చాట్ జీపీటీ మన అనుమానాలను తీరుస్తుందనే ఇన్నాళ్లూ విన్నాం. కానీ అప్పులనూ తీర్చేలా పనిచేస్తుందని తెలుసా?! ఇది నిజం. అమెరికా డెలావర్ ప్రాంతంలో ఉండే ఓ మహిళా రియల్టర్ చాట్ జీపీటీ సలహాలను పాటిస్తూ కేవలం నెల రోజుల్లో 20 లక్షల రూపాయల అప్పును తీర్చగలిగింది. నిజజీవితంలో పనికొచ్చేలా అది చెప్పిన వివిధ సలహాలు పాటిస్తూ ముందుకెళ్లడమే తను అప్పుల ఊబి నుంచి కాస్త బయట పడటానికి కారణమని ఆమె చెబుతుండటం ఎవరికైనా ఆసక్తి కలిగించే విషయమే. మరి ఆమె ఎవరు? ఆ అప్పుల్ని ఎలా తీర్చగలిగారు?.. అన్నది తెలుసుకుందాం రండి.
జెన్నీఫర్ అలాన్… అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. వయసు 35 సంవత్సరాలు. డబ్బులు బాగానే సంపాదించినా, వాటిని సక్రమంగా వినియోగించడం చేతకాక పోవడంతో ఒకానొక దశలో రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పు చేయాల్సిన స్థితికి చేరుకుంది. ముఖ్యంగా ఆమెకు ఓ బిడ్డ పుట్టాక ఖర్చులు మరింత పెరిగాయి. అలాగని తానేం విలాసవంతంగా బతకలేదు. సాధారణ జీవితం గడపడానికీ డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడేసరికి సమస్యను తీర్చమంటూ చాట్ జీపీటీని ఆశ్రయించిందామె. నిజజీవితంలో ఆచరించగలిగేలా కొన్ని సూచనలు చేయమని దానికి చెప్పింది. అయితే నిజంగానే అది విలువైన సూచనలు చేసింది. వాటిని పాటించిన ఆమె ఒక్క నెలలో తన అప్పుల్లో సగం… అంటే 20 లక్షలకు పైగా మొత్తాన్ని తిరిగి చెల్లించగలిగింది.
బ్యూటీ చాలెంజ్, వాటర్ చాలెంజ్, గ్రీన్ చాలెంజ్లలాగే తన అప్పు తీర్చేందుకు చాట్ జీపీటీతో కలిసి థర్టీ డే చాలెంజ్‌ను తీసుకుంది జెన్నీఫర్. అందుకోసం అప్పటికప్పుడు తాను చేయదగ్గ సలహాలు ఇమ్మంటూ కృత్రిమ మేథ ఆధారితంగా పనిచేసే చాట్ జీపీటీని అడిగింది. ముందుగా వాడని నెలవారీ, ఏడాది సబ్స్క్రిప్షన్లను తొలగించమని, నిరుపయోగంగా వదిలేసిన అకౌంట్లను పరిశీలించమని చెప్పింది అది. అలా కొన్ని సబ్స్క్రిప్షన్లు ఆపేసి, తర్వాత అకౌంట్లు, డిజిటల్ వ్యాలట్లను పరిశీలిస్తుండగా క్రియారహితంగా ఉన్న బ్రోకరేజ్ అకౌంట్లో ఆమెకు 10000 డాలర్లు కనిపించాయి. అంటే మన డబ్బుల్లో ఎనిమిదిన్నరల లక్షల పై చిలుకే. ఇక నెలవారీ కిరాణా ఖర్చులకు సంబంధించీ అది కొన్ని చిట్కాలు సూచించింది.
ముందే కొని ఉన్న పదార్థాలతో ఆహారం తయారు చేసుకోవడం, అలాగే పాడయ్యే అవకాశంతో పాటు ఖరీదు కూడా ఎక్కువ ఉండే తాజా కూరలతో పోలిస్తే తక్కువ ఖరీదులో దొరికే క్యాన్డ్ ఫుడ్‌ను అంటే నిల్వ ఉండే ఆహార పదార్థాలను ఎంచుకోవడంలాంటివి చెప్పింది. దీని ద్వారా ఆమె నెలలో ఏకంగా 50 వేల రూపాయల దాకా మిగిల్చగలిగిందట. అలా 30 రోజుల చాలెంజ్ పూర్తయ్యే సరికి తన అప్పులో సగం అంటే సుమారు 20 లక్షల రూపాయలను తీర్చేసింది.
ఇక, మిగతాది కూడా తీర్చడం కోసం మరో థర్టీ డే చాలెంజ్‌ను తీసుకోబోతున్నట్టు చెప్పింది జెన్నీ. అంకెలు చూసి భయపడకుండా ఏం చేయగలమో ఆలోచిస్తూ, దాన్ని ఆచరించే పనిలో పడితే నెమ్మదిగా అప్పులు వాటంతట అవే తరిగిపోతాయని ధైర్యంగా చెబుతున్నదామె! అధునాతన సాంకేతికత అనర్థాలనే కాదు, సరిగ్గా వినియోగిస్తే అద్భుత ఫలితాలనూ ఇస్తుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది కదూ ఈ సంఘటన.