పెండ్లి వేడుక ఓ ఫ్యాషన్ స్టేట్మెంట్. హల్దీ, మెహందీ, సంగీత్.. వగైరా ఉత్తరాది సంప్రదాయాలూ మనకు తోడయ్యాయి. వివాహమంటేనే సంబురం కాబట్టి ఈ సంప్రదాయాలను తెలుగువారు కూడా బాగానే అందిపుచ్చుకున్నారు. వాటికి తోడు మరో ఆచారం వచ్చేస్తున్నది. అదే కలీరా! ఇప్పుడు అది మరింత సృజనాత్మకంగా, ఆధునికంగా మారింది.
బంధుమిత్రులు, ఆత్మీయుల పేర్లు, తమ జీవితంలో ముఖ్యమైన తేదీలు లాంటి గుర్తులతో కలీరాలను రూపొందిస్తున్నారు. కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా లెహంగా, చీర, తలపాగాల మీద కూడా ఈ ముద్రలు కనిపిస్తున్నాయి. వినూత్నమైన కలీరాలను రూపొందించడం సరికొత్త కళగా మారింది. కుక్క పిల్లల పేర్ల దగ్గర నుంచి ప్రేమలో పడిన తేదీల వరకు.. కాదేదీ కలీరాకు అనర్హమనిపిస్తున్నది. కియారా అడ్వాణి, కె.ఎల్.రాహుల్… లాంటి సెలెబ్రిటీల పెళ్లిళ్లలో ‘నోస్టాల్జియా కలీరా’ కూడా ఓ ముఖ్య ఆకర్షణగా మారింది.