నటి సదా సయీద్… జంతు ప్రేమికురాలు, జంతు రక్షకురాలిగా మాత్రమే కాదు. అంతర్జాతీయ వేగన్ ఉద్యమం‘వేగన్యువరీ’కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా తనను అటువైపుగా మళ్లించిన సంఘటనల గురించి ఇలా చెబుతున్నారు..
నేను జంతు ప్రేమికురాలిని. పిల్లులు, కుక్కలు పెంచుకునే అలవాటు ఉండేది. అదే సమయంలో మాంసాహారిని కూడా. కానీ పదేండ్ల క్రితం నాలో మార్పు వచ్చింది. కొంతమంది కోడిపిల్లను ఇబ్బంది పెట్టడం చూసి తట్టుకోలేకపోయాను. దాన్ని కాపాడి ఇంటికి తెచ్చుకున్నాను. అప్పటినుంచి చికెన్ తినకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఆ తీర్మానమే నన్ను వేగనిజం వైపు మళ్లించింది. పాడి పరిశ్రమకు సంబంధించి ఓ వీడియో చూశాక.. కన్నీళ్లు ఆగలేదు. అంతకుముందు వరకూ, డెయిరీ ఫామ్లో.. దూడలు తాగిన తర్వాత మిగిలిన పాలనే మనకు అమ్ముతారని అనుకునేదాన్ని. వ్యాపారం కోసం లేగదూడలను అర్ధాకలికి గురిచేస్తారని ఆ వీడియో చూశాకే అర్థమైంది.
‘జాతీయ పాల దినోత్సవం’ రోజున పాల ఉత్పత్తులను వదిలిపెట్టి సంపూర్ణ వేగన్ కావాలని నిర్ణయించుకున్నాను. అన్నం, పప్పు, రొట్టెలు, ఆకుకూరలు ఇవన్నీ సహజంగా ‘వేగన్’ కిందికే వస్తాయి. పాలు, నెయ్యి, పెరుగు, పనీర్ తదితర పాల ఉత్పత్తులను పక్కన పెట్టాల్సిందే. స్వీట్లు కూడా ఈ జాబితాలోకి రావు. వేగన్ జీవనశైలి వల్ల ఆరోగ్యం మెరుగుపడింది. చర్మం నిగారింపు పెరిగింది. మానసికంగా కూడా రిలాక్స్ అవుతున్నాను.