Cooking | రాజకీయ నాయకులకు విషయ పరిజ్ఞానం, వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటాయనుకుంటాం. సినీ తారల దృష్టంతా తమ అందచందాల మీదే అని భావిస్తాం. కానీ, వారికీ కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొందరు ఆహారాన్ని ఆస్వాదించడంలో రారాజులైతే, మరికొందరు గరిట తిప్పడంలో నలభీములమేనని బలంగా చెప్పుకొంటున్నారు. పలువురు బాలీవుడ్ నటులు, ప్రముఖ నేతలు పాకశాస్త్రంలో తాము ప్రవీణులమని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. రుచులను ఆస్వాదించంలోనే కాదు, శుచిగా వండటంలోనూ తాము భీమసేనుడి వారసులమని సగర్వంగా ప్రకటిస్తున్నారు.
వంటలు వండటం ఒక కళ. పాకశాస్త్రం అనుభవం కొద్దీ వచ్చే విద్య కాదు. అనురాగంతో నేర్చుకోవాల్సిన కళ అంటారు పాకయాజులు. ఒక్కసారి వంట పట్టు చిక్కిందా.. స్వయం పాకం రుచి చూస్తే గానీ తృప్తి కలగని మహానేతలు ఎందరో! భారత మాజీ ప్రధాని వాజ్పాయ్ కూడా ఆ తరహా వ్యక్తే! మంచి హస్తవాసి ఉన్న వంటవాడు. వాజ్పాయ్ కిచిడీ వండితే.. ఆ రోజు ఉపవాస దీక్షలో ఉన్నవాళ్లు సైతం.. వ్రతభంగం చేసుకునేవాళ్లట. తన ఇంటికి అద్వానీ కలవడానికి వస్తే.. ప్రేమగా కిచిడీ వండిపెట్టేవారట. సీ ఫుడ్ వండటంలోనూ ఈ కవినేత సిద్ధహస్తుడే!! కిచిడీ అంత చక్కగా వండేవాడు కాబట్టే.. కిచిడీ లాంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నిర్వహించారని అప్పట్లో పొలిటికల్ జోక్ వినిపించేది! ఇటీవల వాజ్పాయ్ బయోపిక్ ‘మై అటల్ హూ’ విడుదలైంది. అందులో అటల్ పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠి.. షూటింగ్ జరిగినన్ని రోజులూ కిచిడీ మాత్రమే తిన్నాడంటే.. వాజ్పాయ్కీ, కిచిడీకి ఎంత అవినాభావ సంబంధం ఉందో తెలుసుకోవచ్చు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాంచి ఆహారప్రియుడు. వివిధ రుచులను ఆయన పరిచయం చేసిన విధానం.. ఆ పదార్థం కన్నా మిన్నగా ఉంటుంది. ‘ఒకసారి పుణెలో రాత్రి పది గంటలు దాటింది. అక్కడ ఫలానా హోటల్లో చేసే ఆలూ పకోడీ తినాలనిపించింది. అప్పటికప్పుడు బయల్దేరా..’ ఇలా ఆ పదార్థాన్ని చేజిక్కించుకున్న వైనాన్ని ఆసక్తికరంగా పంచుకుంటారు గడ్కరీ. అక్కడితో ఆగిపోరు. సదరు పదార్థం ఎలా చేస్తారో కూడా చవులూరేలా వర్ణిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా రీల్స్‌లో ఆయన పొలిటికల్ స్టేట్మెంట్ల కన్నా.. వంటకాల ముచ్చట్లే ఎక్కువ వైరల్ అవుతున్నాయి.
ఒకప్పటి యాక్షన్ హీరో జాకీష్రాఫ్ గొప్ప భోజనప్రియుడని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వెలికి తీసింది. ఆయనగారు తినడంలోనే కాదు.. వండటంలోనూ మహారాజే! పాకశాస్త్ర అనుభవాలను తెలుసుకోవడానికి ఆయన్ను ఇంటర్వ్యూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తన ఫామ్‌హౌజ్‌లో పాత్రికేయులకు ఏయే పదార్థాలు ఎలా వండాలో విడమర్చి చెప్పిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘వంకాయ బడితం’ చేసే విధానాన్ని జాకీష్రాఫ్ వర్ణించిన వైనానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ ఒక్క రీల్.. లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టింది. తరచూ వంటింటి చిట్కాలు చెబుతుంటారు కూడా! ఏ పాకంలో ఎంత ప్రమాణంలో పదార్థాలు వేయాలో వివరిస్తుంటారు జాకీ!
ఫ్యామిలీ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌ను చేసుకున్నందుకు తాను అదృష్టవంతురాలినని కాజోల్ పలు సందర్భాల్లో చెబుతూ ఉంటుంది. ఆయన చేయి కాల్చుకోకుండా వంట చేయడంలో దిట్ట కావడం కూడా ఒక కారణమని తేలింది. శ్రీమతి అంటే ప్రేమ ఉన్న అజయ్.. మొఘలాయీ రుచులు ఆమెకు ప్రేమగా వండిపెడతాడట. మటన్ వెరైటీలు చేయడంలోనూ తనను కొట్టేవాడు లేడని మీసం మెలేస్తుంటాడు అజయ్ దేవ్‌గణ్.
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ తినడం తక్కువే! కానీ, వండటంలో ఆయనకు మంచి పేరుంది. థాయ్ వెరైటీలు చేయడంలో అక్షయ్ కింగ్ అని బాలీవుడ్ టాక్. షూటింగ్ లేనప్పుడు.. వంటింట్లోనే కాలక్షేపం చేస్తాడట. ఆ రోజు థాయ్ రుచుల ఘుమఘుమలు ఇల్లంతా నిండిపోతాయట.