమెకు మరో తోడు దొరికింది. రిగులే అనే ఫొటో జర్నలిస్ట్‌ని వివాహమాడింది. ఆయన కూడా ఆమెతో కలిసి సైకిల్ రైడ్ మొదలుపెట్టాడు. విల్కాక్స్ సైకిల్ యాత్రలను డాక్యుమెంటరీలు తీసి భార్యపై ప్రేమను చాటుకున్నాడు.
హిమాలయాల కన్నా ఎత్తు
సముద్రాలు, అగ్ని పర్వతాలు, ఎడారులతో ఉన్న భూమిపై ఒకచోట నుంచి బయలుదేరి ప్రపంచమంతా సైకిల్‌పై చుట్టి రావడం సాధ్యం కాదు. కాబట్టి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సైకిల్ యాత్రికులకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఒక ఖండం నుంచి మరో ఖండానికి ప్రయాణించడానికి ఇతర ప్రయాణ మార్గాలు ఎంచుకునే వెసులుబాటు కల్పించింది. కానీ, మొత్తం యాత్ర 18,000 మైళ్ల దూరానికి తగ్గ కూడదు. ఉత్తర, దక్షిణ దృవ సమీప ప్రాంతాల మధ్య సైకిల్ యాత్ర కొనసాగించాలనే నిబంధనా ఉంది. ఈ షరతులకు అనుగుణంగా తన ప్రపంచ యాత్ర లక్ష్యాన్ని నిర్దేశించుకుని సునాయాసంగా విల్కాక్స్ లక్ష్యం చేరుకుంది. గిన్నిస్ రికార్డులకెక్కింది. విల్కాక్స్ ప్రపంచ యాత్ర ద్వారా దూరంతోపాటు భూగోళాన్ని కింది నుంచి పైకి ఎగబాకిందని చెప్పాలి. అలా గుండ్రంగా ఉన్న భూమిపై ఆమె 6,29,880 అడుగుల ఎత్తుకు సైకిల్‌పై ఎగబాకింది! ఈ ఎత్తు హిమాలయాల కంటే 21 రెట్లు ఎక్కువన్నమాట. ఆశ్చర్యంగా ఉంది కదా!